పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ధర్మవ్యాధుఁడు కౌశికునకు జీవలక్షణంబులు సెప్పుట (సం. 3-200-26)
క. ‘విను జీవుండు సనాతనుఁ | డనఘుఁడు నిజకర్మవశత నధ్రువదేహం
బునఁ బొందు దేహపాతం | బున నెప్పుడుఁ జెడఁ డతండు భూసురవర్యా!
72
క. ఈ యొడలు విడిచి వేఱొక | కాయముఁ గైకొని శరీరి కర్మవశగతిం
బోయి సుఖదుఃఖములు గనుఁ; | బాయక వెండియును దేహబంధముఁ బొందున్‌.’
73
వ. అనిన విని బ్రాహ్మణుండు లుబ్ధకునితోడం ‘బుణ్యపాపానురూపంబు లయిన దేహబంధంబు లెట్టి?’ వనిన వాఁ డి ట్లనియె. 74
చ. ‘స్థిరమగు పుణ్యకర్మమున దేవభవం బగుఁ, బుణ్యపాప సం
కరమున మానుషత్వ మగుఁ, గల్మషముల్‌ పశుకీట భావముం
బొరయఁగఁ జేయు; నిప్పగిదిఁ బుట్టుచుఁ జచ్చుచు మోహవార్ధిలోఁ
దిరుగుచునుండుఁ గాని యొకతీరము సేరఁడు జీవుఁ డెన్నఁడున్‌.
75
చ. ఇది సకలంబుఁ గాంచి బుధుఁ డెన్నఁడుఁ బాపము పొంతఁ బోక ని
ర్మదనిరహంక్రియాత్ముఁడును మత్సరదూరుఁడు నై చరించుఁ బెం
పొదవఁగ ధర్మమార్గమున నొయ్యన ధర్మము తీ పెఱింగి తా
వదలఁడు సత్క్రియావిధము వారక యెక్కు డొనర్చు ధర్మముల్‌.
76
చ. చిరముగ ధర్మముల్‌ నడపఁ జిత్తము దేఱుఁ బ్రసన్నచిత్తుఁ డై
పరువడి నింద్రియార్థముల భంగులు రిత్తలుగా నెఱింగి చె
చ్చెర నవి యంతవట్టు నిరసించి తపో దమ సత్యశీలతం
బరిణతి నొందుఁ బొందుఁ బిదపం బరమార్థపదప్రభావమున్‌.’
77
వ. అనిన నమ్మహాద్విజుండు ధర్మవ్యాధున కి ట్లనియె. 78
ఆ. ‘ఇంద్రియంబు లనఁగ నెయ్యవి? యవి నిగ్ర | హింపకున్నఁ బాప మేమి దొడరు?
వాని నిగ్రహించువానికి నగు ఫలం | బెట్టి?’ దనిన నాతఁ డిట్టు లనియె.
79
క. ‘విను విషయజ్ఞానమునకు | ననయంబును మనసు మూల; మది కామక్రో
ధనిరూఢ మగుచుఁ బురుషుని | ననిశము నెలయించు నింద్రియార్థక్రియలన్‌.
80
సీ. ఇంద్రియార్థంబుల కెలసిన పురుషుండు | గాఢరాగంబునఁ గరఁగుచుండు;
రాగంబువలనఁ దిరంబగు లోభంబు | లోభియై కరుణకు లోనుగాఁడు;
మఱి సముద్ధతవృత్తి మరగుఁ బాపక్రియఁ | దగువారు సెప్పెడి తగవు వినఁడు;
కుజనుల దెసఁ బ్రీతి గొఱలుఁ; దుల్యంబులు | గాకుండు వాఙ్మనఃకర్మభంగు;
 
ఆ. లిహమునందుఁ బుణ్యహీనుఁడై చెడిపోవుఁ | బరమునందు దుఃఖభరము నొందుఁ;
గాన యింద్రియార్థగతిఁ బోక సాధుసం | సర్గఁ జేసి సుగతిఁ జనుట యొప్పు.
81
వ. ఇంద్రియంబు లన నెయ్యవి యనియు, నింద్రియ జయసిద్ధియు నీవు నన్నడిగితివి; తత్ప్రకారంబు బ్రహ్మవిద్యావిషయంబు మాబోఁటివారికి నవాచ్యం బై యుండు; నైనను నీవు బ్రాహ్మణప్రవరుండవు గావున సద్‌బ్రాహ్మణ ప్రియం బవశ్యకర్తవ్యంబు; పరమబ్రహ్మవిదు లైన బ్రాహ్మణవరులకు నమస్కరించి, బ్రహ్మవిద్యాప్రపంచం బెఱింగించెద; నవధాన పరుండ వై యాకర్ణింపుము. 82
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )