| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| తే. |
శక్తి రాక్షసనిహతుఁ డై చనిన శోక | దహనహతుఁ డై వసిష్ఠుండు దానిఁ దలఁచి కడుఁ బ్రశాంతాత్ముఁ డయ్యు రాక్షసవినాశ | మొలసి మనుమని వారింపకుండె నంత. |
150 |
| క. |
ఘోరాకారులు కృతహా | హారవులు సబాలవృద్ధు లయి పడిరి దురా చారులు రాక్షసులు ముని | ప్రారబ్ధాధ్వరసమిద్ధపావకశిఖలన్. |
151 |
| వ. | ఇట్లు పరాశరుండు గావించు సత్త్రయాగంబున నైన రాక్షసుకులప్రళయంబుఁ జూచి పులస్త్యపులహక్రతువులు మహామునిసంఘంబులతో వసిష్ఠాశ్రమంబునకు వచ్చి. | 152 |
| క. |
అగ్నిహతిఁ జేసి మానవ | భుగ్నివహము మరణబాధఁ బొందించుచు మూఁ డగ్నులయొద్దను నాలవ | యగ్నియనన్ వెలుఁగుచున్న యమ్మునినాథున్. |
153 |
| క. |
పరమతపోనిలయు దినే | శ్వరదీప్తిసహస్రతేజు శాక్తేయుఁ బరా శరుఁ గని యందఱుఁ బ్రార్థిం | చిరి రాక్షసమారణంబు సేయకు మనుచున్. |
154 |
| వ. | ‘పరాశరుండును బులస్త్యాదిమహామునిప్రార్థితుం డై రాక్షససత్త్రయాగం బుపసంహరించి, తన్నియోగంబున నయ్యగ్ని హిమవదుత్తరపార్శ్వంబున వైచిన, నదియును బర్వంబుల నందు వృక్షలతా గుల్మ శిలాభక్షణంబు సేయుచుండె’ నని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబు చెప్పిన విని యర్జునుండు వాని కి ట్లనియె. | 155 |
| ఉ. |
మాకు నతిప్రియుండవు సమస్తవిదుండవు చెప్పుమయ్య! యీ లోకములోని వర్తనములుం దగువారి నెఱుంగు; దెవ్వనిం బ్రాకటధర్మతత్త్వవిదు బ్రాహ్మణముఖ్యుఁ బురోహితుండుగాఁ జేకొనువార? మట్టి బుధసేవితుఁ గానఁగ మాకు నెం దగున్? |
156 |
| వ. | అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దు విచారించి ‘యిచ్చోటికిం గుఱంగట నుత్కచం బను పుణ్యతీర్థంబునం దపంబు సేయుచున్నవాని ధౌమ్యుం డను బ్రాహ్మణునిఁ బురోహితుఁగాఁ బ్రార్థింపుం; డమ్మహాత్ముండు మీకుఁ బురోహితుం డైన సర్వార్థసిద్ధి యగు’ ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్త్రంబు విధ్యుక్తంబుగా నిచ్చి ‘మాకు నీ యిచ్చిన హయంబుల నీయంద సంగ్రహించి యుండుము; ప్రయోజనంబు గలనాఁడు గొనిపోయెద’ మని గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథి నుత్తరించి యుత్కచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు. | 157 |