| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
వారణావతమునవా రెల్లఁ బాండవా | గమనంబు విని సంతసమునఁ బెరిఁగి కరమొప్పఁ గరిరథతురగబలాఢ్యు లై | యెదురు వచ్చిరి మహాముదముతోడఁ; గలయంగ గృహములఁ గలువడములు గడు | విలసిల్లె నంబరతలము గప్పి మలయజమృగమదావిలసలిలంబుల | నిమ్ముగా నార్ద్రీకృతమ్ము లయిన |
|
| తే. |
యంగళుల నొప్పెఁ గర్పూరరంగవల్లు | లంగనలు గయిసేసి యుత్తుంగహర్మ్య తలము లెక్కిరి తత్పురీవిలసంబుఁ | జూచు పాండుకుమారులఁ జూచువేడ్క. |
149 |
| వ. | పాండుకుమారులు ననేకభూసురాశీర్వాదనాదాభినందితు లై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున నష్టమియు రోహిణినాడు వారణావతంబు సొచ్చి సర్వాలంకారసుందరం బయిన రాజమందిరంబున నున్న, కొన్ని దినంబులకుం బురోచనుండు దనచేసినచతుశ్శాల సకలజననయనాభిరామం బైన దానిం జూపినం జూచి పాండుసుతులు సంతసిల్లి, పురోచనశిల్పాచార్యులం, బూజించి పుణ్యాహరవపురస్సరంబుగా గృహప్రవేశంబు సేసి; రంతం బరాభిప్రాయమాయోపాయ ప్రయోగవిదుం డైన ధర్మతనయుండు దాని కృత్రిమరమణీయత నుపలక్షించి యల్లన భీమున కి ట్లనియె. | 150 |
| క. |
ఈ గృహ కుడ్యంబులు లా | క్షాగర్భము లాజ్య తైలగంధులు మఱి శ స్త్రాగారసమీపము మా | యాగృహ మగు నిది యవశ్య మాగ్నేయం బై. |
151 |
| క. |
దీని తెఱఁ గెఱిఁగినట్ల మ | హానిపుణుఁడు విదురుఁ డురువిషాగ్నులవలనన్ మానుగ నేమఱకుం డని | తాను బ్రబోధించె నేకతమ ననుఁ బ్రీతిన్. |
152 |
| వ. | ‘కావున మన మిందు విశ్వసించియుండవలవ; దవశ్యం బగ్నిభయం బగు’ ననిన విని భీముం డి ట్లనియె. | 153 |
| ఆ. |
‘ఇట్టిదేని మనకు నిం దుండఁగా నేల? | యరిగి ముందు నున్నయంద యుండి, యెఱిఁగి దీనితోన యిప్పురోచనుఁ గాల్చి | పోద’ మనిన ధర్మపుత్త్రుఁ డనియె. |
154 |
| క. |
ఎఱిఁగితిమి దీని తెఱఁ; గే | మఱ కెఱుఁగనియట్లు గూఢమతి నుండుద మిం దఱముఁ బురోచనుకృతకము | నెఱి నేర్పడునంతకును వినీతాత్ముల మై. |
155 |
| వ. | ఇప్పాపగృహప్రకారంబు మన మెఱంగుట పురోచనుం డెఱింగెనేని దుర్యోధనునియోగంబు విఫలం బగు నట్లు గాకుండ శీఘ్రకారుల మై దీని దహించిన నక్కడ భీష్మవిదురులు విని కోపించినం గురుకులసముద్రక్షోభం బగు; మఱి దాహభయంబున మన మొండుగడకుం బోయిన నెఱింగి మనయంతరంబ రోయుచు నద్దురాత్ముండు దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయు నె ట్లనిన. | 156 |
| సీ. |
‘రాజ్యపదస్థుం డరాజ్యపదస్థులఁ | బక్షబలాఢ్యుఁ డపక్షబలుల విపులార్థవంతుండు విగతార్థసార్థుల | నవసరం బెఱిఁగి వాఁ డశ్రమమున దూష్యులఁ దుదిదాఁక దూషించు మనల న | న్నిష్ఠురునకు నది నీతిగాదె! కావున నొరు లెఱుంగకయుండఁ గడు నమ్మి | నట్టుల యుండుద’ మని దినంబు |
|
| తే. |
లెల్ల వేఁటలాడుచు రాత్రులెల్ల నుద్య | తాయతాయుధహస్తు లై యనుదినంబు నప్పురోచను వంచించి యనఘు లుండి | రప్రమాదు లై పాండవు లప్పురమున. |
157 |