| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| ఉ. |
ఈహితకార్యసిద్ధి యిది యెట్లొకొ తా సమకూరు నంచు సం దేహముఁ బొంది సోమక యుధిష్ఠిరు లున్నఁ, దదీయధర్మసం దేహనివృత్తిపొంటెఁ జనుదెంచెఁ బరాశరసూనుఁ డాత్మతే జోహృతసూర్యతేజుఁ డగుచున్ దిశలెల్ల వెలుంగుచుండఁగన్. |
246 |
| వ. | ఇట్లు వచ్చిన కృష్ణద్వైపాయనునకుఁ గుంతీదేవియుఁ బాండవులును బాంచాలుండు నతిభక్తి మ్రొక్కి యమ్మహామునిం గాంచనమణిమయోచ్చాసనంబున నునిచి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి యున్న వారల కుశలం బడిగి హిత మధురసత్యసంభాషణామృతరసప్రవాహసందోహంబున నందఱం బరమానందహృదయులం జేసియున్న యమ్మునీంద్రునకు ముకుళితకరకమలుండయి ద్రుపదుం డి ట్లనియె. | 247 |
| క. |
తన పలుకు లోక మెల్లను | గొనియాడఁగఁ దగిన లోకగురుఁ డీ యమనం దనుఁ డే మేవురమును నీ | తనుమధ్య వివాహ మయ్యెదము నని పలికెన్. |
248 |
| క. |
మీ రెఱుఁగనట్టి లోకా | చారము గలదయ్య? తొల్లి చన్న మహాత్ముల్ ధీరమతు లిట్లు సేసిన | వా రెవ్వరుఁ గలరె యాప్తవచనానుమతిన్. |
249 |
| క. |
విమలమతి యన్యులకు విష | యమె ధర్మాధర్మనిర్ణయము సేయఁగ ది వ్యమునీంద్ర! దీని సువిచా | రము సేయుము ధర్మసంకరము గాకుండన్. |
250 |
| వ. | అనిన నా ద్రుపదునకుఁ గృష్ణద్వైపాయను సమక్షంబున ధర్మజుం డి ట్లనియె. | 251 |
| చ. |
నగియును బొంకునందు వచనంబు, నధర్మువునందుఁ జిత్తముం దగులదు నాకు నెన్నఁడును; ధర్ము వవశ్యము; నట్ల కావునన్ వగవక మాకు నేవురకు వారిజలోచనఁ గృష్ణ నీఁ దగుం దగ దను నీ విచారములు దక్కి వివాహ మొనర్పు మొప్పుఁగన్. |
252 |
| వ. | మఱియుం దొల్లి గౌతమి యయిన జటిల యను ఋషికూఁతురు తపఃప్రభావంబున నేడ్వురు ఋషులకు నొక్కతియ భార్య యయ్యె ననియును, దాక్షాయణి యను మునికన్యక యేకనామంబునఁ బ్రచేతను లనంబరఁగిన పదుండ్రకు నొక్కతియ భార్యయయ్యె ననియును గథల వినంబడు; మఱి యట్లుం గాక. | 253 |
| ఆ. |
‘గురులలోనఁ బరమగురువు దల్లియ; యట్టి | తల్లి వచనమును, విధాతృకృతము నన్యథాకరింప నలవియే?’ యనిన నం | దొఱకు నిట్టు లనియె ద్రుపదవిభుఁడు. |
254 |
| వ. | ‘ధర్మసూక్ష్మత నిర్ణయింప మన కశక్యంబు; త్రిలోకవంద్యుండు త్రికాలప్రవర్తనవిజ్ఞాననిధి యీ కృష్ణద్వైపాయ నుండు విచారించి యెద్ది యాన తిచ్చె నదియ యిప్పుడు కర్తవ్యం’ బనిన విని యమ్మునివరుండు ద్రుపదున కి ట్లనియె. | 255 |
| సీ. |
‘ధర్మతత్త్వజ్ఞుఁ డీ ధర్మతనూజుండు | ధర్మమార్గం బేల తప్పఁబలుకు? దేవతామూర్తి యిద్దేవి మాధవి యేల | తా నెఱుంగక యనృతంబు పలుకు? వీరల పలుకులు వేల్పుల మతమును | నొక్కండ కావున నొండు దక్కి యీ యేవురకుఁ గూఁతు నిచ్చి వివాహంబుఁ | గావింపు; మఱి దీని కల తెఱంగు. |
|
| ఆ. |
వినఁగ నిష్టమేని విను ‘మని ద్రుపదు చే | యూఁది యింటిలోని కొనర నరిగి. తాను నతఁడు నేకతమ యుండి, వాని కం | తయును జెప్పఁదొడఁగె ధర్మవిదుఁడు. |
256 |