పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
సైంధవుఁడు ద్రౌపదిం జూచి మోహించుట (సం. 3-248-6)
ఉ. వీరుఁడు సైంధవుండు జనవిశ్రుతశౌర్యుఁడు సాల్వకన్య నిం
పారఁగఁ బెండ్లియాడుటకునై నిజవైభవ ముల్లసిల్ల వి
స్ఫార చతుర్విధోరుబలసంగతుఁడై చనుచుండి యాశ్రమ
ద్వారమునందుఁ గాంచె ద్రుపదక్షితిపాలతనూజ నచ్చటన్‌.
144
ఉ. నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగఁజేయుచుం
గ్రాలెడు వాలుఁ గ్రొమ్మెఱుఁగు కైవడిఁ దద్వనభూమి నెంతయున్‌
లాలితదేహకాంతిపటలంబునఁ జేసి వెలుంగఁజేయు న
బ్బాల వినీలకుంతలవిభాసినిఁ జూచి సవిస్మయాత్ముఁడై.
145
తే. మగువఁదగిలిన చూడ్కుల మగుడఁ దిగువ | నేర్పు సాలక యతఁడు కందర్పదర్ప
గోచరాత్ముఁ డై నిజసఖుఁ గోటికాస్యుఁ | డను నృపాత్మజుఁ జూచి యి ట్లనియెఁ బ్రీతి.
146
ఉ. ‘ఇన్నలినాక్షి యెవ్వతియొ? యివ్విపినంబున నేకతంబ యి
ట్లున్న నిమిత్త మేమియొ? సురోత్తమకన్యయొ, యక్షకాంతయో,
పన్నగభామయో, మనుజభామిని గామి నిజంబ; యిట్టి చె
ల్వున్నదియే మహీతలము నుగ్మలు లెవ్వరియందు నారయన్‌.
147
ఉ. లీల యెలర్పఁగా నబల లేఁజిగురాకును బోలె నొప్పు కెం
గేలు కదంబశాఖతుదిఁ గీల్కొనఁ జేసి వసంతవిభ్రమో
న్మీలిత బాలవల్లిక్రియ మేలగుచూడ్కుల మించి పావక
జ్వాలయ పోలెఁ జిత్తము నిజం బెరియింపఁ దొడంగెఁ జూచితే.
148
ఉ. ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి యైనఁ ద్రిలోకరాజ్యముం
జేకుఱ నేలినట్లు విలసిల్లనె! దర్పకవీరు బంటుఁగాఁ
గైకొని సర్వభోగములుఁ గాంతు; నొడంబడఁ బల్కి దీనికిన్‌
నాకును బొందొనర్చి కరుణం జరితార్థునిఁ జేయవే ననున్‌.’
149
వ. అని పనిచినం గోటికాస్యుండు గ్రక్కునం బాంచాలిపాలికిం జని ప్రణయసుభగంబుగా నమ్మగువ కి ట్లనియె. 150
సీ. ‘మృగనేత్ర! దారుణమృగసమాకుల మైన | యివ్వనాంతరమున నేకతంబ
యిట్లు నీ యున్కికి నెయ్యది మూల? మి | వ్వన దేవతవొ, సురేశ్వరునితోడ
నలిగి ధరిత్రికి నరుగుదెంచిన శచీ | లలనవో, హరియురస్స్థలి దొరంగి
కేలిఁ గ్రుమ్మరు పద్మగేహవో భవదీయ | జనకత్వమున సముజ్జ్వలితుఁ డైన
 
తే. పుణ్యుఁ డేవంశమునవాఁడు పొలఁతి! నీదు | జీవితేశ్వరుఁ డగు సుఖజీవితాత్ముఁ
డెవ్వఁ డబల! నీనామమై యింపు మిగులు | శబ్ద మెయ్యది? నాకు నిజంబు సెపుము.
151
క. కరిరాజగమన! మాతెఱఁ | గరయఁ దలఁచితేని వినవె యధికబలుఁడ నే
సురథుఁ డను రాజుపుత్త్రుఁడ | నరిమథనుఁడఁ గోటికాస్యుఁ డనఁ జనువాఁడన్‌.
