| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| చ. |
ప్రతిహత రాగ కోపభయుఁ బంకరుహప్రభవప్రభావు దూ రితదురితున్ మునీశ్వరవరిష్ఠు వసిష్ఠమహామునిం బురో హితు నతిభక్తితోఁ దలఁచె; నిష్ట మెఱింగి వసిష్ఠుఁడున్ సమా హితమతి నేఁగుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్. |
83 |
| వ. | ఇట్లు దలంచిన పండ్రెం డగు దివసంబునకు వచ్చి వసిష్ఠుం డవిరతవ్రతోపవాసకృశీభూతశరీరుం డయి యున్న సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్ధానురాగుం డగుట తన యోగ దృష్టి నెఱింగి. | 84 |
| చ. |
జగదభివంద్యుఁ డాక్షణమ సమ్మతి సంవరణ ప్రయోజనం బొగి నొనరింపఁగా నయుతయోజనముల్ చని లోకలోచనుం డగు దిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న త్యగణితవేదమంత్రముల నమ్మునినాథుఁ డతిప్రియంబునన్. |
85 |
| వ. | సూర్యుండును వసిష్ఠమహాముని నతిగౌరవంబున సంభావించి ‘భవదాగమన ప్రయోజనంబు సెప్పు’ మనిన వసిష్ఠుం డి ట్లనియె. | 86 |
| సీ. |
‘అలఘుండు పౌరవకులశేఖరుండు సం | వరణుఁ డన్వాఁ డనవరత కీర్తి విదితుండు ధర్మార్థవిదుఁడు నీ పుత్త్రికి | నగణిత గుణములఁ దగు వరుండు గావున నతనికి దేవిఁగాఁ దపతి నీ | వలయుఁ; గూఁతులఁ గన్నఫలము దగిన వరులకు సద్ధర్మచరితుల కీఁ గాన్ప | కాదె!’ నావుడు సూర్యుఁ డాదరించి |
|
| ఆ. |
‘వరుఁడు రాజవంశకరుఁడు సంవరణుండ | యనుగుణుండు దీని’ కని కరంబు గారవమున నిచ్చి యా ఋషితోడఁ బు | త్తెంచెఁ దపతిఁ గురుకులాంచితునకు. |
87 |
| వ. | ఇ ట్లొక్కనిమిషంబున మున్నూటయఱువదినాలుగు యోజనంబులు పఱచు నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి, తపనదత్త యయిన తపతిం దోడ్కొని వచ్చి, వసిష్ఠుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు సేయించెఁ; గావున మహాత్ము లయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం; బిట్లు సంవరణుండు దపతి వివాహంబయి. | 88 |
| క. |
ఆ తరుణియందుఁ జేతో | జాత సుఖప్రీతిఁ దగిలి శైలాటవులన్ వీతనృపకార్యధర్మ | వ్రాతుం డయి పదియురెండువర్షము లుండెన్. |
89 |
| వ. | ‘దానం జేసి మహీతలంబున కనావృష్టి యయిన నెఱింగి వసిష్ఠుండు శాంతికపౌష్టికవిధు లొనరించి, సంవరణుం దోడ్కొని హస్తినాపురంబున కరిగిన నఖిలప్రజకు ననురాగం బయ్యె; ననావృష్టి దోషంబునుం బాసె; నంత సంవరణునకుఁ దపతికిం దాపత్యుండై వంశకరుండు కురుండు పుట్టె, నది మొదలుగా మీరును దాపత్యుల రయితి’ రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు ని ట్లనియె. | 90 |
| క. |
నుతముగ నస్మత్కుల భూ | పతులకు నాద్యులకుఁ బుణ్యభాగులకుఁ బురో హితుఁ డయిన వసిష్ఠ మహా| త్మతఁ జెప్పుము వినఁగ వలతు మది నేర్పడఁగన్. |
91 |
| వ. | అనిన గంధర్వుం డి ట్లనియె. | 92 |
| క. |
ధృతి నెవ్వని నేని పురో | హితుఁగాఁ బుణ్యమునఁ బడసి యిక్ష్వాకుకులో దితు లైన పతులు రాజ్యో | న్నతి నొప్పం జేసి రుర్వి నానాక్రతువుల్. |
93 |
| క. |
బలమఱి కామక్రోధం | బులు రెండు జయింపఁబడి తపోవీర్య బలం బులఁ జేసి చేయునవి ని | చ్చలు నెవ్వనియేని పాద సంవాహంబుల్. |
94 |
| సీ. |
‘శమహీనుఁ డైన విశ్వామిత్రు చేసిన | యపకారమునఁ జేసి యాత్మసుతులు యమసదనంబున కరిగిన, వారలఁ | దనతపోవీర్యసత్త్వముల పేర్మిఁ గ్రమ్మఱింపఁగ శక్తి కలిగియు, వేల న | య్యంబుధి గడవనియట్ల శాంతుఁ డయి యెవ్వఁడేని కృతాంతకుఁ గడవంగ | నొల్లండ, యట్టి యత్యుగ్రతేజుఁ |
|
| ఆ. |
డగు వసిష్ఠముని మహాత్మతఁ జెప్ప నా | యలవియయ్య’! యనిన నవ్వసిష్ఠ గాధిసుతుల కేమికారణంబున నిట్టి | వైర మయ్యె నెఱుఁగ వలతు దీని. |
95 |