పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ఈశ్వరుండు కుమారసహితుండై భద్రవటంబు సేరుట (సం. 3-221-1)
మ. తనయుం గౌఁగిటఁ జేర్చుచున్‌ వరుస మూర్ధఘ్రాణముం జేయుచున్‌
జనితానంద మనస్కుఁడై గిరిసుతాసంయుక్తుఁ డీశానుఁ డ
య్యనఘుం దోడ్కొని బద్ధకేసరి సహస్రస్యందనారూఢుఁ డై
చనియెన్‌ భద్రవటస్థలంబునకు నైశ్వర్యం బవార్యంబుగన్‌.
263
వ. అమ్మహాదేవు ముందట ననేక యక్షగణ పరివృతుండును బుష్పకాధిరూఢుండును కుబేరుండును, వెనుక దెస నమరగణ సమన్వితుండును నైరావతారోహణోల్లాసియునై వాసవుండును, దక్షిణపక్షంబునం బ్రబల రక్షోయక్ష రక్షితుండై యమోఘ నామ ధేయుండైన యక్షోత్తముండును, గృతపరికరులైన వసు రుద్రాదిత్యులును, దాపలి పక్షంబున నతిభయంకర వ్యాధి మృత్యు పరివేష్టితుండై పితృపతియును, వివిధయాదోనివహ సనాథుం డయిన వరుణుండును నడచిరి; మఱియు మూర్తిమంతంబు లై శూల పట్టిస గదా ముసలాదికంబులైన యద్దేవు నాయుధంబులుఁగమండలు ప్రముఖోపకరణంబులుం జనియె; నయ్యాదిదేవునకు నా సన్నుండయి చంద్రుండును ధవళాతపత్రంబు ధరియించె; ననిలాగ్నులు చామరహస్తులై కొల్చిరి; విద్యయు, సావిత్రియు, గాంధారియుఁ గేశినియు నను దేవాంగనలు దాక్షాయణిం గొల్చి చనిరి; త్రిలోచనసఖుం డైన పింగళుం డను యక్షుండు వృషభకేతనంబు దాల్చె; నివ్విధంబున నభిరామ విభవోదారుండై కుమార గురుండు భద్రవటంబు సేర నరిగి, యచ్చటఁ గుమారుం జూచి యిట్లనియె. 264
తే. ‘సప్తమం బైన మారుత స్కంధమునకుఁ | బతివి గమ్ము కుమార! దేవతల కెపుడుఁ
గార్య మొదవినఁ జేకొని కడఁకఁ దీర్పు; | మనిశమును మత్పదధ్యానఘనుఁడ వగుము.
265
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )