పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
అర్జునుఁ డమరావతికిఁ బోవుట (సం. 3-43-26)
చ. ‘అలఘు తపస్సమాధి నియతాత్ములకున్‌, బహుపుణ్యలోకకాం
క్షులకు, విశుద్ధమానసులకున్‌ సతతంబును సంశ్రయంబ వై,
లలిత నిలింప దంపతి విలాస విహార మహోత్సవంబులుం
గలిగి వెలుంగు రత్నమయ కందర సుందర మందరాచలా!
346
వ. నీయందలి పుణ్యతీర్థంబులు సేవించుచు గంగాంబు ధౌతస్థలరుహ వనస్పతి ఫలంబు లుపయోగించుచు సుఖం బుండితి; నమరావతికిం బోయి వచ్చెద’ నని మందరనగంబు వీడ్కొని పురందరనందనుండు దేవ పథంబున కరిగి. 347
సీ. పరమధర్మస్థితిఁ బ్రజఁ బ్రీతిఁ గాంచిన | రాజులకు, నుదగ్రరణమునందుఁ
బతుల ప్రస్తవమునఁ బ్రాణముల్‌ విడిచిన | వీరులకును, యజ్ఞవిధులఁ జేసి
సురలను వసుమతీసురులను దనిపిన | ధర్మాత్ములకు, మహాతాపసులకు,
నిలయంబులై రమణీయంబు లగునట్టి | హర్మ్యవిమానసంహతుల దాని,
 
తే. సకలభువనంబులం గల సత్పురముల | కెల్ల నెక్కు డనఁ దగి శిఖీందు రవుల
దీప్తి లేకున్నఁ దనదైన దివ్యదీప్తి | విస్తరంబున నెప్పుడు వెలుఁగు దాని.
348
వ. మఱియు ననాహితాగ్నులకు, నతీర్థసేవకులకు, ననృతవాదులకు, వేద విరుద్ధాచారులకు, మాంసాహారులకు, రణపరాఙ్ముఖులకుఁ జొర నవిషయంబును, నతి గహ్వరంబును నైనదాని నమరావతిఁ జొచ్చి, తద్గోపుర సమీపంబున ననవరత గండస్థల గళదవిరళమదజలకుల్యాభిరామంబై నిరంతర నిర్ఝరనీహార నగంబునుం బోలె నొప్పుచున్న యైరావతంబుఁ జూచుచు. సురసిద్ధ సాధ్య గణంబుతో విద్యాధరాప్సరో గంధర్వ కిన్నర జేగీయమానుం డగుచు చను నప్పుడు. 349
క. సకలర్తు సురభి కుసుమిత | సుకుమారోద్యాన తరుల సుడియుచుఁ బ్రణయో
త్సుకుఁడై పవనుఁడు పాండవు | నకు నభిముఖుఁ డయ్యెఁ దన్మనఃప్రియ మెసఁగన్‌.
350
క. నరుఁడైన యాదిముని యని | హరిసుతుఁ డని హరిసహాయుఁ డని హరుచేతన్‌
వరములు వడసిన వాఁడని | సురలెల్లను వచ్చి పార్థుఁ జూచిరి ప్రీతిన్‌.
351
వ. అర్జునుండు నయ్యమరావతీ విభవంబు సూచి హర్షించుచు అప్సరోగీయమాన మంగళహిత గీతావహిత మానసుం డగుచు సిద్ధ మునిగణాశీర్వాదంబులు సేకొనుచుం జని, మాతలి నిర్దేశంబున దివ్య రథావతీర్ణుండై. 352
క. శతమఖునకు భువనావన | రతశీలున కఖిలదేవరాజర్షి సమ
న్వితునకు వజ్రాభీలో | న్నతపృథుభుజునకుఁ గృతప్రణాముం డయ్యెన్‌.
353
చ. అనిమిషనాథుఁడుం బ్రచలితాంగద తుంగ భుజాయుగంబునం
దనయునిఁ గౌఁగిలించుకొని తత్‌క్షణజాత నితాంత సమ్మదం
బునఁ బులకాంకితాంగుఁ డయి మున్ను నిజాంకతలస్థుఁ జేసి య
త్యనఘు నిజాసనార్ధమున నాదట నుంచెఁ గరంబు నెమ్మితోన్‌.
354
క. లీ లైరావతకుంభా | స్ఫాలన కర్కశకరములఁ బలుమరును మరు
త్పాలకుఁ డంటుచు నుండె గు | ణాలంకృతుఁడైన పార్థునంగముఁ బ్రీతిన్‌.
355
వ. ఇట్లధిక విలాసంబుతో సురవిలాసినీ కర కలిత చారుచామీకర దండ చామర సమీరాలోల కుంతలుం డగుచు సురరాజుతో నేకాసనంబున నున్న యప్పార్థుం బాకశాసను శాసనంబున దేవ గంధర్వ సిద్ధ విద్యాధరు లతిప్రీతి నర్చించి రంత. 356
తే. పాకశాసనుపనుపునఁ బార్థుఁ డొక్క | మణిమయంబైన మహనీయ మందిరమున
నెలమి గంధర్వ సంగీత హృద్యగోష్ఠి | నుండెఁ జెవులకు నుత్సవం బొందుచుండ.
357
వ. అంత సూర్యాస్తమయ సమయంబునఁ జంద్రుం డుదయించి సాంద్రచంద్రికావిలాసంబున దిగ్వనితల నలంకరించుచుండ, నిలింపపతి పంపున సొంపార నూర్వశి యర్జునసంగమకాంక్షంజేసి చంద్రికాధవళ దుకూలంబు గట్టి, మృగమద కర్పూర కుంకుమోన్మిశ్రిత సుగంధం బలఁది, వివిధ సురభి కుసుమ విసరంబులు ముడిచి, మణిమయ భూషణాలంకృతయై నిలుకడ వడసిన క్రొమ్మెఱుంగుఁ దీఁగయుంబోలె, మణిమయ మంజీర ఝళం ఝళ నినాదంబును, గంకణ, ఝణ ఝణత్కారంబును, గటికలాప కింకిణీ క్రేంకారంబును, మదనాజ్ఞా వాద్యఘోషంబునుంబోలె మ్రోయుచుండ, మందగమనంబునఁ బురందరనందను మందిరంబున కరుగుదెంచిన, నప్పురుషసత్తముండు భయభక్తిసంభ్రమంబులతోఁ బ్రత్యుత్థానంబును దండ ప్రణామంబునుం జేసి, కరకమలంబులు మొగిచి యిట్లనియె. 358
క. ‘ననుఁ బుత్త్రస్నేహంబున | మనమున మన్నించి శుభసమగ్రునిఁ జేయం
జనుదెంచి తీవు ముదమున | జనయిత్రీ! యేఁ గృతార్థజన్ముఁడ నైతిన్‌.’
359
తే. అనిన నూర్వశి యిట్లను నాత్మనేత్ర | మధుపము లతని సౌందర్యమధువుఁ గ్రోలు
చుండఁ దమకంబు మీఱి యనూన ధర్మ | నిపుణుఁ డగు నర్జునునితోడ నెయ్య మొనర.
360
చ. ‘అనుపమశౌర్య! నీదు సముదగ్ర గుణంబులు నారదాది స
న్మునివరులెల్లఁ జెప్పఁగఁ బ్రమోదమునన్‌ భవదీయ సంగమం
బనిశముఁ గోరుచుం దగఁ బ్రియంబున వచ్చితి; నేను గోరఁగా
నను జనయిత్రి వంచు నొక నాయము వల్కెదు వక్రభాషలన్‌.
361
తే. నీకు నేనాఁటి తల్లిని నిజము సెపుమ? | యమరలోకంబు వేశ్యలమైన మాకు
నిట్టి తగవులు నడవ వహీనబాహు | వీర్య! యిచ్చట వావులు వెదకఁజనదు.
362
వ. ఈ లోకంబున వనితలుఁ బురుషులు విచ్చలవిడిఁ గ్రీడింతు; రిచ్చటి కిది యనిందితంబైన యాచారంబు; నీవును ద్రిదివంబునకు వచ్చిన యప్పుడ దివ్యపురుషుండవు గావున నా మనోరథంబు సఫలంబుగా మందార మంజుల మంజరీ మకరంద పాన మత్తు మధుకర గాన మనోహర స్థలంబులను, మేరు శైల కందరంబులను, మంద పవనంబులు గల నందనాది వనంబులయందును, నితాంత కాంత వికసిత కనకారవింద సమధిక సౌరభ సంవాసిత మహానంద కందంబులైన మందాకినీ తీర మణిమయ వేదికలయందును, జంద్రికాసుందరంబులైన సికతాతలంబులను, మఱియు నిర్జర విహార స్థానంబుల ననవరత సురత కేళీ సౌఖ్యాంబుధి నన్ను నోలలార్పు’ మనిన, నిర్వికార ధైర్యధుర్యుండై యర్జునుం డిట్లనియె. 363
క. ‘ఓహో! యిమ్మెయి ధర్మ | ద్రోహోక్తులు పలుకఁ దగునె? దోసం బది గా
దే? హరి హరి! మనమునఁ దగ | వూహింపక నన్నుఁ బలుకు టుచితమె నీకున్‌?
364
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )