| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | ఇట్లు పాండుకుమారు లపారగుణంబుల నెల్లవారికి నారాధ్యు లయి పరఁగుచున్న నందు ధనుర్విద్య నర్జును దృఢముష్టిలాఘవలక్ష్యవేధిత్వదూరాపాత జితశ్రమత్వంబులకు నసిగదాశక్తితోమరాదిప్రహరణప్రవీణతకుం బరమహీపాల పరాజయోత్పాదన పరాక్రమంబునకుఁ దనవలని భక్తిస్నేహంబులకు మెచ్చి భారద్వాజుండు వానికి బ్రహ్మశిరం బను దివ్యబాణంబు సప్రయోగనివర్తనంబుగా నిచ్చి యి ట్లనియె. | 98 |
| ఉ. |
దీని నగస్తి నాఁ బరగు దివ్యమునీంద్రుఁడు దొల్లి ప్రీతితో భూనుత! యగ్నివేశుఁ డను భూరిమునీంద్రున కిచ్చె; వారలున్ మానుగ నాకు నిచ్చిరి; క్రమంబున నేనును నీకు నిచ్చితిన్; దీనికి నీవ యర్హుఁడవు తేజమునం గడుఁ బెద్ద గావునన్. |
99 |
| వ. | ‘దీని మానవులయందుఁ బ్రయోగింపకుండునది; యల్పతేజులయందుఁ బ్రయుక్తం బయి యిది జగంబులఁ గాల్చు; నిన్ను బాధించు నట్టి మానవులు గలిగిరేని ప్రయోగించునది; వారి నశ్రమంబున సాధించు’ నని దాని మహిమ చెప్పి ‘నీవు నీ బంధుసమక్షంబున నాకు గురుదక్షిణ యి; మ్మిది యెయ్యది యనిన నాయుద్ధంబుసేయునపుడు నాతో నెన్నడుఁ బ్రతియుద్ధంబు సేయకుండు; మిదియ నాకు గురుదక్షిణ’ యనిన నర్జునుండు వల్లె యని యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడియె; నంత దుర్యోధనుండు యుధిష్ఠిరుయౌవరాజ్యాభిషేకంబునకు భీమార్జునయములపరాక్రంబునకు మనంబున సహింపనోపక కర్ణశకునిదుశ్శాసనులతో మంతనం బుండి యి ట్లనియె. | 100 |