పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు సూర్యు నారాధించి వరంబు గొనుట (సం. 3-3-13)
సీ. హితుఁడైన తన పురోహితు నుపదేశంబు | పేర్మితోఁ జేకొని ధర్మసుతుఁడు
నెమ్మిఁ బుష్పోపహారమ్ముల నాదిత్యుఁ | బూజించి, భాగీరథీజలంబు
లం దుండి విషయంబులం దింద్రియంబుల | నమలవ్రతానుభావమున నుడిచి,
వాయుభోజనుఁడుఁ బ్రాణాయామపరుఁడు నై | సూర్యాదినామముల్‌ సూర్యుగుఱిచి
 
ఆ. జపము సేయుచున్నఁ దపనుఁ డాతనికిఁ బ్ర | త్యక్షమయి త్రిలోకచక్షుఁ డమర
వరుఁడు దురితహరుఁడు తరణి త్రయీమూర్తి | వనజమిత్త్రుఁ డిట్టు లనియెఁ గరుణ.
42
వ. ‘నీ తపమునకు మెచ్చితి; నీ వరణ్యంబున నుండఁ గల పండ్రెండేండ్లును వన్యఫలమూలశాకంబులు నీ మహాన సంబున ద్రుపదరాజపుత్త్రిచేత సాధితంబులై యక్షయంబులైన చతుర్విధాహారంబులగు’ నని యొక్క తామ్రస్థాలి యిచ్చి, వరం బిచ్చి వనజహితుం డంతర్హితుం డైన. 43
చ. అడరఁగ ధర్మనందనుఁ డహర్పతిచేత వరంబు పేర్మితోఁ
బడసి మహీసురోత్తముల భవ్యులఁ బల్వుర నిర్వహించె న
ప్పుడు ద్రుపదాధిరాజసుత పొల్పుగ వండిన శాకమూలముల్‌
గడు రుచి నిష్టభోజనసుఖంబులఁ దృప్తులఁ జేయుచుండఁగన్‌.
44
వ. ఇట్లనేకసహస్ర మహీసురవరుల ననుదినంబును నభిమత భోజనంబులం దనిపి, విఘసామృత భోజనంబులం దృప్తులైన తనపతుల భుక్తశేషంబు ద్రుపదపుత్త్రిక యుపయోగించుచుండం గొన్నిదినంబు లంద యుండి, పాండవులు బ్రాహ్మణులచేతం గృతస్వస్త్యయనులై బ్రహ్మర్షిసంఘంబులతోఁ గామ్యకవనంబున కరిగి; రంత నిట ధృతరాష్ట్రుండు విదురుం బిలిపించి ‘నీవు భార్గవుకంటె బుద్ధిమంతుఁడవు; పాండవ కౌరవులకు సముండవు; సమ్మతుండవు, చెప్పు మింక నప్పాండవు లేమి సేయువా?’ రనిన విదురుం డిట్లనియె. 45
మత్తకోకిల ‘దేవమూర్తులు పాండుపుత్త్రులు ధీరచిత్తులు వారి పెం
పీ వెఱుంగనివాఁడవే ధరణీశ! వాయుసుతుండు గాం
డీవియున్‌ భుజవిక్రమప్రకటీకృతుల్‌ వివిధాస్త్ర వి
ద్యావిశేషులు వైరివీరులఁ దక్కనిత్తురె పోరులన్‌.
46
క. మొనసి యధర్మద్యూతం | బున భేదము వుట్టుఁ బాండుపుత్త్రులకును నీ
తనయుల కని మును చెప్పిన | విన నొల్లక కొడుకుపలుకు వింటివి కడఁకన్‌.
47
వ. ఇఁక నయినను వారి రావించి, తొల్లి నీచేతం బడయంబడిన రాజ్యంబునందుఁ బ్రతిష్ఠించి, కీర్తియు ధర్మంబును నిలుపుము; రాజ్యంబును ద్రివర్గంబును ధర్మమూలంబులు గావున నంద వర్తిల్లు; ధర్మువు విడిచి యధర్మవర్తి యయి కర్ణ శకుని దుశ్శాసన శిక్షితుండైన దుర్యోధను దుశ్చేష్టితంబుల కొడంబడ వలవదు. 48
తే. వీని పుట్టిన పాపంపువేళఁ బెక్కు | దుర్నిమిత్తముల్‌ పుట్టిన నిర్ణయించి
యేను జెప్పితిఁ దొల్లియు వీనిచేత | నెట్టుఁ గౌరవులకు నెగ్గు వుట్టు ననియు.
49
వ. కులదూషకు దూషించి కులంబు రక్షించుట ధర్మువు; ధర్మరాజు నఖిలమహీరాజ్యరక్షకుం జేసి పుత్త్ర పౌత్త్ర మిత్త్రా మాత్య బంధు వర్గంబుల నెల్ల రక్షింపుము; సభామధ్యంబునందు ద్రౌపదీ భీమసేనులం బ్రార్థింప దుశ్శాసనుం బంపుము. 50
చ. అతిశయితామరోత్తముఁ డహర్పతితేజుఁ డజాతశత్రుఁ డూ
ర్జితుఁ డజితుండు నీ సుతులు సేసిన యెగ్గు దలంపఁ; డాతనిన్‌
ధృతి నభిషిక్తుఁ జేయుము ప్రతీపకులోద్వహ! యిట్ల యైన నీ
కృతమునఁ గౌరవాన్వయ మకిల్బిషకీర్తిఁ బ్రకాశితం బగున్‌.’
51
వ. అని పలికిన విదురు పలుకులు విని కడు నలిగి ధృతరాష్ట్రుం డిట్లనియె. 52
క. ‘నా దేహంబునఁ బుట్టిన | యాదిసుతున్‌ విడువ నెట్టులగు? నాత్మజులం
గాదనక విఘాతించు ద | యాదూరులు గలరె? యిట్టు లన నీ కగునే?
53
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )