పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
దశరథుఁడు రామవిశ్లేషముచే సురలోకగతుం డగుట (సం. 3-261-29)
క. రాముఁడు సనుట విని మహో | ద్దామం బగు శోకవహ్ని దరికొనఁగను హా
రామ! గుణధామ! యని యని | భూమీశ్వరుఁ డసువియోగముం బ్రాపించెన్‌.
305
వ. ఇట్లు దశరథుండు సురలోకగతుం డగుటయుఁ, గైకేయి దనకొడుకు రావించి ‘భూవల్లభుండు దేవభావంబు నొందె, రాముండును వనంబున కరిగె, నింక నర్హుండవు నీవ కావున నఖిలమహీరాజ్య రక్షణంబు సేయు’ మనిన నక్కుమారుండు క్రోధశోకదందహ్యమానమానసుం డగుచుఁ దల్లి కి ట్లనియె. 306
సీ. ‘దురితంబు లెన్నండుఁ బొరయక వెలుఁగొందు | కమలాప్తకులమునఁ గసటు గలిపి,
పరమధర్మాత్మకుఁ బురుహూతసన్నిభుఁ | బతి మ్రింగికొని, కృపఁ బాఱవైచి
యాయతబాహుఁ దేజోయుక్తు మాయన్నఁ | బటుధైర్యు నడవులపాలు వఱిచి,
జీవితహంత్రివై త్రోవంగరాని దు | ష్కీర్తి నా యౌదలఁ గీలుకొల్పి,
 
ఆ. శ్రీకి నెడలి సకలలోకంబుచేతను | దిట్టు గుడిచి కోర్కి దీర్చుకొంటి
పాపజాతురాల! యీ పాతకం బేమి | సేయ? దింక నేమి సేయువాఁడ?’
307
వ. అని దుఃఖించి, భరతుండు దండ్రికి నుచితక్రియలు నిర్వర్తించి, యనంతరంబ సమస్త మంత్రి సామంత భూసుర పౌర జానపద సహితుండై కదలి, మువ్వురు దల్లులను వసిష్ఠ వామదేవులనుం బురస్కరించుకొని తానును శత్రుఘ్నుండును రామానునయార్థంబు చిత్రకూటశైలంబున కరిగి యందు. 308
మ. కనియెం గోమలనీలమేఘసుభగాకారున్‌, జటావల్కలా
జినధారున్‌, సితభూతిభూషితుని, రాజీవాక్షుఁ, గల్యాణ కీ
ర్తనుఁ, గాకుత్‌స్థకులప్రదీపకుని, సీతాలక్ష్మణోపేతు, స
న్మునిలోకార్చితు, సత్కృపాభరణు, రామున్‌, రాజచూడామణిన్‌.
309
వ. కని యంతంత నాక్రందన పరుం డగుచుం జని తదీయచరణంబులపయిం బడి పితృమరణప్రకారం బంతయు నెఱింగించి, ‘దేవా! సకలసామ్రాజ్యధురీణుండ వై మమ్మందఱ ననుశాసింపవే!’ యని యర్హజన సహితంబుగా నతనిం బ్రార్థించిన. 310
క. గురువాక్యరక్షణైకా | దరచిత్తుం డైన యయ్యుదాత్తచరితుఁ డె
ప్పరుసున నొడఁబడఁ డయ్యెను | సరసమహీరాజ్యసమనుశాసనమునకున్‌.
311
వ. భరతుండును రాముచేతఁ బ్రత్యాఖ్యాతుండై తదీయపాదుకంబులు గొని చని, వాని నర్చించుచు నంది గ్రామంబునందు వసియించి రాజ్యానుసంధానంబు సేయుచుండె; నిట రాఘవుం డయోధ్యాపుర సమీపం బగుటం జేసి క్రమ్మఱ భరతాగమనంబు శంకించి, చిత్రకూటంబు వాసి శరభంగుపాలికిం జని, యతని చేత సత్కృతుండై దండకారణ్యంబు సొచ్చి, యందు గోదావరీతీరంబున ననుజవధూసహితంబుగాఁగృత నివాసుండై యున్నంత; దశగ్రీవుచెలియలు శూర్పణఖ సనుదెంచి, వారికి నపకారంబు సేయ మొనసినం గినిసి, యా రాజపుత్త్రులు దత్కర్ణనాసికావైకృతం బొనరించినం బదంపడి. 312
ఉ. శూర్పణఖానిమిత్తమున శూరు లనేకులు రక్కసుల్‌ మహో
త్సర్పితరోషులై బహుళ సైన్యయుతంబుగ నెత్తి వచ్చుడున్‌
దర్పితవైరిభంజనుఁ డుదారుఁడు రాఘవుఁ డస్త్రవిద్య నే
ర్పేర్పడఁ గేలిఁ బోలె సమయించె రణాంగణభూమి నందఱన్‌.
