పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
నలుండు నిజరూపంబుతో దమయంతిం గూడుట (సం. 3-75-27)
ఉ. ఆయతబాహుఁ దప్తకనకాంచితవర్ణు మనోజరూపు నిం
ద్రాయితు సూర్యతేజు నిషధప్రభు నన్నలుఁ జూచి పద్మప
త్రాయతనేత్ర యప్డు దమయంతి గరంబు ముదంబు నొంది ల
క్ష్మీయుత యయ్యె బంధులకు మిత్త్రులకున్‌ హృదయప్రియంబుగన్‌.
220
వ. ఇట్లు సంగతులైన యయ్యిరువురకు విరహ పరితాపంబు తోడన శరీరమలినత్వంబు వాసెఁ, బర స్పరానురాగంబు తోడన విభూషణశ్రీవిశేష విలేపన యోగంబులు విస్తరిల్లె; నంత నంతయు విని భీముండు జాతసస్య యైన వసుధ తోయసంప్రాప్తి నాప్యాయిత యైన ట్లజ్ఞాతచర్యుం డైన తన పతిం బడసి పరమసంతుష్టహృదయయై చంద్రుతోఁగూడిన రోహిణియుంబోలెఁబతిం గూడి యొప్పుచున్న దమయంతిం జూచి సంతసిల్లి, తన పురంబునం దష్టశోభనంబులు దేవగృహంబులయందు విశేషపూజలు సేయించె; నట్టి మహోత్సవం బెఱింగి ఋతుపర్ణుండు నలునొద్దకు వచ్చి ‘నీవు నిఖిలలోక పూజ్యుండ వయ్యును నాయొద్ద బాహుకుం డనంగాఁ బ్రచ్ఛన్న వృత్తి నున్న నిన్ను నెఱుంగక నీచకర్మంబులయందు నియోగించితి; దీని క్షమియించునది’ యని నలుచేత సత్కృతుండై యశ్వహృదయోపదేశంబు గొని యయోధ్యకుం జనియె; నిట నలుండును విదర్భాపురంబున నొక్కమాసంబు నివాసంబు సేసి, విదర్భేశ్వరు వీడ్కొని దమయంతి నంద పెట్టి, యొక్క రథంబును బదియా ఱేనుంగులును, నేఁబది గుఱ్ఱంబులు, నాఱునూఱు కాల్బలంబులుఁ దనకుఁ దోడుగా నిషధపురంబున కరిగి, పుష్కరుం గని యిట్లనియె. 221
క. ‘దమయంతి రోయిగా జూ | దము నీతో నాడఁ గడఁగెదను, ధరణీరా
జ్యము నీవు నాకు రోయిడు, | మమరఁగ జూదంబు నీకు నభిమతమేనిన్‌.
222
మత్తకోకిల వీరభోజ్యము సుమ్ము రాజ్యము వింటె? నీవును నేను దు
ర్వారవృత్తి రథంబు లెక్కి యవంధ్యవిక్రమ మేర్పడన్‌
భూరివీరరణం బొనర్తము; పోర నోర్చినవాఁడ యి
ద్ధారుణీతలరాజ్యసంపదఁ దాల్చు వీరగుణోన్నతిన్‌.
223
వ. ఈ రెంటిలో నీ కెయ్యది యిష్టంబు దానిన కడంగు’ మనినం, బుష్కరుండు రణంబునందుఁ బరాజితుండు గావున నలుం దొల్లియు జూదంబున నొడిచిన వాఁడై, యింకను నొడిచి దమయంతిం జేకొని కృతార్థుండ నగుదు నని సంతసిల్లి, ‘యేనోటు వడితినేని నఖిలమహీరాజ్యంబు నీయది; నీ వోటువడితేని దమయంతి నాయది’ యని పలికి యొడ్డి నలుతో జూద మాడి యోటువడిన. 224
క. ఘనముగ జంబూద్వీపం | బునఁ గలవా రెల్ల నెఱుఁగఁ బుష్కరుచేతం
గొనియెఁ బునర్ద్యూతంబున | ననఘుఁడు నలుఁ డఖిలరాజ్య మత్యున్నతితోన్‌.
225
వ. ఇట్లు జూదంబునఁ బుష్కరు నోడించి సకల మహీరాజ్యంబును జేకొని నలుండు వాని కిట్లనియె. 226
క. ‘కలిసంప్రాప్తుఁడనై కడు | బలమఱి నీ చేతఁ దొల్లి బలవద్ద్యూత
చ్ఛలజితుఁడ నైతి; నది నీ | బల మని గర్వింప వలదు బలవంతుఁడవై.
227
వ. నీవు నా పితృవ్యపుత్త్రుండవు; ని న్నెద్దియుం జేయనోపఁ బొ’ మ్మని పుష్కరుని విడిచిపుచ్చి పుష్కలంబయిన రాజ్యంబుతో నలుం డున్నంత. 228
క. భీమ ప్రస్థాపిత యయి | కోమలి దమయంతి పుత్త్రకులుఁ దానును ల
క్ష్మీ మహిమ వెలుఁగుచుండఁగఁ | దామరసదళాక్షి వచ్చెఁ దనపతికడకున్‌.
229
వ. అట్లు తన మనోవల్లభయైన దమయంతింగూడి నలుండు విధివిహితానేకాచరితమఖుండైశతమఖు విలాసంబుతో సకలరత్నయుతంబైన రత్నగర్భాధిరాజ్యంబు సేసెఁ; గావున నక్షజితుండు నైతి నని వగవవలదు; నీవును దైవమానుషసంపన్నుండ వయి శత్రువుల జయించి సకలమహీసామ్రాజ్యంబు వడయుదు’ వని బృహదశ్వుండు ధర్మరాజునకు నక్షహృదయం బుపదేశించి. 230
సీ. ఇన్నలోపాఖ్యాన మెప్పుడు దత్తావ | ధానులై వినువారుఁ దవిలి సభలఁ
జదివెడువారును జగతీశ! కలిదోష | నిర్ముక్తు లగుదురు; నిఖిలపుణ్య
ఫలభాగు లగుదురు; బహుపుత్త్రపౌత్త్రాయు | రారోగ్యధనయుక్తు లగుదు; రెల్ల
విషములకును దుష్టవిషయమ్ములకు దూరు | లగుదురు; ధర్మాత్ము లగుదు; రుర్వి
 
ఆ. గడుఁ బ్రసిద్ధ మిదియుఁ; గర్కోటకుని, దమ | యంతిఁ, బుణ్యమూర్తియైన నలుని
ఋజుచరిత్రుఁ డైన ఋతుపర్ణుఁ గీర్తింపఁ | గలిభయంబు లెల్లఁ గ్రాఁగు నధిప!
231
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )