పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
కర్ణ సౌబలులు ధృతరాష్ట్రుచేత ఘోషయాత్ర కనుజ్ఞ గొనుట (సం. 3-227-2)
ఉ. ‘ద్వైతవనంబునట్టి సుఖవాసము గోవుల కెందు లేదు; ధా
త్రీతలనాథ! యిప్పుడు ప్రదీప్తములై సతతంబుఁ బేర్చి గో
వ్రాతభయంకరంబు లగు వాలుమృగంబులు సంచరించు; మీ
కా తెఱఁగెల్లఁ జెప్పుటకునై యిట వచ్చితి నేను జెచ్చెరన్‌.’
360
వ. అనిన యనంతరంబ కర్ణసౌబలులు ధృతరాష్ట్రుతోడ ‘దేవా! యట్లయినం దడయక దుష్టమృగనాశనంబును, గోగణ సంరక్షణంబును జేయుటకు భవత్సూను దుర్యోధను నియోగింపు’ మనిన నతండు గొండొకవిచారించి యి ట్లనియె. 361
మ. ‘తగు గోరక్ష యొనర్ప, దుష్టమృగ విధ్వంసంబుఁ గావింప మే
లగు; నైనన్‌ వినుఁ డవ్వనాంతరమునం దాసక్తిమై నున్న వా
రు గరిష్ఠాత్ములు పాండురాజుతనయుల్‌, రూఢప్రతాపాఢ్యు; ల
ట్లగుటన్‌ మీ గమనంబు నామదిఁ బ్రియంబై తోఁప దెబ్భంగులన్‌.
362
చ. వనమున కేఁగి వందురిన వా రని వారల మీ రవశ్యముం
జెనకఁ దలంతు; రప్పురుషసింహులు భూరితపోనిధుల్‌ మనం
బునఁ గలుషించిరేనియుఁ దపోమహిమన్‌ మిము నిర్దహింతు రొం
డె నతులితాస్త్ర శక్తిని వడిం దునుమాడుదు రాజి నందఱన్‌.
363
క. మున్నును మీచేతఁ గడున్‌ | బన్నము వడి నొచ్చినారు పార్థులు; మిమ్ముం
గన్నంత నలుగకుండునె | పన్నగరిపుసన్నిభుండు పవనజుఁ డాత్మన్‌.
364
వ. అదియునుం గాక. 365
చ. ఒకరుఁడ ధాత్రి యంతయును నోర్చెఁ గృతాస్త్రుఁడు గాక యుండియుం
బ్రకటితబాహువిక్రముఁడు ఫల్గునుఁ డిప్డు మహేంద్రుపాల న
త్యకుటిల దివ్యబాణవిదుఁడై యెలమిం జనుదెంచె నట్టి వా
నికి నెదురంగ శక్యమగునే రణభూముల నింక నేరికిన్‌?
366
తే. చెనకి మీరు వారికిఁ గీడు సేయుటయును | వారు మీ కెగ్గుసేఁతయు వగవ మేలు
గాదు; వలసిన ఘోషరక్షణ మొనర్పఁ | దగినవారలఁ బుత్తము దడయ కందు.’
367
వ. అని యొడంబడకున్న నయ్యాంబికేయునకు శకుని యిట్లనియె. 368
ఉ. ‘పాలితవిక్రమోన్నతులు పాండుతనూజులు; వారి కప్రియం
బేల యొనర్తు మే మధిప! యే మటు సేసితిమేనియుం బ్రతి
జ్ఞాలపితుండు ధర్మజుఁడు సత్యము దప్పునె? తమ్ము లేల త
చ్ఛీల మతిక్రమింతు? రిది సిద్ధము; నమ్ముము నెమ్మనంబునన్‌.
369
క. మాకును జిత్తంబుల మృగ | యాకౌతుక మతిశయిల్లినది; గోగణర
క్షాకరణము గార్యం బటె; | యేకీడును నేల పొందు నిందు మహీశా!’
370
క. అనిన నతఁడు గొండొకవడి | మనమున నూహించి ‘బుద్ధిమంతుల రై గో
ధనము నరసి తడయక రం’ | డని వారికి నెట్టకేల కనుమతి యిచ్చెన్‌.
371
ఆ. ఆ క్షణంబ కౌతుకాతిశయ వ్యగ్ర | హృదయుఁడైన ఫణధరేంద్రకేతు
నాజ్ఞఁ గరిపురంబునం దెల్ల ఘోషింపఁ | బడియె ఘోషయాత్ర ప్రకటలీల.
372
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )