| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అని వగచుచు నొక్కనాఁ డేకాంతంబునం బతియొద్ద గద్గద వచన యై తన మనోవాంఛితంబుఁ జెప్పి ‘కుంతీదేవి యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు; నట్లయిన నాకును నీకును లోకంబులకును హితం బగుఁ గావున నాకుఁ బుత్త్రోత్పాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి’ మ్మనిన మాద్రికిఁ బాండురా జి ట్లనియె. | 130 |
| క. |
నా వచనమున నపత్యముఁ | గావించును గుంతి నీకుఁ గడు నెయ్యముతో; నీ వగచిన యీ యర్థమ | చూవె మనంబునఁ దలంచుచుండుదు నేనున్. |
131 |
| వ. | అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్త్రి దయిన మనోవాంఛితంబుఁ జెప్పి ‘సకలలోక కల్యాణ కారు లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు వడయు’ మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన మాద్రికి. | 132 |
| తే. |
కవలవారు సూర్యేందుప్రకాశతేజు లా | శ్వినులయంశములఁ బుట్టి రమరగుణులు వారలకుఁ బ్రీతి నాకాశవాణి సేసె | నకుల సహదేవు లనియెడు నామయుగము. |
133 |
| క. |
ఊర్జితులు యుధిష్ఠిర భీ | మార్జున నకుల సహదేవు లన నిట్లు వివే కార్జితయశు లుదయించిరి | నిర్జరుల వరప్రసాదనిర్మితశక్తిన్. |
134 |
| వ. | అంత నట. | 135 |
| సీ. |
మృగ శాప భయమున జగతీశుఁ డప్పాండు | పతి శతశృంగపర్వతమునందుఁ బత్నీసమేతుఁడై యత్నంబుతో ఘోర | తప మొనరించుచు విపులశక్తి నమరవరప్రసాదమున ధర్మస్థితిఁ | గొడుకుల నేవురఁ బడసె ననియు విని వసుదేవుండు మనమున హర్షించి | యనుజను మఱఁదిని ఘనుఁడు చూడఁ |
|
| తే. |
దనపురోహితుఁ గశ్యపుం డను మహాత్ముఁ | జీరి పుత్తెంచె నవ్విప్రుచేత భాగి నేయు లగు కుమారులకు నమేయరత్న | భూషణావళు లిచ్చి విశేషలీల. |
136 |
| వ. | అ క్కశ్యపుండును జనుదెంచి పృథామాద్రీ సహితుం డయి యున్న యప్పాండురాజుం గని వసుదేవు సందేశంబుఁ జెప్పి యక్కుమారులకు రత్నభూషణాంబరంబు లిచ్చి, క్రమంబునఁ జౌలోపనయనంబు లొనరించి, వేదాధ్యయనంబు సేయించుచున్నంత వసంతసమయం బఖిలజీవలోకానందజననం బై యేర్పడం జనుదెంచిన. | 137 |