152
తే. అల్ల కాంచన రథముపై నలరువాఁడు | ఘనుఁడు క్షేమంకరుండు త్రిగర్తవిభుఁడు;
మఱియు నినుఁ జూచుచున్నాఁడు మగువ! వాఁడె | దీప్తభుజఁ డైన కాళింగదేశవిభుఁడు.’
153
తే. ఉల్ల పద్మాకరము పొంతనుండి నిన్ను | మెచ్చి కనుఁగొనుచున్న యున్మీలితాక్షుఁ
డుత్పలాక్షి! యిక్ష్వాకువంశోద్భవుండు | సుబలభూపతిపుత్త్రుండు సుభగుఁ డతఁడు.
154
వ. అరుణాశ్వయుక్తంబు లయిన రథంబులయందు రత్నమయభూషణు లయి సమిద్ధవహ్నులుం బోలె వెలుంగుచున్న యా సౌవీరకుమారులు పన్నిద్దఱుం దన్నుం జేరి కొలువ ననేకసహస్రకరితురగరథపదాతి పరివృతుండై మహాగజంబుపై శోభిల్లుచున్న యవ్వీరుండు సింధుసౌవీరనాథుం డైన జయద్రథుం; డమ్మను జేశ్వరుం డిప్పుడు నీతెఱం గెఱుంగఁ దివిరి, నన్ను నిట పుత్తెంచె’ ననినఁ బాండవపత్ని మృదుసంభ్రమంబునం గదంబశాఖ విడిచి యుత్తరీయంబు సంగతంబు గావించుకొని కోటికాస్యున కి ట్లనియె. 155
తే. ‘అన్న! యిచ్చట నే నొంటి నున్నదాన; | నీ విచటి కేఁగుదెంచుట నియతి యగునె?
సుతవతిని ధర్మవతి నన్ను నితరకాంత | గాఁ దలంచి పెక్కులు వల్కఁ గాదు నీకు.
156
వ. నీవు శిబివంశోద్భవుం డయిన సురథుపుత్త్రుండ వగు టే నెఱుంగుదు; నస్మత్ప్రకారంబు సెప్పెద విను; మేను బాంచాలపతి యైన ద్రుపదుకూఁతురఁ, గృష్ణ యనుదానం; బాండునందను లగు యుధిష్ఠిరభీమార్జున నకుల సహదేవులకు ధర్మపత్ని; నవ్వీరు లిప్పుడు నన్ను నివ్వనంబున నునిచి. 157
తే. ధర్మజుఁడు దూర్పు, భీముఁడు దక్షిణంబు, | నర్జునుఁడు పడమర, గవ లర్థి నుత్త
రంబుగా వేఁట వోయిరి రాజముఖ్యు; | లనఘు లింతకు వత్తురు వినుతబలులు.
158
వ. మీ రమ్మహాత్ములకు మాననీయులరు గావున నార్యజనమిత్త్రులగు నక్కురుకులపవిత్రులు సేయు సత్కారంబులు గైకొనిపోవుదురు గాని యొక్కింతతడ వియ్యాశ్రమసమీపంబున నిలువుం’ డని పలికి యల్లన యవ్వరవర్ణిని భయంబునం బర్ణగృహంబు సొచ్చినం, గోటికాస్యుండును గ్రమ్మఱి చని, జయద్రథునితోడ నబ్భామిని పాంచాలకన్యక యనియును, బాండవపత్ని యనియునుం జెప్పిన, నద్దురాత్ముండు మదనకంపితహృదయుం డగుచు, నమ్మగువ నపహరింపం దివిరి కతిపయజనసమేతంబుగా నరిగి, సింహాగారంబు సొచ్చు వృకంబునుంబోలెఁ బాండవ నివాసంబు సొత్తెంచి, పాంచాలిం గని దాని కిట్లనియె. 159
క. ‘వామాక్షి! నీకుఁ గుశలమె? | నీమన సెవ్వారియందు నిత్యప్రేమం
బై మెఱయు నట్టి సొబగులు | నీమగ లేవురకు నిపుడు నెమ్మదియె మదిన్‌?’
