| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
అన్న! యిది ధర్ము వని మీ | యన్నను నన్నును నతిప్రియంబున నెదలో మన్నించి, యేమి వనిచినఁ | గ్రన్నన మా పసుపు సేయఁ గడఁగుము బుద్ధిన్. |
225 |
| క. |
ఇది పరమ సాధ్వి, దీనిని | మది నొండుగఁ దలఁప వలదు, మానుగఁ బుత్త్రా భ్యుదయ మగుఁ; బాండుహితముగ | నిది కార్యం బని పరిగ్రహింపుము నెమ్మిన్. |
226 |
| వ. | అని భీమసేను నొడంబఱచి హిడింబ కనురాగంబుగాఁ జెప్పి ‘నీవు శుచి వయి యుత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనఃప్రియంబు సేయుము; పగ ళ్లెల్లను మీ యిష్టంబున విహరించి రాత్రులు మాయొద్దన యుండు నది’ యని నియమించిన భీముండును ‘బుత్త్రజన్మం బగునంతకు దీని మీవచనంబునఁ బరిగ్రహించెద’ నని వారల సమక్షంబున సమయంబు సేసె; నంతఁ బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబునకుం జని ప్రభాతసమయంబున నక్కొలనఁ గృతస్నాను లయి సంధ్యావందనంబులు దీర్చి; శాలిహోత్రుచేతం బూజితు లయి తద్వనస్పతి చ్ఛాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్పిపాసు లై సుఖం బున్నంత. | 227 |