| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| శా. |
నానాసిద్ధగణంబు గొల్వఁ బరమానందంబునం జంద్ర రే ఖా నవ్యాంచితమౌళి భూరిభుజగాకల్పోజ్జ్వలాకారుఁ డీ శానుం డానతశంకరుండు గిరిజాసంయుక్తుఁడై వచ్చెఁ ద త్సేనానిం బ్రియాసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్. |
233 |
| వ. | ఇట్లు వచ్చి మహాదేవుండు మహాసేనుం గౌఁగిలించుకొని యతనికి విశ్వకర్మ నిర్మితంబును హేమమయంబును నయిన పుష్పమాలిక యొసంగె’ నని చెప్పిన విని ధర్మజుండు ‘కుమారుఁడు రుద్రాంశజుఁ డని చెప్పుదు; రదియె?’ ట్లనిన మార్కండేయుండు పాండవేయున కిట్లనియె; ‘వినుము; రుద్రుండు మున్ను వీర్యంబు వహ్నియందు సంగ్రహించినఁ దత్తేజోవిశేషంబునం జేసి పావకుండు గుమారు నుత్పాదించె; నదియునుం గాక, యగ్ని రుద్రుం డని వేదవిదు లైన విప్రులవలన వినంబడు; నట్లగుటం గుమారుండు వహ్నిసంభవుండును, రుద్రసూనుండును నని చెప్పంబడియె; నగ్నిభామిని గృత్తికాఖ్యలైన మునిపత్ను లార్వుర రూపంబులు గైకొని, ప్రియ సమాగమంబు సలిపి శ్వేతశైలంబున రేతస్‌స్కందంబు సేయుటం బ్రభవించినవాఁడు గావునఁ గార్తికేయ స్కంద నామంబులం బరఁగె’ నని చెప్పి యిట్లనియె. | 234 |
| తే. |
అప్పు డింద్రుండు మున్ను దా నబ్జభవు ని | యోగమున సురక్షితముగ నునిచినట్టి దేవసేనకుఁ గన్యకాతిలకమునకుఁ | జెలువముగ నలంకారంబు సేయఁ బనిచి. |
235 |
| వ. | సముచిత ప్రకారంబున నచ్చటికిఁ దెప్పించి కుమారుం జూచి ‘యిక్కన్నియ భవదర్థం బై పరమేష్ఠిచేత సృజియింపంబడియెం గావున నివ్వరవర్ణినిం బరిగ్రహింపు’ మనిన న ప్పార్వతీనందనుండు మందస్మిత సుందర వదనారవిందుం డయి యమ్ముహూర్తంబునందు. | 236 |
| ఉ. |
మానిత విక్రమోజ్జ్వలుఁడు మంగళతూర్యనినాద మొప్పఁ దే జోనిధి వహ్నిసాక్షిగ విశుద్ధవిధిజ్ఞుఁడు దేవమంత్రి మం త్రానుగమం బొనర్పఁగఁ బ్రియం బెసలార వరించెఁ జారుప ద్మానన దేవసేనఁ గరియానఁ గరగ్రహణ ప్రయుక్తితోన్. |
237 |
| ఆ. |
గుహుఁడు దేవసేనఁ గోరి పెండిలి యైన | యాదినంబు షష్ఠి యగుటఁ జేసి యర్చనీయ మయ్యె నాదివసంబు లో | కముల నెల్ల వెలసె గారవమున. |
238 |
| క. |
ఏ దినమునందు షణ్ముఖు | శ్రీదేవి వరించెఁ గమలచిహ్నితకర యై యా దివసము పంచమి లో | కాదరణీయంబు లక్ష్మి కాస్పద మయ్యెన్. |
239 |
| వ. | ఇట్లు విహితమంగళాచారుం డయిన కుమారు పాలికిం జనుదెంచి నిజభర్తలచేతం బరిత్యక్తలైన ముని భార్యలార్వురు నధికదైన్యవివర్ణవదన లై యిట్లనిరి. | 240 |
| చ. |
‘కనుకనిఁ గూడి దుర్జనులు గానక చూడక యేము హవ్యవా హనునకు నిన్నుఁ గంటి మని యాడిన నిందకు నోడి మమ్ముఁ జ య్యనఁ బతు లుజ్జగించిరి ప్రియంబున నింకిట నీవు మాకు నం దనుఁడవు మమ్ముఁ బ్రోవ విహితంబు గుమారక! నీ కవశ్యమున్. |
241 |
| తే. |
పుణ్యలోకంబులకుఁ బాసి పొక్కుచున్న | మమ్ముఁ జేకొని కరుణాసమగ్రబుద్ధిఁ బుణ్యగతియందు నిల్పుము పుత్త్రభావ | దృష్టి వెలయ మా యలమట దీర్పవయ్య! |
242 |
| క. |
అనినఁ గుమారుఁడు వినయం | బున నిట్లను నేను మీకుఁ బుత్త్రుఁడ; మీరల్ ననుఁ గన్న తల్లులరు వినుఁ; | డనుమానం బేల మీ ప్రియం బొనరింతున్. |
243 |
| సీ. |
అనుచుఁ జేరువ నున్న యనిమిషపతిఁ జూచి | ‘వీరికిఁ దగుపదం బారయంగ వలయు’ నావుడు బలవైరి యిట్లనుఁ ‘జంద్ర | సతులైన యా దక్షసుతలలోన రోహిణి పొరువున రుచి నొప్పు నభిజిత్తు | నా నొక్కచుక్క దాఁ బూని యిప్పు డందఱకంటె నత్యంతవల్లభ నేన | యగుదుఁ జంద్రున కని వగచి యర్థిఁ |
|
| ఆ. |
దపము సేయ నరిగెఁ; దత్పదం బది రిత్త | యున్న యదియు; వీరి నునుపు మచట’ ననిన వారిఁ బ్రీతి నతఁడు వీడ్కొలిపినఁ | గడఁగి వారు సనిరి గగనమునకు. |
244 |
| వ. | నాఁటంగోలెఁ గృత్తిక లార్వురు నగ్ని దైవత్యం బనంబరఁగు నక్షత్రం బై దివంబున వెలింగిరి; తదనంతరంబ స్వాహాదేవి యేతెంచి కుమారుం గని ‘నీవు మత్పుత్త్రుండవు నిత్యంబును నీపాల వసియింపవలతు’ ననినం బ్రీతుండై యాతం ‘డట్ల కాక నీవు మత్సమీపంబున నుండి యేనును నీ కోడలుం గొనియాడం బ్రియంబున నుండు’ మనియె, నప్పుడు కుమారమాతృకలు హవిషయుఁ గాళియుఁ గౌశికయు నుద్ధతయు శారికయు నార్యయు వైధాత్రియు ననువార లేడ్వురుం గుమారుముందట నిలిచి యిట్లనిరి. | 245 |
| ఉ. |
‘మమ్ము జగత్త్రయంబునకు మాతలఁగా నొనరింపు మిప్డు; ము న్నిమ్ముల నొప్పు మాతృకల కెక్కుడు గావుత మేము; సర్వలో కమ్ములఁ దొంటి మాతృకలఁ గైకొనకుండుటయుం బ్రియంబుతో మ మ్మనిశంబుఁ గొల్చుటయు మాకు వరంబుగ నిమ్ము షణ్ముఖా!’ |
246 |