| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| వ. | అని తత్ప్రభావప్రకారంబు చెప్పినఁ గృష్ణార్జునులు సంతసిల్లి, సన్నద్ధు లయి రథం బెక్కి, యగ్నిదేవుం జూచి ‘సురాసుర పరివృతుండయి సురపతి వచ్చినను జయింతు’ మింక శంకింపక ఖాండవదహనార్థం బుపక్రమింపు మనిన నగ్నిదేవుండు హర్షించి తైజసంబయిన రూపంబు ధరియించి. | 258 |
| చ. |
పెడిలి సువర్ణపర్వతము పెక్కుదెఱంగుల వ్రయ్యునట్టు ల ప్పుడు వివిధప్రకారముల భూరిశిఖావలి ఖాండవంబు న ల్గడఁ గడుఁబర్వఁగాఁ బెఱిఁగి కాల్పఁదొడంగె హుతాశనుండు సే డ్పడఁగ వనంబులోని మృగపక్షిభుజంగమభూతసంఘముల్. |
259 |
| వ. | అంత. | 260 |
| సీ. |
చక్రధరుం డయ్యు జలరుహనాభుండు | గాండీవధరుఁ డయ్యుఁ బాండవుండు నుండి రవ్వనమున కుభయపార్శ్వంబులఁ | దొల్లింటి యట్టులు పెల్లు రేఁగి యనలంబు నార్పంగ నార్చుచుఁ బఱతెంచి | వనరక్షకులు పార్థు సునిశితాస్త్ర ధారల నపగతదర్పు లై యరిగిరి | యమసదనంబున కమితబలులు; |
|
| ఆ. |
శిఖియు నుగ్రదీర్ఘజిహ్వలు సాఁచి యు | ద్ధురసమీరణంబు తోడు సేసి కొని యుగాంతకాల కుపితానలాకారుఁ | డయ్యె ఖాండవమున కద్భుతముగ. |
261 |
| మ. |
ఘనధూమధ్వజ దహ్యమాన లవలీ కర్పూర తక్కోల చం దన కాలాగరు సల్లకీతరుల యుద్యద్ధూమధూపానువా సన నొప్పెన్ సురభీకృతంబు లగుచున్ సంక్రీడమానామృతా శనవిద్యాధరసద్విమానవితతుల్ సావిత్రవర్త్మంబునన్. |
262 |
| చ. |
జ్వలన శిఖాలియున్ విజయుసద్విశిఖాలియుఁ జుట్టుముట్టినం దలరి భయాకులంబు లగు తద్వనజీవులయార్తనాద మం దులియుచు నొక్కపెట్ట దివి నుద్గుత మయ్యె నమందమందరా చలపరివర్తనప్రసభసంక్షుభితార్ణవఘోషఘోర మై. |
263 |
| క. |
నెగయుడు నెగసి పిఱుందం | దగిలెడు మిడుఁగుఱులచేత దగ్ధచ్ఛద మై గగనమునఁ బఱవ నోపక | ఖగనివహము వహ్నియంద కడువడిఁ బడియెన్. |
264 |
| క. |
తనతేజోజాలము ప | ర్విన దగ్ధము లగు ననేకవిధదేహుల దే హనికాయంబుల బహువిధ | తనువులు గలవాఁడవోలె దహనుం డొప్పెన్. |
265 |
| చ. |
అమితకృశానుదగ్థ మగు నయ్యమరేంద్రువనంబులోని యు త్తమసలిలాశయావళుల తప్తజలంబులయం దపేతజీ వము లయి తేలుచుండె వరవారిచరంబులు వారిపక్షులుం; గమరె నశేషకోకనదకైరవపంక్తులు శైవలంబులున్. |
266 |
| క. |
అలుగుల పడి ఖాండవమునఁ | గల యాశీవిషమహోరగము లెల్ల విషా గ్నులు గ్రక్కుచు నత్యుగ్రా | నలబహులజ్వాలలందు నాశము వొందెన్. |
267 |
| వ. | అంత దేవత లెల్ల మహావహ్నిశిఖాహతికి వెఱచి దేవేంద్రుపాలికిం బోయి ఖాండవవనంబున కైనయకాండ ప్రళయంబు సెప్పిన విని యదరిపడి యింద్రుండు తక్షకరక్షణాపేక్ష ననేకధారాధరనివహంబుతో నతిత్వరితగతి ఖాండవంబునకు వచ్చి హుతాశనుమీఁద మహావారిధారలు గురియించిన. | 268 |
| క. |
ఆ వారిధార లెల్ల మ | హావహ్ని శిఖాహతంబు లయి శుష్కము లై లావఱి నడుమన యడఁగుటఁ | బావకు పయి నొక్కచినుకుఁ బడదయ్యె వడిన్. |
269 |
| క. |
ఉఱుముచు మెఱుముచుఁ బిడుగులు | వఱలఁగ నలుగడలఁ బడ నవారితవృష్టుల్ గుఱుకొని కురియఁగఁ బంచెను | మఱియును నయ్యనలుమీఁద మఘవుం డలుకన్. |
270 |
| క. |
పాండుసుతుఁ డంత నానా | కాండసహస్రముల నేసి ఘనముగఁ జేసెన్ ఖాండవగృహము నఖండా | ఖండలధారలకు దూఱఁ గాకుండంగన్. |
271 |
| వ. | ఇట్లు కావించిన. | 272 |
| తే. |
దాని వెల్వడనేరక తద్వనంబు | జీవులెల్లను బావకశిఖలఁ జేసి దగ్ధు లగుచున్నఁ దక్షకతనయుఁ డశ్వ | సేనుఁ డను భుజంగమ మగ్నిశిఖల కపుడు. |
273 |
| ఆ. |
వెఱచి తల్లిఁదోఁకఁ గఱపించుకొని దివిఁ | బఱచువానిఁ జూచి పార్థుఁ డలిగి వానితల్లిశిరముతోన తత్పుచ్ఛంబు | దునిసి యగ్నిశిఖలఁ దొరఁగ నేసె. |
274 |
| వ. | వెండియు నశ్వసేను నేయసమకట్టిన యప్పార్థునకుఁ దత్‌క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రుఁ డశ్వసేను విడిపించి యందుఁ దక్షకుండు దగ్ధుం డయ్యెను కా వగచి కడు నలిగి. | 275 |