పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
నారాయణుఁడు మార్కండేయునకుఁ దన ప్రభావంబు సెప్పుట : (సం. 3-187-1)
క. అని యేను వేఁడికొనుటయు | ఘనతరకరుణారసానుకలితహృదయుఁ డై
తన దివ్యమహిమ యిట్లని | వనజాక్షుఁడు సెప్పె గారవంబున నాకున్‌.
263
ఆ. ‘అనఘ! దేవతలును మునులును నాదైన | మహిమఁ దెలియ లేరు, మహితబుద్ధి
నతులపుణ్యమతివి పితృభక్తుఁడవు గాన | యెలమి నీకుఁ జెప్పవలసెఁ దెలియ.
264
క. నారము లందురు జలముల; | నారయ నారములు నాకు నయనం బగుటన్‌
నారాయణుఁ డను పేర, న | పారనిగమఫణితులందుఁ బరఁగుదుఁ బేర్మిన్‌.
265
తే. అట్టి నారాయణాఖ్యుండ నైన నేను | శాశ్వతుండ నై ప్రభుఁడనై సకలజగము
లోలిఁ బుట్టింతుఁ బాలింతు నుచితవేళ | సంహరింతుఁ జిదానందశాలి నగుచు.
266
మత్తకోకిల అంబుజాసనుఁ డింద్రుఁ డీశ్వరుఁ డంతకుండు ధనేశ్వరుం
డంబుధీశుఁడు లోనుగా సుర లస్మదాకృతు; లుర్వి పా
దంబు, లగ్ని ముఖంబు, సూర్యసుధాకరుల్‌ నయనంబు, లీ
యంబరంబు శిరంబుగా నిటు లద్భుతాకృతి నుండుదున్‌.
267
చ. అతులితదక్షిణాన్వితమహాధ్వరసంఘము లే నొనర్చితిం;
జతురమనీషితాప్రచురసౌఖ్యులు భూసురముఖ్యు లంచిత
వ్రతులు మహీపతుల్‌ సుగుణవంతులు వైశ్యులు భక్తి నన్ను సం
తతమును గొల్తు రీక్షితి నుదాత్తమహాక్రతు కర్మశీలురై.
268
చ. విలయపయోధిమగ్న మగు విశ్వమహీవలయంబుఁ దొల్లి యే
నలఘువరాహవిగ్రహుఁడ నై వెస నెత్తితి, శేషమూర్తి నై
లలితఫణాసహస్రకము లావునఁ దాల్తు నశేషధాత్రియున్‌
జలనిధి నిమ్నగా నగ లసన్నగరీ వనమండలంబుతోన్‌.
269
క. బాడబదహనుఁడనై వడి | నేడు సముద్రముల జలము లేఁ గ్రోలుదు నీ
రేడుజగంబులు విలయముఁ | గూడెడు నెడఁ దజ్జలంబు గొనకొని విడుతున్‌.
270
చ. వదనభుజోరుపాదముల వర్ణచతుష్టయమున్‌ యుగాదియం
దొదవ సృజింతు; ఋగ్యజుషసూక్తులు సామము నయ్యథర్వమున్‌
విదితముగా మదీయముఖవీథుల నుద్భవమొందు; నన్నియుం
దుదిఁ బరివర్తనక్రమవిధూతము లై ననుఁ జేరుఁ గ్రమ్మఱన్‌.
271
క. అనహంకృతు లక్రోధను | లనసూయులు సంగరహితు లధ్యాత్మవిదుల్‌
ఘనసత్యాత్మకులు మహా | మునులు ననుం గొల్తు రెపుడు మోక్షాపేక్షన్‌.
272
తే. అఖిలనక్షత్రతారాగ్రహములు గగన | పవనదిశలును మత్స్యరూపములు వినవె!
సకలరత్నాకరంబులు శయ్యగాఁగ | నిత్యసుఖలీలమై శయనింతు నేను.
273
క. దానము సత్యంబు తపో | జ్ఞానాహింస లనఁబరఁగు సాత్త్వికగుణసం
తానముఁ గామక్రోధా | జ్ఞానంబులు మన్మయములు సంయమివర్యా!
274
క. విను మింకఁ బెక్కుమాటలఁ | బని యేటికి? జగమునందుఁ బ్రకటితముగఁ గ
ల్గినయదియు నేన, లేనిది | యును నేన; సునిశ్చితముగ నూహింపు మెదన్‌.
275
ఉ. ఎప్పుడు ధర్మహాని యగు, నెప్పు డధర్మము మీఱుఁ, గ్రూరు లై
యెప్పుడు దైత్యు లుబ్బుదురు, హీనతఁ బొందుదు రెప్డు వేల్పు లే
నప్పుడు సత్కులీనుల గృహంబుల నుద్భవ మొంది లీలమై
నెప్పటియట్ల నిల్పుదు సురేంద్రుల నంచితధర్మపద్ధతిన్‌.
276
క. సితరక్తనీలపీత | ద్యుతి విలసితరూపములఁ జతుర్యుగముల నే
నతిధృతిఁజరియించి సమం | చితధర్మస్థాపనంబు సేయుదు ననఘా!
277
మత్తకోకిల కాలచక్రము నిర్వికల్పము గాఁగ నేన నయింతు ను
న్మీలితక్రమవిక్రమైకమృద్ధినై; లయవిక్రియా
వేళ నింతయు సంహరింతుఁ బ్రవృద్ధయోగబలోల్లస
త్కాలరూపము దాల్చి దుర్వహగర్వనిర్వహబుద్ధి నై.
278
క. నా తెఱఁగంతయు నిప్పుడు | చేతోముద మొదవ నీకుఁ జెప్పితిఁ ద్రిజగ
ద్ధాత యగు పితామహుఁడు సు | జాతుఁడు నాయెడలఁ జక్క సగబాలు సుమీ!
279
వ. నారాయణాభిధానుండ నైన యేను బాలరూపంబున శంఖచక్రగదాధరుండ నై యేకార్ణవంబునందు మహాయుగసహస్రసమయంబయిన కాలంబున యోగనిద్రాపరవశుండనై యుండుదు; నిట్టి దారుణకల్పాంతంబు సూచి నీవు భీతుండ వగు టెఱింగి, నీవలని యనుగ్రహంబున నాత్మగుప్తంబు లైన సకలలోకంబులు గనునట్టి తెఱంగుఁ గావించితి; నీ వింక నిశ్శంకహృదయుండ వయి వలసినయెడం జరియింపుము; మదీయనాభికమలకర్ణికాశయనుం డయి యున్న చతురాననుండు మేల్కని సృజియించు లోకంబు లేర్పడం జూచెద’ వని యానతిచ్చి యద్దేవుం డచ్చోటన యంతర్హితుం డయ్యె; నత్యంత విచిత్రం బైన యీవృత్తాంతంబు నాకు ననుభవగోచరం బైనయది. 280
శా. నా కమ్మైఁ బొడసూపెఁ దాను గృపతో నా కందు; నేఁ డియ్యెడన్‌
నీకున్‌ గాదిలిచుట్టమై సచివుఁడై నెయ్యంబుమై నున్న పు
ణ్యాకారుం గమలాయతాక్షుఁ గరుణైకాయత్తు నత్యుత్తమ
శ్లోకుం గృష్ణునిఁ గంటి; నా సుకృతముల్‌ శోభిల్లెఁ బక్వంబు లై.
281
క. ఈ దేవదేవుకరుణం | గాదే కురునాథ! నిర్వికారుఁడనై నిః
ఖేదుఁడ నై యుండుదు దే | వాదివివిధభూతవిలయ మయ్యెడునపుడున్‌.
282
తే. అనఘ! యిద్దేవుసన్నిధి యగుటఁ గాదె | నాకుఁ బూర్వవర్తనకథనంబునందు
బోధ మిప్పుడు గలిగె; నిప్పుణ్యుఁ బరమ | పురుషుఁ ప్రభవిష్ణుఁ గృష్ణుని శరణు సొరుము.’
283
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )