| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అని పలుకుచున్న ధాత్రేయిక పలుకులు విని దాని నాశ్వాసించి, యక్కురువీరు లేవురు నాక్షణంబ సన్నద్ధులై క్రోధావేశంబునంజేసి మహోరగంబులుం బోలె రోఁజుచు జయద్రథు వెన్నడిదాడివెట్టి, కూడముట్టి, తత్సైన్యంబు పిఱుంద నాక్రోశ వచనవిహ్వలుండై పోవుచున్న ధౌమ్యుం గని నమస్కరించి, ‘మీ రింక విగతఖేదుల రై యొయ్యన రం’ డని యామిషంబునకుం గవియు డేగలుం బోలె సైంధవసేనపయిం గవిసి, సింహనాదంబులు సేసి; రప్పుడు పాండుపుత్త్రుల రథంబులు నడియాలంబులు సూచి సైంధవుండు ద్రౌపది కిట్లనియె. | 202 |
| క. |
‘ఈ వచ్చురథంబుల వా | రేవురు నీమగలె యంబుజేక్షణ! వీరిన్ భావించి యెవ్వఁ డెవ్వం | డేవిధమునవాఁడు సెపుమ! యెఱుఁగఁగ వలయున్!’ |
203 |
| వ. | అనిన నప్పాంచాలి యనాదరక్రోధఘూర్ణిత యగుచు నతని కిట్లనియె. | 204 |
| ఆ. |
‘ఇంక వీరి నెఱిఁగి తేనియు నెఱుఁగక | యుండితేనిఁ జేయ నొండు గలదె? దుర్మదమునఁ గరము దుశ్చరిత్రమునకుఁ | జొచ్చి నీకుఁ జేటుఁ దెచ్చికొంటి. |
205 |
| వ. | ‘అయినను నన్నడిగితివి గావునం జెప్పెద; నింతియ కాని నీవలని భయ మించుకంతయు నాకుఁ గలుగదు; సోదరసహితుం డైన ధర్మనందనుం గంటి; నింకఁ గుశలంబ’ యని పలికి యిట్లనియె. | 206 |
| మ. |
‘తనువృత్తాంగుఁడు శుద్ధకాంచనసముద్యద్వర్ణుఁ డభ్యుల్లస ద్వనజాతాయతచారులోచనుఁడు దీవ్యద్భూరితేజోఘనుం డనఘుం డల్ల రథంబుపై వెలుఁగు పుణ్యాత్ముండు ధర్మాత్మజుం డనిరోధప్రతిభాప్రభావనిధి యత్యాశ్చర్యశౌర్యుం డనిన్. |
207 |
| చ. |
కురుకులశేఖరుం డతఁడు ఘోరరణంబుల నెట్టి శత్రులున్ శరణని సొచ్చిరేని విలసత్కరుణామతిఁ గాచు; నీవు చె చ్చెరఁ జెడిపోక, నా పనుపు సేసి వినీతి యెలర్ప నమ్మహా పురుషుని నాశ్రయింపుము; విభుండును నీదగు తప్పు లోఁ గొనున్. |
208 |
| చ. |
ఘనజవసత్త్వ చారుతురగంబులఁ బూన్చిన యల్ల విస్ఫుర త్కనకరథంబుపై నుదితకాయుఁడు సాలమహీరుహంబు చా డ్పునఁ దనరారుచున్ వెలయు భ్రూకుటియున్ దశనోష్ఠపీడనం బును నయి యున్నవాఁ డనిలపుత్త్రుఁడు భీముఁడు; భీముఁ డాజులన్. |
209 |
| ఉ. |
ఈతని పౌరుషం బరయ నెందు నమానుషకృత్య మప్రతీ ఘాత మనేక మద్భుతము; గర్వితు లౌ ధరణీశ్వరుల్ నిజం బీతని నాజిలోఁ జెనయ నెవ్వరు నోడుదు; రిమ్మహాభుజుం డాతతరోషుఁడైన బ్రళయానలు నట్టిఁడ; యాఱఁ డేమిటన్. |
210 |
| ఉ. |
ధర్మజు కూర్మితమ్ముఁడును దత్ప్రియశిష్యుఁడు నైనవాఁడు స త్కర్ముఁడు వాఁడె చూడుము ప్రగాఢవికీర్ణి జితేంద్రియుండు దు ష్కర్ములఁ గన్న సైపఁడు నికామభయంకర విక్రమక్రియా నిర్మథితారి ఫల్గునుఁడు నిర్మలతేజుఁ డజేయుఁ డేరికిన్. |
211 |
| క. |
అవశగతిఁ గామరోషా | ది వికారము లొందినను మదిని ధర్మపథ ప్రవిహతి గానీఁ; డతఁ డా | దివిజేంద్రతనూజుఁ డద్వితీయుఁడు పేర్మిన్. |
212 |
| చ. |
అయనయసంగ్రహుండు వినయవ్యవసాయి భయార్తలోకసం శ్రయుఁడు గృతాస్త్రుఁ డాహవవిశారదశౌర్యుఁడు శిష్టబాంధవ ప్రియుఁ డసమానసుందరగభీరశుభాకృతి యల్ల పుణ్యుఁ డా రయ నకులుండు పాండుసుతరత్నము భాసురకీర్తి యిమ్మహిన్. |
213 |
| ఉ. |
వీరుఁడు చిత్రయోధి దృఢవేధి కృతాస్త్రుఁడు భూరిబుద్ధి వి స్ఫారుఁడు వాగ్విశారదుఁడు పార్థులకూరిమితమ్ముఁ డుజ్జ్వలా కారుఁడు ధర్మదక్షుఁ డవికారుఁడు ప్రౌఢపతంగతేజుఁ డ ద్ధీరుఁడు పాండవుండు సహదేవుఁడు దేవనిభుండు పెంపునన్. |
214 |
| తే. |
కొడుకులం దెల్లఁ గడుఁగూర్చు గొంతి యితని; | కిమ్మహాత్ముఁడు మహి చలియించె నేని నగ్ని చల్లన యయ్యె నే నాత్మఁ దాను | ధర్మనిష్ఠుఁ డై సత్యంబు దప్పఁ డెపుడు. |
215 |
| వ. | వీ రేవురు నత్యంతదుర్వారులు; వీరి బారిం బడిన వారాశినడుమ నుగ్రమకరాహతంబై యవియు పేరోడయుం బోలె నీసైన్యంబు వికలం బగు; నీవునుం బ్రాణం బొండె మానం బొండెఁ గోల్పోక మెయిమెయిం బో నేర్చెదవే?’ యనియె; నప్పుడు కౌంతేయులు సైంధవసేనం దలపడి దిఙ్ముఖంబున నెల్లం జీఁకట్లు గవియునట్లుగా బాణపటలంబులు వఱఁగింపం దొడంగిన. | 216 |
| క. |
‘తొలఁగకుఁడు పొదువుఁ డేయుఁడు | నిలువుఁడు వడిఁ బొడువుఁ’ డనుచు నిజయోధులఁ దాఁ గలయఁ బురికొల్పి సైంధవుఁ | డలఘు పరాక్రముఁడు నిలిచె నాహవభూమిన్. |
217 |
| వ. | ఇట్లు, త్రిగర్తశిబిసింధుసైన్యంబులతో ననేకనరపతిపరివృతుండై నిలిచిన జయద్రథుం జూచి, భీమసేనుండు క్రోధారుణలోచనుం డై, రథంబు డిగ్గి హేమబంధ బంధురంబును నయోమయంబును నగు గదాదండంబు ద్రిప్పుచు వానిపయిం గవిసిన నడ్డపడి కోటికాస్యుండు నిజసైన్యసంఘంబుతో నమ్మహావీరుం బొదువుటయు నతండు. | 218 |
| క. |
మదగజముల రథయోధులఁ | బదాతులను దురగములను బలువిడిఁ గలయం జదుపుచు దుర్వారగతిన్ | విదితబలుఁడు ఘనగదాప్రవీణత మెఱసెన్. |
219 |
| వ. | ఇట్లు విహరించి యహితసైన్యంబు నిహతం బగుటయుఁ జెలంగి సింహనాదంబు సేసి, యతండు సారథి సముపనీతం బైన రథంబు సాదరంబుగా నెక్కి గృహీతశరాసనుండై విక్రమించె; మఱియును. | 220 |
| క. |
అలిగి యుధిష్ఠిరుఁడును న | గ్గలికం బ్రతివీరు లడరఁ గార్ముక విద్యా విలసనము మిగుల సౌవీ | రుల నూర్వుర రథికవరుల రూ పడఁగించెన్. |
221 |
| క. |
