| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| క. |
గంధర్వులు దెరలుట విని | గంధర్వవిభుండు క్రోధకలుషితమతి యై గంధగజము చందమున, మ | దాంధగతిం గవిసెఁ గౌరవానీకముపై. |
395 |
| వ. | ఇట్లు గవిసి చిత్రసేనుండు. | 396 |
| శా. |
మాయాసంగరకోవిదుండు వికసన్మాయాస్త్రజాలంబులన్ వాయువ్యాప్తి యడంగ నర్కకిరణవ్రాతంబు రుద్ధంబుగాఁ జేయం జొచ్చినఁ, ద్రెళ్ళెఁ దేరులు, కరుల్ శీర్ణంబు లయ్యెన్, దళ త్కాయం బయ్యె హయాలి, గూలిరి భటుల్ కౌరవ్యసైన్యంబునన్. |
397 |
| క. |
పొదలి యొకని కొక్కనికిని | బదుగురు పదుగురుగఁ గవిసి పౌరవసేనం బొదివి సమయింపఁ దొడఁగిరి | వదలక గంధర్వు లని నవార్యోద్ధతులై. |
398 |
| వ. | అవ్వియచ్చరుల విక్రమంబునకు నోర్వక బెదరి చెదరి కురురాజసైన్యంబు ధర్మనందనుం డున్న కందువకుఁ బాఱందొడంగె; నప్పుడు రాధేయుం డజేయుండై కులశైలంబునుం బోలెఁ దరలక నిలిచి గంధర్వులు గురియు శరవర్షంబున మునుఁగుచుఁ దన యోపినంత పెనంగుచుండె; సోదర సౌబల సహాయుండై దుర్యోధనుండు గర్ణసాహాయ్యంబు వదలక నిలిచె; నంత ననంతసత్త్వు లైన గంధర్వు లనేకులు సుట్టుముట్టి. | 399 |
| ఉ. |
కొందఱు సూతు, నశ్వములఁ గొందఱు, కొందరు చాపదండముం గొందఱు చక్రయుగ్మకముఁ, గొందఱు విస్ఫురితాతపత్రముం గొందఱు కూబరంబు, మఱి కొందఱు కేతువుఁ, గొంద ఱక్షమున్ దందడిఁ దున్మివైచి విరథత్వ మొనర్చిరి సూతసూతికిన్. |
400 |
| వ. | ఇట్లు విరథుం డయి కర్ణుండు వికర్ణురథం బెక్కిరణభూమికిం దొలంగి చనియె; దుర్యోధనుండు విముఖుండు గాక పరబలంబు మార్కొని పెనంగం దొడంగినం గినిసి చిత్రసేనుండు వానిం దలపడి తదీయస్యందనంబు రాధేయురథంబు నట్లు భగ్నంబుగాఁ జేయించి, విరథుం డగు నమ్మహీవిభుం గేశాకర్షణంబున నేలం బడవైచి పెడకేలు గట్టి సింహనాదంబు సేసినం, దక్కిన గంధర్వులుం గనుకనిం బేర్చి యతని వనితా జనంబులను, దత్సోదరు లగు దుశ్శాసన దుర్విషహ దుర్ముఖ వివింశతి చిత్రసేన విందానువిందులను, దత్తనూభవులను, దదీయమంత్రులను బట్టి బంధించి చిత్రసేనున కొప్పించి; రంతఁ బెఱకౌరవులును బౌరులు నమాత్యులుం జెదరి యాక్రోశించుచుం బఱచి, ధర్మపుత్త్రు శరణు సొచ్చి యి ట్లనిరి. | 401 |
| మ. |
‘ఘనబాహాబలదుర్నివారమహిమన్ గంధర్వవీరుల్ సుయో ధనుఁ దత్కాంతలఁ దత్సహోదరుల బంధప్రాప్తులం జేసి కై కొని వేపోవుచు నున్న వా రదె; రిపుక్షోభంబు గావించి, నీ యనుజవ్రాతముఁ గావవే కరుణ నిండారంగ రాజోత్తమా!’ |
402 |
| వ. | అని కృతాంజలులై పలుకుచున్న వారిం జూచి భీమసేనుండు ప్రహసితాననుం డగుచు ధర్మపుత్త్రున కి ట్లనియె. | 403 |
| ఆ. |
‘మనకుఁ జులుకనయ్యె; మన చేయుపనియ గం | ధర్వవరులు గూడి తగ నొనర్చి; రింత లెస్స యగునె! యే భారమును లేక | యూరకుండ మనల నొందె జయము. |
404 |
| తే. |
పుట్టుగల్లరియై పాపములకు నెల్ల | దిట్టయై లోకములచేతఁ దిట్టు వడిన కట్టిఁడికి నిట్టి కష్టంబుగా నొనర్చి | తగ విధాతృఁడు చతురుఁ డై నెగడె నేఁడు. |
405 |
| మ. |
విపరీతస్థితి నొంది ఘోరవిపినోర్వీవాసులై నిత్యదుః ఖపరాధీనతఁ దూలి రంచు మనలన్ గర్వోద్ధతస్వాంతుఁ డై యపలాపింపఁగ వచ్చి దుర్ణయపరుం డా ధార్తరాష్ట్రుండు దో షపరీతాత్ముఁడు దత్ఫలంబు గుడిచెన్ సత్యంబు సామాత్యుఁడై. |
406 |
| వ. | వానిదెసం గృప సేయ వల’ దనిన ననుజునకు నగ్రజుం డిట్లనియె. | 407 |
| క. |
‘అకట! యిది పరుషవాక్యము | లకు సమయమె? శరణు సొచ్చి లఘుభావముతో వికలగతి నున్న కౌరవ | నికరమునకుఁ గరుణ సేయ నీకుం దగదే! |
408 |
| వ. | ఏ కాన్వయజాతు లైన వారికి నర్థనిమిత్తం బైన భేదం బొక్కొకమాటు ప్రవర్తిల్లు; నంతన చేసి సహజస్నేహంబు దప్పనేరదు; జ్ఞాతిజనంబులు దమలో నెట్టివారైన నొప్పుం గాని, యన్యులవలనం బరిభవంబు దొడరినప్పుడు దా రొం డొరులఁ జేకొన కునికి లోక నింద్యంబు; దుర్యోధనుండు దుర్వినీతుం డైనను సభార్యుం డయి పరులచేతం బట్టు వడియె; దీని నుపేక్షించిన మనకుం గులహాని యగు; నదియునుం గాక శరణాగత రక్షణంబు రాజమాత్రుం డగు వాని కెల్ల ధర్మంబు; నీయట్టి బాహుబలసంపన్నునకు నిట్టి సుకర్మంబు కర్తవ్యం బని వేఱు చెప్పనేల? లెమ్ము! నీవును తమ్ములు నిమ్ముల రథంబు లెక్కిసర్వాయుధసన్నద్ధులై చని సుయోధను చెఱ దలఁగుం’ డనినఁ బవననందనుండు ధర్మనందనున కి ట్లనియె. | 409 |
| సీ. |
‘అనుమాన మొక్కింతయును లేక యలిగి జ | లంబులఁ ద్రోచె, విషంబు వెట్టె గృహదాహ మొనరించె, విహితదురోదర | కపటుఁడై రాజ్యంబు నపహరించె, జనులెల్లఁ జూడంగ వనజాక్షిఁ బాంచాలిఁ | దలవట్టి యీడ్పించె, వలువ లొలువఁ బనిచెఁ; బుట్టినకోలె మనకు నక్కట! సుయో | ధనుఁ డెగ్గు సేయని దినము కలదె? |
|
| ఆ. |
వానిచేఁత లొకటి యేనియుఁ దలఁపవు; | నీవు మనుజనాథ! కేవలంపుఁ గరుణ పూని యుండు దరయ నెప్పుడు; నిట్టు | లైన మనకుఁ గార్యహాని గాదె?’ |
410 |
| వ. | అని పూర్వవైరస్మరణకలుషితుండై పలికిన నతనికి నజాతశత్రుండు సాంత్వనపూర్వకంబుగా ని ట్లనియె. | 411 |
| ఆ. |
‘కావరయ్య యనినఁ గరము దుర్బలుఁ డైనఁ | జెనసి యోపినంత సేయు ననిన, నూరకుండునయ్య? యుత్తమశూరుండు | దీనజనుల యున్నతెఱఁగు సూచి. |
412 |
| క. |
శరణం బని వచ్చిన భీ | కరశత్రువు నయినఁ బ్రీతిఁ గావఁగ వలయుం గరుణాపరుల తెఱం గిది; | యిరవుగ సరిగావు దీని కే ధర్మంబుల్. |
413 |
| వ. | ధృతరాష్ట్రసూనుండు భవదీయ బలశౌర్యంబులపేర్మి యెఱుంగుం గావునఁ దన్ను నవశ్యంబును విడిపింతు రని మనదెస బద్ధాశుం డై యుండు; నిది మనకుఁ బుణ్యంబును గీర్తియుం జేకొను సమయంబు; ని న్నింత నిర్బంధింప వలవ; దేన యరుగుదు; నిప్పుడు యజ్ఞదీక్షితుండ నై యున్నవాఁడఁగావున నాకుం జనరాదు; మీరు వేగఁ జని గంధర్వులం బ్రియపూర్వకంబుగా ననునయించి సుయోధను విడిపించునది; సామవచనంబులం దీరకున్నఁ బరాక్రమంబుననైనం బ్రతివీరుల నోర్చి కార్యంబు దీర్చునది; నా చేయు జన్నంబు సఫలంబు సేయుం’ డనిన భీముం డెట్టకేనియు నియ్యకొనియె; నర్జునుండును ధర్మరాజు పనుపు గైకొని కురురాజుచెఱ దలఁగఁ బ్రతిజ్ఞసేసె; నకుల సహదేవులు నుత్సాహసమేతు లయి; రన్నలువురు నాముక్త కవచులు, నాబద్ధ తూణీరులు, నాకలిత కార్ముకులు, నారూఢ రథులు నయి, యగ్రజు వీడ్కొని, యతిత్వరితగతి నడచినం గౌరవసైన్యం బంతయు వారిం గూడుకొని సింహనాదంబులు సెలంగం జనియె; ని ట్లరిగి వారలు గంధమాదనంబున కయిచనుచున్న యవ్వియచ్చరానీకంబుం గూడ ముట్టిన. | 414 |