| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘ఇది యాదిగా సతు లెన్నండుఁ బరపురు | షార్థినుల్ గాఁ జన; దన్యపురుషు సంగమంబునఁ జేసి సకలపాతకములు నగుఁ | బరిగ్రహభూత లయిన సతుల కిట్టిద మర్యాద యి మ్మనుష్యుల కెల్లఁ | జేసితి లోక ప్రసిద్ధి గాఁగ ’ నని ధర్మ్యమైన మర్యాద మానవులకుఁ | దద్దయు హితముగా ధర్మమూర్తి |
|
| ఆ. |
యబ్జభవసమానుఁ డగు శ్వేతకేతుండు | నిలిపె; నదియు ధారుణీ జనంబు నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు | నుండె శిష్ట సంప్రయుక్తిఁ జేసి. |
85 |
| వ. | మఱియుఁ ద్యిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండునట్లు మనుష్యులయందు శ్వేతకేతుండు సేసిన ధర్మస్థితికారణంబున నాఁటంగోలె. | 86 |
| క. |
పురుషులచే ధర్మస్థితిఁ | బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం తరము నిజపురుషభక్తియుఁ | బరపురుషవివర్జనంబుఁ బరిచిత మయ్యెన్. |
87 |
| తే. |
భర్తచేత నియోగింపఁ బడక సతికి | నెద్దియును జేయఁగాఁ దగ; దెద్ది యైన భర్తచేత నియోగింపఁ బడిన దానిఁ | జేయకునికి దోషం బని చెప్పె మనువు. |
88 |
| వ. | పతి నియోగించిన దానిం జేయని నాఁడు భార్యకుం బాతకం బని యెఱింగి కాదె తొల్లి సౌదాసుం డైన కల్మాషపాదుం డను రాజర్షిచేత నియుక్తయై వానిభార్య మదయంతి యనునది వసిష్ఠువలన నశ్మకుం డను పుత్త్రుం బడసె; నస్మజ్జన్మంబు నిట్టిద; మహాముని యయిన కృష్ణద్వైపాయనువలనఁ గురుకులవృద్ధిపొంటె నే ముద్భవిల్లితిమి; కావున నీ విన్నికారణంబులు విచారించి నా నియోగంబు సేయుము. | 89 |
| చ. |
అలయక ధర్మశాస్త్రములయందుఁ బురాణములందుఁ జెప్ప ను త్పలదళనేత్ర! విందుమ యపత్యము మే లని; కావునన్ యశో నిలయులఁ బుత్త్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ దళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్. |
90 |
| వ. | అని పుత్త్రముఖావలోకనలోలత్వంబున దీనవదనుం డై దేవిం బ్రార్థించినఁ గుంతియుం బుత్రోత్పాదనోన్ముఖి యై కుంతిభోజునింటఁ దనకొండుకనాఁడు దుర్వాసునిచేతం బడసిన మంత్రంబుతెఱంగు పతి కెఱింగించి ‘యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె; నేవేల్పు నారాధింతు? నాన తి’ మ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా జి ట్లనియె. | 91 |
| క. |
లలితాంగి! యెల్లలోకం | బులు ధర్మువునంద నిలుచుఁ; బొలుపుగ ధర్ముం దలఁపుమ; యాతఁడ మఱి వే | ల్పులలోపలఁ బెద్ద ధర్మమున సత్యమునన్. |
92 |
| వ. | అని నియోగించినఁ, గుంతియుం బతికిఁ బ్రదక్షిణంబుఁ జేసి సమాహితచిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు విధివంతంబుఁ జేసి ధర్ముని నారాధించిన, నా ధర్ముండును యోగమూర్తి ధరుం డై వచ్చి, వరం బిచ్చినం, గుంతియుఁ దత్ప్రసాదంబున గర్భంబు దాల్చి, సంవత్సరంబు పరిపూర్ణం బైన. | 93 |