| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | భీమసేనుండును దద్వటవృక్షంబుక్రింద నధికపథిశ్రాంతులై పయి పుట్టంబులు పఱచుకొని తమ బాహుదండంబులు దలగడలుగా నిద్రితులయియున్న సహోదరులం దల్లినిం జూచి పరమదుఃఖితుం డై యాత్మగతంబున. | 177 |
| క. |
త్రిభువనసామ్రాజ్యశ్రీ | ప్రభుఁ డగు ధర్మాత్మజుండు ప్రాకృతజనున ట్లభిరూక్షతలంబున ని | ట్లభిభూతుం డగునె నిద్ర నతిఖిన్నుం డై. |
178 |
| సీ. |
కుంతిభోజాధిపుకూఁతురు వసుదేవు | చెలియలు మఱియు విచిత్రవీర్యు కోడలు కౌరవకులవిభూషణుఁ డైన | పాండుమహాదేవి పరమధర్మ పరు లైన కొడుకులఁ బడసినయది పుష్ప | సుకుమారతరమూర్తి శుచిపరార్థ్య శయనతలంబున శయనించియును నిద్ర | వోవనియది దప్పిఁ బొంది కటికి |
|
| ఆ. |
నేల గుండ్లు లొత్త నిద్ర వోయిన యది; | తల్లికంటె నిద్రఁ దగిలి సుతులు వాలుమృగము లున్న వన మని వగవక | మఱచియుండి; రేమి మాడ్కి యొక్కొ! |
179 |
| వ. | ‘వీరికి నిద్రాభంగంబు సేయనోపఁ; దమకుం దార మేల్కొని నీళ్ళు ద్రావుదురుగాక!’ యని యక్కమలపత్త్ర పుటికల నీ ళ్ళిమ్ముగా సంగ్రహించి వెండియుం దనమనంబున. | 180 |
| క. |
ఖలుఁ డై ధృతరాష్ట్రుఁడు పు | త్త్రులుఁ దానును గూడి మమ్ము దూరస్థులఁ గా నిలు వెలువరించి లాక్షా | నిలయంబున నునిచెఁ బాపనిష్ఠితబుద్ధిన్. |
181 |
| క. |
కులపాంసను లై యహితం | బులు సేయుచునుండుచుట్టములఁ బొందక యి మ్ముల నుండువాఁడ పుణ్యుఁడు, | వెలయఁగ గ్రామస్థితైకవృక్షమపోలెన్. |
182 |
| క. |
పరహితఫలవంతులు సు | స్థిరమూలాన్వితు లపాపధీరతులు పర స్పరసంశ్రయమున జీవిం | తురు మనుజులు వనములోని ద్రుమములపోలెన్. |
183 |
| వ. | అని ధృతరాష్ట్రుబాంధవంబు నిందించుచు నిబిడాంధకారనీరంధ్రంబు లయిన దిశలు సూచి యున్నంత, జన రభసంబు దవ్వుల వీతెంచిన ముందటం బురంబు గలుగవలయు, వీరల మేల్కొనునంతకు నే నిచ్చోట నేమరకుండవలయు నని. | 184 |
| క. |
ఆ కాననాంతరంబునఁ | బ్రాకటభుజవిక్రముండు పాండవవజ్ర ప్రాకారుఁడు జాగరమున | శోకమనస్కుఁ డయి పవనసూనుం డుండెన్. |
185 |
| వ. | తత్సమీపంబున బాలసాలతరుషండమండపంబుననుండి హిడింబుఁ డను నొక్కరాక్షసుండు వారి దవ్వులం జూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి యావులించి నీల్గి ‘నీరసవన్యమృగమాంసఖాదనజాతనిర్వేదనపరుండ నయి పెద్దకాలంబునకు మానవమాంసం బాస్వాదింప గంటి’ నని తన చెలియలి హిడింబ యనుదానిం బిలిచి యి ట్లనియె. | 186 |
| ఉ. |
ఇందుల కిమ్మెయిన్ మనుజు లెన్నఁడు వత్తురె? వత్తురేని యా నందముఁ బొంది నిర్భయమునన్ శయనింతురె? యిట్లు వంటయిల్ కుందెలు సొచ్చె; వేగ చని కోమలి! వారలఁ జంపి తెచ్చి నా కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మాంస ఖండముల్. |
187 |