160
వ. అనిన వానికి నమ్మానవతి యి ట్లనియె. 161
చ. ‘స్థిరమతు లైన పార్థులకు సేమమ, నీకు ననామయంబె భూ
వర! తగ వింద వైతి కురువర్యుల యింటికి; నట్లు గావునం
బరువడి నాసనక్రియయుఁ బాద్యముఁ గైకొను మాదరంబుతో
సరసకురంగమాంసములఁ జల్పుము భోజనకృత్య మిత్తఱిన్‌.
162
ఆ. వేఁట వోయినారు విభు లిప్డు వత్తురు | వారు వచ్చి నీకు వలయునట్టి
ప్రియము లాచరింపఁ బ్రీతుండ వై మఱి | యిష్టజనులు నీవు నేఁగు మనఘ!’
163
చ. అనవుడు సైంధవుం డనియె; ‘నంబుజలోచన! నీవు మాకుఁ జే
యు నతిథిపూజ లన్నియును నొక్కట నైనఁ గొఱంతలేక వ
చ్చినవియ; మన్మథాస్త్రముల చిక్కునఁ గాఱియ వొందె డెంద; మిం
క ననుఁ గృతార్థుఁ జేయుము దగన్‌; రథ మెక్కుము లెమ్ము నెమ్మితోన్‌.
164
మ. ధరణీరాజ్యము గోలుపోయి ఘనకాంతారస్థలీవాసులై
సరివా రెల్లను నవ్వఁ గుత్సితదశాసంప్రాప్తిమై నున్న ము
ష్కరులం బార్థులఁ గొల్చినం గలదె సౌఖ్యం? బెంతయున్‌ బేలవై
తరవిందానన! శ్రీవిహీనులఁ గరం బర్థింతురే కామినుల్‌?
165
ఆ. చిగురుబోఁడి! నిఖిలసింధుసౌవీరభూ | వలయరాజ్యగౌరవంబుతోన
నన్ను నేలికొని మనఃప్రియభోగైక | యోగ్య వగుము ; విడువు మొండుదలఁపు’.
166
వ. అనినం బాంచాలి ప్రకంపితచిత్త యగుచుఁగొండొక దొలంగి, వానిదెస ననాదరదృష్టిం జూచుచుఁ దనపతుల రాకయ కోరుచుం బ్రతివాక్యంబులఁ గొంతకాలక్షేపంబు సేయుటకై వాని కి ట్లనియె. 167
తే. ‘తలఁపఁ బాండవధార్తరాష్ట్రులకుఁ జెలియ | లైన యా దుస్సలకుఁ బతి వనఘ! నీవు;
నాకుఁ దోఁబుట్టువవు గావె? నీకుఁ జనునె | పాడి దప్పిన మాటలు వలుక నిచట?
168
క. నయమును ధర్మము గల య | న్వయమున జనియించినాఁడ; వక్కట! ధర్మ
క్రియ యెఱుఁగంగా వలదె? యు | భయలోకవిరుద్ధ మైన పథ మేమిటికిన్‌?’
169
వ. అనిన నద్దురాత్ముండు దరస్మితాననుం డగుచు ని ట్లనియె. 170
క. ‘వనజాక్షి! రాజధర్మము | వినవే యెన్నఁడును మనుజవిభులకుఁ బ్రమదా
జనులయెడ వావి వెదకం | జనదు; వలసినట్ల వేడ్క సలుపఁగఁ జెల్లున్‌.
171
క. విను మదియుఁగాక జగమున | వనితారత్నంబు లెల్లవారికి భోగం
బునయెడ సాధారణము; లొ | కనిధన మని గరుసు గలదె కరినిభగమనా!
172
వ. అనిననయ్యంగన క్రోధకలుషితాంతరంగయై ‘యిప్పాపాత్ముండు ప్రియ వచనంబులం బోవండు; బెట్టిదంబులం గాని చక్కంబడఁ’ డని తలంచి యిట్లనియె. 173
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )