పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
హనుమంతుఁడు భీమునకుఁ దనపూర్వరూపంబుఁ జూపుట (సం. 3-149-1)
క. ‘నీ నాఁటి తనువుఁ జూచియ | కాని యవశ్యంబు పోవఁ; గావునఁ గపినా
థా! నాకుఁ జూపు’ మనవుడు | వానికిఁ దనరూపుఁ జూపె వానరుఁ డంతన్‌.
342
చ. అతులితమై ద్వితీయ కనకాద్రి యొకో యిది నా నిజాంగ మూ
ర్జితముగఁ బెంచి పుచ్ఛమునఁ జేసి దిగంతము లందుచున్న యు
న్నతుఁ గపినాథుఁ జూచి కురునందనుఁ డప్డు నిమీలితాక్షుఁ డై
మతి నతివిస్మితుం డగుచు మారుతి కిట్లనియెన్‌ భయంబునన్‌.
343
క. ‘అతిభీషణ మిది యత్య | ద్భుత మోహో! చాలు; భూనభోమధ్యవ్యా
పిత మయ్యె భవద్దేహా | యతత్వ ముపసంహరింపు’ మనవుడుఁ గపియున్‌.
344
క. తన యెప్పటి రూపముఁ జే | కొని ‘దీనికి నినుమడుం గగుం బ్రతిబలముం
గనినప్పుడు నా రూపం | బనుపమముగ’ ననిన హనుమ కనిలజుఁ డనియెన్‌.
345
ఉ. ‘ఉన్నతిఁ బూని నీవు బలియుం డగు రావణు నశ్రమంబునం
బన్నుగఁ జంపనోపు పటుబాహుబలాఢ్యుఁడ విట్టియున్నతున్‌
నిన్ను సహాయుఁగా బడసి నిర్మలనీతిపరుండు రాఘవుం
డన్నరభోజనాన్వయుల నాజి వధించుట యేమి చోద్యమే?’
346
వ. అనిన వాని కతిప్రీతిమంతుండై హనుమంతు డిట్లనియె ‘నయ్యా! నీవు సౌగంధిక సరోవరంబునకుం బోయెద వే నందు సాహసంబు సేయవలవ; దది యక్షరాక్షసరక్షితంబై దేవతోపభోగయోగ్యంబై యుండు; దేవతలు బలిహోమ నమస్కారంబులఁజేసి భక్తిసాధ్యులు గాని సాహసక్రియాసాధ్యులు గారు; నీవు నిజధర్మ నిష్ఠితుండవై పరమధర్మంబు లెఱుంగునది; యెందేని హీనబుద్ధులు విమోహింతు రట్టి ధర్మాధర్మవిభాగంబు లెఱుంగు విద్వాంసుల నుపాసించి శుభాచారుండవు గావలయు; నాచారంబున ధర్మంబు వుట్టు; ధర్మంబువలన వేద ప్రతిష్ఠ యగు; వేదంబులం జేసి యజ్ఞంబులు ప్రవర్తిల్లు; నట్టి యజ్ఞంబువలన దేవతలు తృప్తు లగుదురు. 347
ఆ. కార్యసిద్ధిపొంటెఁ గాలంబు దేశంబు | నెఱిఁగి బుద్ధిమంతు లెల్లప్రొద్దు
సాహసంబు విడిచి సామాద్యుపాయప్ర | యుక్తి చేయుదురు యథోచితముగ.
348
వ. మఱియు సర్వకార్యంబులు మంత్రమూలంబులు గావున విద్వాంసులై ప్రబుద్ధులైనవారలతో మంత్రంబుఁ జేయునది; బాలకులయు నధికశ్రీదర్పితులయు లుబ్ధులయు లఘుజనంబులయుఁ దోడ మంత్రంబు సేయవలదు. 349
తే. జనులు నిగ్రహానుగ్రహశక్తుఁ డైన | రాజు శాసనమునఁ జేసి రమణతోడ
నోలిఁ దమ తమ మర్యాద లొక్కనాఁడుఁ | దప్ప నోడుదు రిమ్మహీతలమునందు.
350
వ. నీవు నిగ్రహానుగ్రహసమర్థుండవు గావున నీ కెల్లవారును వశ్యు లగుదురు; నిన్నుఁ జూచుటంజేసి నా నయనంబులు సఫలంబయ్యె; నీకెద్ది యిష్టంబు దానిం జేసెద. 351
మత్తకోకిల మీకు నెగ్గొనరించి యున్న యమిత్రులన్‌ హతబుద్ధులం
జీకురాజు తనూజులం గురుసింహ! నీకుఁ బ్రియంబుగా
నేకమాత్రన పోరిలో వధియించి నాగపురంబు నా
నాకులాద్రి శిలావలీ గహనంబు సేయుదు’ నావుడున్‌.
352
మత్తకోకిల ‘ఇంతయుం గపినాథ! నీ కిది యేమి పెద్ద? మహాహవా
భ్యంతరంబున నుద్ధతప్రతిపక్షవీరుల నేమ ని
ర్జింతు; మెవ్వరు మాకు మీ దయఁజేసి మార్కొను నంత య
త్యంతవీరులు లేరు భూవిదితప్రతాపబలోన్నతిన్‌.’
353
వ. అనిన విని భీమసేనునకు హనుమంతుం డిట్లనియె ‘నన్ను రణాంతరంబునం దలంచునది; నీ యందు సౌహృదంబున నాహవంబులో నతిరథుండైన యర్జును రథధ్వజంబునం దుండి మీ బలపరాక్రమంబులం జూతు’ నని భీముం గౌఁగిలించుకొని, వానికి సౌగంధిక సరోవర మార్గంబుఁజూపి, హనుమంతుం డంతర్హితుం డైనఁ, దదాలింగన విగతశ్రముండును విపులజవశక్తియుక్తుండును నై భీమసేనుండు. 354
సీ. వారిధారల ననివారిత నిర్గళ | ద్దానధారలఁ దటిద్ధామములను
దశనధామంబుల నశనిఘోషంబుల | ఘోరబృంహిత బృహద్ఘోషణముల
నివి ఘనబృందంబు లివి గజయూథంబు | లని విచారింపంగ నక్కజంబు
లై లలితోత్తుంగ శైలశృంగంబులఁ | ద్రిమ్మరు జలధరద్విరదతతుల
 
ఆ. విస్మయంబుతోడ వీక్షించుచుం జని | రజతగిరిసమీపరమ్యభూమి
నక్కుబేరవనమునందు సౌగంధిక | కమలవనముఁ గనియె ఘనభుజుండు.
355
క. అందుల హేమాంబుజ మక | రంద రసామోద మృదుతరశ్వసనుం డా
నందంబుఁ జేసెఁ దన ప్రియ | నందనునకు భీమసేనునకు నభిముఖుండై.
356
వ. అంత. 357
క. వీరుండై సౌగంధిక | వారిజములు గొనఁగ నిట్లు వచ్చినవానిన్‌
భూరిపరాక్రము భీము ను | దారగదాహస్తుఁ జూచి తా రుద్ధతులై.
358
వ. దాని రక్షించి యున్న పదివేవురు రాక్షసు లాక్షణంబ విచిత్రాయుధ పరిచ్ఛదులై పఱతెంచి ‘వీఁ డొక్క దివ్య పురుషుం డాయుధంబులు ధరియించినవాఁ, డజినంబులు గట్టిన వాఁ, డధికతేజస్వి, తపస్వి వేషధరుం డిందులకు వచ్చినవాఁ’ డని యచ్చెరువందుచు భీమసేనుం డాయవచ్చి యి ట్లనిరి. 359
తరలము ‘ఇది కుబేరువనంబు; దీనికి నెవ్వరుం జనుదేర నో
డుదురు; నీ విట వచ్చి యేల కడుం బ్రమాదముఁ జేసి? తిం
దుదితతేజుఁడు గ్రీడ లాడుచు నుండు నింతులుఁ దాను స
మ్మదముతోడఁ గుబేరుఁ డీ రుచిమత్సరోజవనంబునన్‌.
360
వ. దీని తీరంబున దేవర్షిగణంబులు దేవతార్చనంబులఁజేయుదు; రిందుల జలంబు లమృతోపమానంబులు; మఱి వైడూర్యనాళంబులై యపూర్వసౌరభంబులైన కనకకమలంబులు గలుగుటం జేసి యక్షరాక్షసాక్షౌహిణీ రక్షితం బగు దీని మహిమం బెఱుంగక యింతదూరంబు వచ్చిన వీరుం డెవ్వండ? వేమి కారణంబున వచ్చి?’ తనిన వారికి భీముం డిట్లనియె. 361
మత్తకోకిల ‘ఏను పాండుసుతుండ భీముఁడ నిద్ధతేజుఁడ ధర్మరా
జానుజన్ముడ; ద్రౌపదీహృదయప్రియం బొనరింపఁగాఁ
బూని యిక్కమలాకరంబునఁ బుష్పముల్‌ గొన వచ్చితిన్‌;
వీనిఁ గొందు నవశ్యమున్‌ సురవీరు లడ్డము వచ్చినన్‌.’
362
వ. అనిన వార లిట్లని ‘రయ్యా! నీవు దివ్యపురుషుండ; వీ సౌగంధిక కమలంబులు గొనియెదేని కుబేరున కెఱింగించి తదాదేశంబునం గొనుము; నీవు ధర్మజానుజుండవు గావున నీకు ధర్మపథంబు తప్పం జన’ దనిన రాక్షసులఁ గటాక్షదృష్టిం జూచి భీమసేనుం డిట్లనియె. 363
క. ‘గిరినిర్ఝరములఁ బుట్టిన | సరోవరం బిదియు సర్వసామాన్యముగా
కరుదుగ నొక్కని యదియే? | పరఁగఁ గుబేరుండు దీనిఁ బడసెనె మొదలన్‌?
364
తే. ఉత్తమక్షత్త్రియుం డేల యొరుల నడిగి | వేఁడువాఁ డగుఁ? దన భుజవిక్రమమున
నన్యధనము లుపార్జించి యర్థిజనుల | కిచ్చి కీర్తి దిక్కుల వెలయించుఁ గాక.
365
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )