| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
మనుకుల పవిత్రుఁ బుత్త్రకు | నినసన్నిభు! నాకుఁ బడయు; మే నట్లయినన్ మునినాథ! నీ ప్రసాదం | బునఁ బితరులవలన ఋణవిముక్తుఁడ నగుదున్. |
131 |
| వ. | అని తన భార్యయైన మదయంతి యనుదానిని ఋతుమతి సమర్పించిన, నదియు వసిష్ఠుప్రసాదంబున గర్భిణి యయి పండ్రెండేఁడులు గర్భంబు మోచి వేసరి, యొక్క యశ్మశకలంబున నుదరభేదనంబుఁ జేసిన నశ్మకుం డను రాజర్షి పుట్టె; నట యదృశ్యంతికిం బరాశరుం డుదయించి వసిష్ఠ నిర్మిత జాతకర్మాదికుండయి పెరుఁగుచు నొక్క నాఁడు రాక్షసభక్షణంబునం దనజనకు పంచత్వంబు దల్లివలన విని కోపదహనదందహ్యమాన హృదయుం డయి ‘తపోమహత్త్వంబున నఖిలలోకసంహారంబు సేయుదు’ నని యున్న మనుమని వారించి వసిష్ఠుం డి ట్లనియె. | 132 |
| సీ. |
వినవయ్య! కృతవీర్యుఁ డను జనపతి దొల్లి | భృగు వంశ యాజ్యుఁ డై పెక్కుక్రతువు లొనరించి, యగణిత ధనదానముల వారిఁ | దృప్తులఁ గావించి దివికిఁ జనిన, నతనివంశమున వా రతిధనలుబ్ధులై | కృత్యవీర్యు ధనమెల్లఁ గ్లప్తి సేసి కొని డాఁచియున్న వా రని భార్గవుల నెల్లఁ | బలికిన భార్గవుల్ భయము వొంది. |
|
| తే. |
కొంద ఱర్థము వారిక కూర్చి యిచ్చి; | రవనిసురవంశ్యులకు నిచ్చి రందుఁ గొంద, ఱెవ్వరికి నీక తమ తమ యిండ్లఁ బాఁతి | కొని సుఖం బుండి రధము లై కొంద ఱందు. |
133 |
| వ. | అంత నా క్షత్త్రియు లొక్క భార్గవుని యిల్లు గ్రొచ్చి యనంతం బయిన యర్థంబు గని యలిగి, రాజధన వంచకులై రని భార్గవుల నెల్ల నిగ్రహించి, గర్భంబుల నున్న యర్భకులు మొదలుగా వధించిన, వెఱచి భార్గవుల భార్యలెల్ల హిమవంతంబునకుం బాఱిన; నం దొక్క భృగుపత్ని భయంపడి, తన యూరుదేశంబున గర్భంబు ధరియించిన, నెఱింగి క్షత్రియులు దాని భేదింప సమకట్టి వచ్చిన నంతకు ముందఱ. | 134 |