పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
భీముఁడు జటాసురునితో యుద్ధము సేయుట (సం. 3-154-28)
వ. అనుచున్న యవసరంబున ననిలసుతుం డనిలవేగంబున నరుదెంచి జటాసురుచేత నిగృహీతులై గగనగతిం జను ధర్మజ నకుల ద్రౌపదులను, మహీతలగతుం డైన సహదేవుం జూచి యయ్యసుర కిట్లనియె. 389
తే. ‘అతిథివై వచ్చి నీవు మాయందుఁ గుడిచి | యసురవై యిట్లు యెగ్గు సేయంగ నగునె?
యెందుఁ గుడిచినచోటికి నెగ్గు సేయ | రెట్టి దుర్జను లైనను నెఱుక విడిచి.
390
వ. నీవు బుద్ధిగలవేని వీరిని విడిచి నీ ప్రాణంబులు రక్షించుకొను; మట్లు గానినాఁడు బక హిడింబ కిమ్మీరులం జంపిన ట్లశ్రమంబునం జంపుదు’ ననిన విని జటాసురుండు వారల విడిచి భీమసేనున కభిముఖుండై. 391
క. ‘రయమున నీచేత నిహతు | లయిన సురారాతులకు రణాంతరమున నీ
దయిన రుధిరమున నుదక | క్రియఁ జేసెద బక హిడింబ కిమ్మీరులకున్‌’.
392
క. అనుచుఁ గడు నలిగి మారుత | తనయు మహాబాహు నసుర దాఁకె; మరున్నం
దనున కెడ సొచ్చి మాద్రీ | తనయులు తత్‌క్షణమ వానిఁ దాఁకిరి వీఁకన్‌.
393
సీ. వారల నిద్దఱ వారించి భీముండు | దాఁకె జటాసురు వీఁకతోడ;
భీమాసురులకు సంగ్రామంబు గడుఘోర | మయ్యె; నిర్మూలంబు లయ్యె వారి
యూరుఘట్టనముల ధారుణీరుహములు; | పదఘట్టనములఁ గ్రక్కదలె ధరణి;
భూరుహపాణులై పోరి యాసన్న భూ | రుహములు వొలిసిన బృహదుదగ్ర
 
ఆ. శిలలఁ గొంతసేపు చెలఁగి పోరాడి రొం | డొరులు పెనఁగి పట్టి పరుషభంగి
నుగ్రు లైన వాలిసుగ్రీవులట్టుల | యుద్ధ మొప్పఁ జేసి రిద్ధబలులు.
394
క. భీమాసుర వీరుల ము | ష్టాముష్టి రణచ్ఛటచ్ఛటాశబ్దం బు
ద్దామం బై తద్విపిన మ | హామృగపక్షులకు నతిభయావహ మయ్యెన్‌.
395
ఆ. అంత భీమసేనుఁ డంతకాకారుఁడై | వాని బలవిహీనుఁగా నెఱింగి
తడయ కపుడు వాని మెడ గ్రుంగఁ బిడికిటఁ | బొడిచె; నసుర ముడిఁగి పడియెఁ బుడమి.
396
వ. ఇట్లు నిర్ఘాత నిపాత భిన్నోన్నత నీలగిరి శృంగంబునుంబోలె నేలఁబడిన జటాసురుశరీరం బెత్తి యొక్క విశాల పరుషపాషాణంబుపై జర్జరితంబుగా వైచి, వానిం గాలగోచరుంగాఁ జేసిన వాయుపుత్త్రుపరాక్రమంబు ధౌమ్యరోమశాది మహీసురవరులు వర్ణించి రని వైశంపాయన కథితంబైన కథ రమ్యంబుగ. 397
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )