| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు పాండవులు నిజాయుధంబులు ధరియించి కృష్ణాసహితులై యుత్తరము మించి యరిగిన నింద్రసేనాదులైన మూలభృత్యులు పదునాలుగువేల రథంబులతోడ సుభద్రాభిమన్యు ప్రతివింధ్యాదులం దోడ్కొని వారి పిఱుందన యరిగి; రంత నప్పాండవులం జూచి పౌరులెల్లఁ బరమ దుఃఖితులై. | 2 |
| క. |
‘చనునె యధర్మద్యూతం | బున నిట్టుల పాండురాజపుత్త్రులఁ బ్రభులన్ వనగతులఁ జేయ దుర్యో | ధన ధృతరాష్ట్రులకు విగతదయహృదయులకున్. |
3 |
| క. |
క్రూరతర ధార్తరాష్ట్రు ని | కారము వారింపరైరి గాంగేయుఁడు న బ్భారద్వాజుఁడుఁ గృపుఁడు ను | దారుఁడు విదురుండు నేమి దలఁచిరొ బుద్ధిన్. |
4 |
| సీ. |
కర్ణ జయద్రథ గాంధారు లాప్తులై | యుండంగ లోభి దుర్యోధనుండు రాజుగా నీతని రాజ్యంబు నందెట్టు | లుండంగ నేర్తు? మీ యుర్వి నింక నేది ధర్మువు? ప్రజ నెవ్వరు గాతురు? | పరమధార్మికులైన పాండుసుతుల యరిగిన చోటికి యరుగుద’ మని వారి | పిఱుఁదన చని పాపభీతమతులు |
|
| ఆ. |
‘వీరులార! మమ్ము విడిచి మీ కరుగంగఁ | జనునె, మాకు నొండు శరణ మెద్ది? సాధులకు నసాధుసహవాసమునఁ బాప | సంప్రయోగ మగుట సందియంబె? |
5 |
| క. |
తిలలును నీళ్ళును వస్త్రం | బులుఁ బుష్ప సుగంధ వాసమున సౌరభముం బొలు పెసఁగఁ దాల్చుఁ గావున | నలయక సత్సంగమమున నగు సద్గుణముల్. |
6 |
| వ. | సాధుసమ్మతంబులైన గుణంబుల నొప్పి, జన్మవిద్యా కర్మంబులం బ్రశస్తులరై, యార్యవృత్తులరైన మీ సహవాసంబున నుండి, ధర్మపరులమై కృతార్థుల మగుదుము; దుష్కృతంబులయం దనారంభులయ్యును జనులు దుర్జన దర్శన స్పర్శన సంభాషణ సహాసనంబులంజేసి ధర్మవిహీను లగుదురు; గావున నేము దుర్యోధను రాజ్యంబున నుండనోపము; మా యనుగమనంబున కొడంబడవలయు’ నని కృతాంజలులైన న ప్పౌరులం జూచి ధర్మతనయుం డిట్లనియె. | 7 |
| క. |
‘మాయందు లేని గుణములు | మీ యనురాగమునఁ జేసి మిగిలి వెలింగెన్; మీ యనుగతి మా కనభి | ప్రాయము; వనవాసదుఃఖభర మోపుదురే? |
8 |
| తే. |
వలవ దుడుగుండు మీ’ రని వారినెల్లఁ | గరుణఁ బాండవజ్యేష్ఠుండు గ్రమ్మఱించెఁ; బౌరు లట్లు నివర్తింపఁబడి నిరంత | రార్తనాదులై యరిగిరి హస్తిపురికి. |
9 |
| వ. | ఇట్లు పాండవులు గృతప్రస్థానులై గంగాతీరంబునం బ్రమాణాఖ్యవటంబున విడిసి, గంగాస్నానంబు సేసి, నాఁటి పగలును రాత్రియు నంద యుండి; రంతఁ బ్రభాతసమయంబున. | 10 |
| చ. |
పరువడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులుఁ దోడ రా మహీ సురవరులెల్లఁ బాండునృపసూనులయొద్దకుఁ బ్రీతి నేఁగుదెం చిరి బహువేదఘోషములఁ జేసి నిరస్త సమస్త కిల్బిషో త్కరు లగుచున్న ధన్యులు జగత్పరిపూజ్యులు బ్రహ్మసమ్మితుల్. |
11 |
| వ. | ఇట్లు దమతోడన వనవాసంబు సేయ నిశ్చయించి వచ్చిన విప్రుల నతిప్రీతి గౌరవంబున నర్చించి తదా శీర్వాదంబుల నభినందితుండై ధర్మతనయుండు వారల కిట్లనియె. | 12 |
| క. |
‘అపహృత సర్వస్వులమై | సపత్నుల నికారమునఁ బ్రచండాటవిలో విపుల ఫల శాక మూలము | లుపయోగించుచును నిష్ఠ నుండెడు మాతోన్. |
13 |
| క. |
రా నేల? వచ్చి నవయం | గా నేల? నివాసములకుఁ గ్రమ్మఱి చనుఁ; డు గ్రానేకప శార్దూల భ | యానక వనవాస మర్హ మగునే మీకున్!’ |
14 |
| వ. | అనిన విని బ్రాహ్మణులు పరమ దుఃఖితులై ‘మీర కాని మాకు నొండు గతి లేదు; మమ్ము ననన్యశరణ్యుల విడుచుట ధర్మంబు గాదు. | 15 |
| ఆ. |
ఆశ్రితులను భక్తులగువారి నెప్పుడు | నన్యులైన విడువ; రట్టి విప్ర వరుల భక్తిపరుల వసుధేశ! మీ యట్టి | ధార్మికులకు విడువఁదగునె చెపుమ. |
16 |
| వ. | అస్మ త్పోషణోపాయచింత సేయ వలదు; వన్యమూల ఫలంబుల నేమ తెచ్చికొని యుపయోగించుచు జపహోమాది పుణ్యక్రియల మీకుం బ్రియంబు సేయుచు నుండెద; మధర్మవర్తులయి మీ కపకారంబు సేసిన ధార్తరాష్ట్రుల రాష్ట్రంబున నుండ నోప’ మనిన వారల రాక కొడంబడి. | 17 |
| తే. |
ఇష్టమృష్టాన్నములఁ దొల్లి యెల్ల ప్రొద్దుఁ | దృప్తులగుచున్న వసుమతీదేవవరులఁ గానలందు శాకాశనుల్ గాఁగ నెట్లు | సూడ నోపుదు నని ధర్మసూనుఁ డపుడు. |
18 |