నకులుఁడు నిశాతసాయక | నికరంబుల సమర ధారుణీతల మెల్లం బ్రకట పరవీరవరమ | స్తక బంధురముగ నొనర్చె దారుణభంగిన్. |
222 |
| క. |
నారాచపాతముల దు | ర్వారుఁడు సహదేవుఁ డాహవ ముఖంబున న శ్వారోహకులం గూల్చుచు | వీరవిహారంబు సలిపె వేడ్క యెలర్పన్. |
223 |
| ఆ. |
సింధురాజసైన్య సింధుపూరమునందు | మహిత ఫల్గునాఖ్య మంథనగము దిరిగి కలఁపఁదొడఁగెఁ బరనృపాలక మహా | జలచరవ్రజంబు సంచలింప. |
224 |
| సీ. |
వారణకోటి దదారోహకులతోన | వివశమై యొఱలుచు నవనిఁ ద్రెళ్లె: సూతహయధ్వజపాతపూర్వకముగ | రథములు దుమురయ్యె రథులతోన; వెస రావుతులతోన వసమఱి హయములు | గెడసి యెల్లెడలను బుడమిఁ గప్పె; దందడిఁ దెరలుచు సందడి పెల్లుగాఁ | గాలుబలంబులు గూలెఁ గలయఁ |
|
| ఆ. |
దుముల మధిక మయ్యె సమరతలంబున | ఘోరరుధిరవారిపూర మెసఁగె; జితవిరోధిబలుఁడు శతమఖసూనుండు | చాపనైపుణంబు సూపునపుడు. |
225 |
| తే. |
సవ్యకరమునందును నపసవ్యకరము | నందుఁ బర్యాయ సంగత మగుచుఁ జూడఁ గొఱవి ద్రిప్పిన యొప్పున మెఱసెఁ బార్థు | గాండివము వాలుఁదూపులగని యనంగ. |
226 |
| వ. | అట్టియెడం ద్రిగర్తపతి యైన సుధన్వుండు గదాహస్తుండై రథంబు డిగ్గి చని ధర్మతనయు రథ్యంబులఁ గూలనేసిన, నతండు నిశితసాయకంబున వానియురంబు వ్రచ్చి విగతజీవుం గావించి, సత్వరంబుగాఁ జని సహదేవు నరదం బెక్కె; మఱియును ద్రిగర్తులలోన మహాముఖ క్షేమంకరు లనువారు నకులుం బొదివి ఘనశరాసారంబు గురిసి జలధరంబులుం బోలె గర్జిల్లిన, నమ్మాద్రీసూనుండు వారి నిద్దఱఁ బెక్కమ్ముల నొప్పించె; నంతఁ దదీయాగ్రజుం డగు సురథుండు. | 227 |
| చ. |
కరినికరంబుతోఁ దొడరి గర్వితుఁడై తనవారణేంద్రు న క్కురుకులవీరుమీఁద నెసఁగొల్పినఁ దద్రథఘోటకంబులం బరుషతఁ జంపు నగ్గజము వాయక వాఁ డసిచర్మహస్తుఁడై ధరణికి దాఁటుచో నది మదంబున వెండియుఁ బైఁ గడంగినన్. |
228 |
| చ. |
తొలఁగక యమ్మహాబలుఁడు దోర్బల మొప్పఁ గృపాణపాతభం గులఁ గరినాథు కేలు నిరుగొమ్ములతో బెరయంగఁ ద్రుంప బె ట్టిలకు విచేష్టమై నొఱగు నేనుఁగుపై నతిమాత్రభీతి వి హ్వలుఁ డగు శత్రు నుద్ధతిఁ గృతాంత విధేయునిఁ జేసె వ్రేల్మిడిన్. |
229 |
| క. |
వైరులు దలఁకఁగ నిమ్మై | దారుణపౌరుషవిశేషదక్షుం డై య వ్వీరుఁడు రయమున నరిగి స | మీరతనయునరద మెక్కి మెఱసెం బోరన్. |
230 |
| చ. |
ఘనుఁడు వృకోదరుండు దనుఁ గట్టలుకం దలపడ్డ కోటికా స్యుని తురగంబులం దునిమి సూతునికంఠముఁ ద్రుంచి వైచి తీ వ్రనిశిత మైన ప్రాసమున వాని యురంబు వగిల్చి చంపినం గనుకనిఁ బాఱె భీతి యెసఁగంగఁ దదీయ చమూసమూహముల్. |
231 |