| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అట్టి మహాద్వంద్వయుద్ధంబున విజిగీషుం డయి పాంచాలుండు పాండవమధ్యముధనుర్మధ్యంబు భగ్నంబుగా నొక్కబాణంబున నేసి యార్చిన, నలిగి వాసవసుతుం డుద్యతాసిహస్తుం డయి శైలస్థలంబుమీఁదికి లంఘించుకొదమసింగంబునుంబోలె ద్రుపదురథంబుమీఁదికి లంఘించి వానిం బట్టికొనినఁ దత్సైన్యంబు హాహాకారంబు లెసంగ మహార్ణవంబునుంబోలె మ్రోయుచుండె నంత. | 87 |
| క. |
ప్రక్షీణదర్పు ద్రుపదు ర | థాక్షముతోఁ గట్టి తెచ్చి యర్జునుఁడు క్రియా దక్షుం డయి గురునకు గురు | దక్షిణగా నిచ్చి చేసెఁ దత్సమ్మదమున్. |
88 |
| వ. | ద్రోణుండును నర్జునుచేసిన పరాక్రమంబునకుఁ బరమహృష్టహృదయుం డై ద్రుపదుం జూచి నగుచు ని ట్లనియె. | 89 |
| క. |
వీ రెవ్వ రయ్య? ద్రుపదమ | హారాజులె! యిట్లు కృపణు లయి పట్టువడన్ వీరికి వలసెనె? యహహ! మ | హారాజ్యమదాంధకార మది వాసెనొకో? |
90 |
| ఆ. |
‘ఇంక నైన మమ్ము నెఱుఁగంగ నగునొక్కొ!’ | యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు విడిచిపుచ్చె గురుఁడు; విప్రులయలుకయుఁ | దృణహుతాశనంబు దీర్ఘ మగునె? |
91 |