పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
ధర్మజునకు మార్కండేయుఁడు రామాయణకథ సెప్పుట (సం. 3-258-4)
వ. అనిన విని ధర్మజుండు ‘మునీంద్రా! రాముఁ డెవ్వనివంశంబున వాఁడు? రావణుం డెవ్వని తనయుం? డేమి నిమిత్తంబున సీతాపహరణంబు సేసె? రామరావణులకు సంగ్రామం బెట్లు వర్తిల్లెం? జెప్పవే!’ యని రామాయణ కథాశ్రవణకుతూహలియై యడిగిన నమ్మహాముని యి ట్లనియె. 267
క. ‘విను మిక్ష్వాకుకులంబున | జనియించె నజుండు నాఁ బ్రశస్తచరితుఁ డా
తని కొడుకు దశరథుఁడు; ముద | మున నాతఁడు పెండ్లియయ్యె మువ్వురు సతులన్‌.
268
వ. అందుఁ గౌసల్య కురాముండును, గైకేయికి భరతుండును, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులును జనియించి; రందు రామునకు విదేహరాజనందన యైన సీత ప్రియాంగన యయ్యె; నిఁక రావణుజన్మంబు సెప్పెద వినుము. 269
ఆ. అఖిలలోకకర్త యగు విరించికిఁ బుల | స్త్యుండు నాఁగ మానసుఁడు దనూజుఁ
డుద్భవించె; నతని కుదయించె వైశ్రవ | ణాభిధానుఁడైన యాత్మజుండు.
270
వ. ఆ వైశ్రవణుండు దన తండ్రి యగు పులస్త్యుని విడిచి, తాత యగు చతుర్ముఖునకుం దపంబు సేసి నలకూబరుం డను కొడుకును లోకపాలకత్వంబును ధనేశ్వరత్వంబును లంక యను పురంబును శంకరుతోడి సఖ్యంబును వరంబులుగాఁ బడసి, మహావిభూతితో వర్తిల్లుచున్నంగని, యలిగి, పులస్త్యుండు నిజశరీరంబునం దర్ధంబున విశ్రవసుం డను వాని సృజియించి, యా వైశ్రవణున కహితంబు సేయు మని పనిచిన నెఱింగి, కిన్నరేశ్వరుండు విశ్రవసుపాలి కరుదెంచి ‘మహాత్మా! యేను నీకుం బుత్త్రుండ నయ్యెద; నాకుం గరుణింపు’ మని యతనిం బ్రసన్నునిం జేసి నృత్తగీతవిద్యావిశారద లయిన రాక్షసస్త్రీలం బుష్పోత్కటయు, మాలినియు, బకయు నను వారి మువ్వుర నవ్వి ప్రవరునకుఁ బరిచారికలంగా నిచ్చిన. 271
క. పురుడున నయ్యువతులు నొం | డొరులం గడవంగ విలసదుపచారసమా
చరణప్రవీణభంగులఁ | బరితోషితుఁ జేసి రా తపస్వివరేణ్యున్‌.
272
వ. ఇట్లు ప్రీతుండై యతండు వారలకుఁ బుత్త్రదానంబు సేసిన నందుఁ బుష్పోత్కటకు రావణ కుంభకర్ణులును, మాలినికి విభీషణుండును, బకకు ఖరుండును శూర్పణఖ యను కన్యకయు మిథునంబై ప్రభవించి; రక్కుమారులకు నలువురకుఁ దజ్జనకుండు జాతకర్మాదిసంస్కారంబు లొనరించి సగౌరవంబుగాఁ బెనిచి యుపనీతులం జేసె; నందు. 273
ఉ. ఆతతతేజుఁ డున్నతభుజాగ్రుఁడు లోకభయంకరుండు వి
ఖ్యాతపరాక్రముండు దశకంఠుఁడు సంతతరోషమానసుం;
డాతనియట్ల దుర్మదమయాత్ముఁడు క్రూరుఁడు గుంభకర్ణుఁడున్‌;
భీతివిదూరుఁ డార్యుఁడు విభీషణుఁ డుత్తమచిత్తుఁ డారయన్‌.
274
క. ఖరుఁడు ఖరతేజుఁ డవనీ | సుర పరిభవకారి మాంసశోణితభుజుఁ డు
ద్ధురచిత్తుఁడు శూర్పణఖయు | దురితచరిత ధర్మకర్మదూషిత యెపుడున్‌.
275
వ. ఆ రాక్షసకుమారులు దండ్రివలన నఖిలవేదవేదాంగ ధనుర్వేదపారగులై గంధమాదన గిరియందు సుఖం బుండి యొక్కనాఁ డతనికి మ్రొక్కవచ్చువాని నధికవిభవసమన్వితు వైశ్రవణుం జూచి తత్ప్రభావంబు తపోలబ్ధం బగుట విని జాతమత్సరు లయి తారును బితామహు నుద్దేశించి తపంబు సేయం దొడంగిరి; తత్ప్రకారంబు వినుము. 276
తే. మండు వేసవిఁబంచాగ్ని మధ్యమున, ఘ | నాగమంబున బయల, నత్యంత తుహిన
సమయమున నీరియందు, నిశ్చలత నిలిచి | దశముఖుఁడు వాయుభక్షుఁ డై తప మొనర్చె.
277
మ. నియతాహారుఁడు నిర్జితేంద్రియుఁడు నై నిష్కంపవృత్తిన్‌ మహీ
శయనుండై వ్రతముల్‌ చరించె నధికేచ్ఛం గుంభకర్ణుండు ధై
ర్యయుతుండై; ఘనుఁ డవ్విభీషణుఁడు పర్ణాహారవృత్తిన్‌ జపా
ధ్యయనాసక్తిఁ దపంబు సేసె మది నత్యంతంబు సంశుద్ధితోన్‌.
278
వ. ఖరుండును శూర్పణఖయు వారికిం దగిన పరిచర్యలు సేయుచుండి; రంత సహస్రవర్షంబులు నిండినం బంక్తివదనుండు దనమస్తకం బొక్కటి ఖండించి మండెడు నగ్నియందు వేల్చి మఱియు వేయేండ్ల కొక్కటిగాఁ దలలు తొమ్మిదియుం దఱిగి వేల్చిధైర్యంబు దఱుఁగక పదియగు తలయును ద్రెంప సమకట్టినఁ బితామహుండు ప్రత్యక్షంబై వారించి, వాని శిరంబు లెప్పటి యట్ల కలుగ నొసంగి ‘యమరత్వంబు దక్కనొండు నీ కభిమతం బగునది యెయ్యది యైనను నడుగు’ మనుటయు నన్నిశాచరుండు. 279
శా. ‘దేవా! యేను సమస్త దేవ పితృదైతే యాహి గంధర్వ ర
క్షో విద్యాధర యక్షజాతులకు నక్షోభ్యుండఁగాఁ బ్రీతితో
నీ విశ్వంబునఁ గామరూపగతి నాత్మేచ్ఛావిహారుండఁగా
నీవే’ నావుడు వాని కవ్వర మజుం డిచ్చెం గృపాలోలతన్‌.
280
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )