పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
దుర్యోధనుఁడు ప్రాయోపవేశము మాని కరిపురంబునకుఁ బోవుట (సం. 3-240-40)
చ. అనవుడుఁ దత్ప్రతిజ్ఞయు సురారులవాక్యములుం దలంచి య
జ్జనపతి గాఢనిశ్చయవశంవదుఁ డై శయనంబు డిగ్గి చ
య్యనఁ ‘బయనంబు సేయుఁ’ డని యప్పు డమాత్యులఁ బంచి యిమ్ములన్‌
దినముఖకృత్యముల్‌ సలిపి దీపితుఁడై వెడలెం బ్రియంబుతోన్‌.
56
వ. అయ్యవసరంబున. 57
చ. రయవిచలత్తురంగమ తరంగములన్‌ మదనాగనక్రసం
చయములఁ జంచలచ్చటుల సైనికమత్స్యములన్‌ మహోన్నతం
బయి కురురాజచంద్రు నుదయంబునఁ దద్దయుఁ బొంగెఁ బ్రస్ఫుర
ద్భయదమనోహరప్రకటభంగులఁ దద్భటవార్ధి యుద్ధతిన్‌.
58
ఉ. చామరపుండరీకవిలసత్సితచారుపతాకలం గురు
గ్రామణియాత్ర నెంతయును గాంతి వహించె నభంబు శారదో
ద్దామమరాళమండలసితస్ఫుటపద్మవనీపరిస్ఫుర
త్తామరసాకరంబున విధంబున భూచరనేత్రపర్వమై.
59
వ. ఇట్లు దుర్యోధనుండు గర్ణసౌబలసమేతుండై దుశ్శాసనాద్యనుజ గణంబునుం దక్కిన యమాత్యులుం గొలువఁ జెలువు మిగులం జని కరిపురంబు ప్రవేశించి సముచిత వ్యాపారంబుల నుండునంత, నొక్కనాఁడు మంత్రి జన పరివేష్టితుండై యున్న రాజునకు భీష్ముం డిట్లనియె. 60
మ. ‘హితులై పెద్దలు బుద్ధిసెప్పఁగఁ గ్రియాహీనుండవై త్రోచి పో
యితి దుష్టాత్ములఁ గూడి; దానికి ఫలం బెట్లయ్యెనో చూచితే!
గతవిద్వేషుఁడు ధర్మనందనుఁడు గల్గంబట్టి యప్పాట దు
ర్గతికిం దప్పితిగాక చిక్కితిగదా గంధర్వుచే నాజిలోన్‌.
61
ఉ. నీవును దమ్ములున్‌ సతులు నెయ్యురు వైరులచే గృహీతులై
పోవఁగఁ బాఱిపోయెఁ గడుఁ బొల్లఁదనంబున సూతపుత్త్రుఁ డీ
కావరుఁ గష్టచిత్తు నధికంబుగ నమ్ముదు నీవు వీని బా
హావిభవంబు గయ్యమున నక్కడఁ జూచితె కన్నులారఁగన్‌.
62
ఉ. ఆయతబాహు లుగ్రబలు లార్యులు పార్థులు వారిభూరిశౌ
ర్యాయుధ నైపుణక్రియలయందుఁ బదాఱవపాలుఁ బోలఁ డీ
వాయపురజ్జులాఁ డధిప! వారలచందము వీని చందమున్‌
నీయెడ నిక్కమై తెలిసెనే ఖచరేంద్రుల పారిలోపలన్‌.
63
క. కులమును సిరియును జెఱుపక | యలఘుస్థితి నింకనైన నప్పాండవులం
గలసి మనవయ్య! నాదగు | పలుకు వినఁగదయ్య! హితము పథ్యము సుమ్మీ!’
64
వ. అనిన భీష్మువచనంబుల దెస ననాదరంబు సేసి, దుర్యోధనుండు గర్ణసౌబలులం జూచి నవ్వుచు, వారలుం దమ్ములుం దోడన చన నక్కడ వాసి చనియె; భీష్ముండును లజ్జితుం డై నిజగృహంబున కరిగె; నంతఁ గౌరవేశ్వరుండు గ్రమ్మఱి యెప్పటిచోటికిం జనుదెంచి మంత్రులతోడ మంతనం బుండి ‘మన కెయ్యది కర్తవ్యం? బెయ్యది సేసినఁ దేజోలాభంబు లగు?’ నని యడిగినఁ గర్ణుండు ‘దేవా! నీ కింక నే విచారమ్ములు నేల? నిష్కంటకంబైన యీ పృథివి సకలంబునుం బాలించుచు మహేంద్రమహిమతోడ నఖిలసుఖంబులు ననుభవింతుగా’ కనినం బ్రీతుండై యతండు వాని కి ట్లనియె. 65
క. ‘నీయట్టివీరవరుఁడు స | హాయుం డటె, పడయరాని యదియుం గలదే?
ధీయుత! నా కెయ్యదియును | బాయక విను మింక నొక్క పని దెల్లముగన్‌.
66
తే. ధర్మజుఁడు రాజసూయంబుఁ బేర్మిఁ జేసి | నంతనుండియు నమ్మహితాధ్వరమున
యం దభిప్రాయమై యుండు; నొంద నాకు | నమ్మఖంబు సేయింపవే యనఘ! నన్ను.’
67
వ. అనినం గర్ణుండు గౌరవపతి కి ట్లనియె. 68
క. ‘అగుఁగాక యేమి యిప్పుడు | జగతిం గల నృపతు లెల్ల జనవర! నీ కి
మ్ముగ వశవర్తుల కావునఁ | దగ నుద్యోగింపు మిపుడు తత్క్రతు విధికిన్‌.
69
ఉ. రాజులఁ బిల్వఁ బంపుము, ధరాసురసంఘము నామతింపు, పే
రోజ నుదాత్తయజ్ఞగృహయూపతతుల్‌ సమకట్టఁ బంపు, వి
భ్రాజితభక్ష్యభోజ్యవిధి భవ్యపదార్థము లానయింపు, మ
వ్యాజ విభూతిమై నమరవల్లభుచాడ్పునఁ జేయు జన్నమున్‌.
70
వ. అనిన సంతోసిల్లి కురుపతి యప్పుడు పురోహితునిం బిలిపించి, ‘రాజసూయ యజ్ఞంబు సంపూర్ణ దక్షిణంబుగాఁ జేయవలయుఁ; దత్ప్రయోగ విశేషంబులకు మీరు సాలియుండునది’ యనినం బురోహితుండు దగిన విద్వజ్జనంబులతోడ విచారించి దుర్యోధనున కి ట్లనియె. 71
చ. ‘జనవర! నీకుఁ బాండవులు శత్రులు గావున వారి నాజి నో
ర్చిన మఱి కాక మున్న యిటు సేయఁగ శక్యమె రాజసూయమున్‌?
వినుము దగంగ నిప్పటికి వేఱొక యజ్ఞము సేయు మిమ్ములం;
బనుపుము తత్క్రియావివిధభంగులకుం దగువారి వేగమై.
72
తే. రాజసూయంబు నట్టిద రాజవర్య! | వైష్ణవం బను యాగంబు; వాసుదేవుఁ
డిమ్మఖము సేసెఁ దొల్లి; యభీష్ట మిదియ; | చేయు నిర్విఘ్నముగ నిది సెల్లు నీకు’.
73
క. అనిన నిది వోలు నని య | జ్జననాథుఁడు సూతతనయసౌబలులు ప్రియం
బున ననుమతింప నభిమత | వినుతాధ్వరసంప్రయోగవిహితోద్యముఁ డై.
74
క. తనయుద్యోగము జననీ | జనకులకును ద్రోణవిదురశాంతనవ కృపా
ది నిఖిలమాన్యజనమ్ముల | కును దగ నెఱిఁగించి భరతకుంజరుఁ డెలమిన్‌.
75
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )