| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| మ. |
అని నీచేతఁ బరాజితుండ నయి నా యంగారపర్ణత్వ మిం కను దాల్పన్ మది నంత నిస్త్రపుఁడనే; గర్వం బడంగన్ రణం బున మున్నోడియుఁ బూర్వనామమున బెంపున్ గర్వముం దాల్చువాఁ డనఘా! సత్సభలందు మెచ్చఁబడునే హాసాస్పదీభూతుఁ డై. |
50 |
| వ. | నీ యాగ్నేయాస్త్రంబున దగ్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేక రత్నవిచిత్రం బైన రథంబు వడసి, యిది మొదలుగాఁ జిత్రరథుండ నయ్యెద; నీ పరాక్రమంబునకు మెచ్చితి; నీతోడి సఖ్యంబు నా కభిమతం బయిన యది; నా తపంబునం బడయంబడిన చాక్షుషి యనువిద్య నీ కిచ్చెద; దీనిం దొల్లి మనువువలన సోముండు పడసె; సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె; నాతనివలన నేనుఁ బడసితి; నెవ్వండేని మూఁడులోకంబులుం జూడ నిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వస్వంబును గంజూచు; నేము దీనన చేసికాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపంబడక జీవించెద; మిది కాపురుషప్రాప్తం భైఫలియింపదు; నీవు తాపత్యవంశవర్ధ నుండవు; మహాపురుషుండవు; నీకు సఫలంబగు, నీదివ్యవిద్యఁ గొను మిచ్చెద; దీనిఁ గొనునప్పుడు షణ్మాసవ్రతంబు సేయవలయు; నీవు నాకు నాగ్నేయాస్త్రం బిచ్చునది; మఱి మహా జవసత్త్వంబులుఁ గామగమనంబులు నయిన గంధర్వహయంబుల మీ కేవురకుం జెఱు నూఱేసి యిచ్చెద. | 51 |
| సీ. |
వృత్రుపై గీర్వాణవిభుఁ డల్గి వజ్రంబు | వైచిన నది వాని వజ్ర కఠిన పటు మస్తకంబునఁ బడి పాతరయమునఁ | బదివ్రయ్యలైనఁ దద్భాగచయము క్రమమున బ్రాహ్మణ క్షత్ర విట్ఛూద్రుల | యందు వేదంబులు నాయుధములు హలము శుశ్రూషయు నయ్యె వజ్రంబులు | వాహంబులందు జవంబు నయ్యె |
|
| తే. |
నట్టి జవమున నభిమతం బగుచు నున్న | యట్టి హయసమూహం బయ్యె నవనిపతుల కఖిల భువనముల్ రక్షించునపుడు సకల | సాధనములలో నుత్తమసాధనంబు. |
52 |
| వ. | అనిన వాని కర్జునుం డి ట్లనియె. | 53 |
| ఆ. |
ఎంత మిత్రు లైన నెన్నండు నొరులచే | విద్యయును జయంబు విత్తచయము గొనఁగ నొల్ల! నాకుఁ గూర్తేని యనలాస్త్ర | మనఘ! నీవు గొనుము హయము లిమ్ము. |
54 |
| వ. | ‘నీతోడ సఖ్యంబుఁ జేసెద; మఱి మమ్ముఁ బరమధార్మికులం బరమబ్రహ్మణ్యుల నేమి కారణంబున నుదరి పలికి?’ తనిన గంధర్వుం డి ట్లనియె. | 55 |
| క. |
విమలము లయి లోకత్రిత | యమునఁ బ్రవర్తిల్లు మీ మహాగుణములు ని త్యము విందు నారదప్రము | ఖ మునీశ్వర సిద్ధసాధ్య గణములవలనన్. |
56 |
| క. |
మేరునగోత్తంసమహీ | భారధురంధరుల మిమ్ముఁ బాండవుల గుణో దారుల ధీరుల నెఱుఁగని | వా రెవ్వరుఁ గలరె భరతవంశోత్తములన్. |
57 |
| వ. | ఏను మిమ్ము నెఱింగియు, మీకు నగ్నిపరిగ్రహంబును, బ్రాహ్మణసంగ్రహంబును లేమింజేసి పరుసంబులు పలికితి; మఱియును. | 58 |
| ఉ. |
ఇంతుల గోష్ఠి నున్నయతఁ డెంత వివేకము గల్గెనేని య త్యంత మదాభిభూతుఁ డగు; ధర్మువు దప్పుఁ; బ్రియం బెఱుంగఁ; డే నెంత వివేకి నయ్యును సహింపక యింతుల యొద్దఁ బల్కితిన్; వింతయె? కాము శక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్! |
59 |
| క. |
సుర గరుడ విషోరగ య | క్ష రాక్షస పిశాచ, భూత గంధర్వులు నో పరు ధిక్కరింప బ్రాహ్మణ | పురస్కృతులఁ బుణ్యమతుల భూతలపతులన్. |
60 |