313
వ. ఇట్లు ఖరదూషణాదులం గొట్టి పదునాలుగువేలరాక్షసులం జంపి దండకారణ్యంబు విగతకంటకంబు గావించె; నంత శూర్పణఖయు రయంబున రావణుపాలికిం జని తచ్చరణంబులపయిం బడి యేడ్చినం, జెలియలి కైన వైకృతం బేర్పడం జూచి యన్నిశాచరనాథుం డి ట్లనియె. 314
సీ. ‘ఎఱిఁగి యెఱింగి నేఁ డెవ్వాఁడు నిశిత వి | స్ఫారశూలాగ్రంబుపయికి నుఱికెఁ?
దలయంపియం దగ్గి దరికొల్పి యెవ్వండు | నేఁడు నెమ్మది శయనింపఁ జూచె?
నుగ్రవిషానలం బుమియుచున్న యహీంద్రుఁ | గడఁగి నేఁ డెవ్వండు గాలఁ దన్నె?
హుంకారఘోరమై యుదరు బెబ్బులి మీస | లుఱక యెవ్వాఁడు నేఁ డూఁచికొనియె?
 
ఆ. నిన్ను నెవ్వఁ డకట! నేఁ డిట్లు గడు భంగ | పఱిచెఁ జెపుమ నాకుఁ బద్మనయన!
యాయువును సిరియును నవశంబు లయ్యె నేఁ | డెవ్వనికొ తలంప నిజ్జగమున.’
315
క. అని పలుకునప్పు డాతని | ఘనతరముఖనేత్రనాసికాకర్ణములం
దనవరతరోషపావక | జనితశిఖావితతు లక్కజంబుగ వెడలెన్‌.
316
వ. శూర్పణఖయు నతనికి రాఘవు లున్న తెఱంగును, నిజపరిభవంబు దత్కృతం బగుటయు, ఖరదూషణాది రాక్షసవధయునుం జెప్పిన విని, ధనదానుజుం డాక్షణంబ పురసంరక్షణంబునం దాప్తజనంబుల నియోగించి, సన్నద్ధుండై యొక్కరుండ వెలువడి త్రికూటకాలపర్వతంబులు గడచి సముద్రతీరంబునఁ బరమేశ్వరనివాసం బైన గోకర్ణస్థానంబునకుం జని, యచ్చటం దొల్లి రామువలనం బ్రాప్తపరాభవుండై ప్రవ్రజనంబు నొంది తపంబు సేయుచున్నవానిం దనపూర్వామాత్యు మారీచుం గనిన, నతండును బ్రియసంభ్రమంబులతోడ నతనిం బూజించి కుశలం బడిగి, ‘భవదాగమన నిమిత్తం బేమి?’ యని యడిగిన నసురేశ్వరుం డి ట్లనియె. 317
ఉత్సాహము ‘వినవె రాముఁ డనఁగ నొకఁడు విపులదర్పహృదయుఁ డై
మన ఖరుండు లోనుగా సమగ్రశౌర్యు లైన య
ద్దనుజవరులఁ దునిమి, యిపుడు దండకస్థలంబునం
దొనర నిర్భయత్వ మొప్ప నున్నవాఁడు మేటి యై.
318
ఆ. వానిఁ బరిభవింపవలయు నప్పనికి సా | హాయ్యకం బొనర్పు మనఘ! నాకు’
ననిన నధికభయసమావిష్టహృదయుఁడై | యమరవైరి కిట్టు లనియె నతఁడు.
319
చ. ‘ఎఱుఁగవు గాక రాఘవు నుదీర్ణభుజాబలరూఢి నాజిలో
నుఱక తదీయబాణరయ మోర్వ వశంబె పినాకికైన? ను
క్కఱ మఱి నీకు నిత్తెఱఁగు గాదన కే ఖలుఁ డొక్కొ బుద్ధిగాఁ
గఱపినవాఁడు సేటునకుఁ గాలము సేరెనొ గాక యిమ్మెయిన్‌.
320
ఆ. రాముతోడఁ దొల్లి రణమునఁ గడు భంగ | మొంది కాదె దైన్యయుక్తి నిట్లు
దపసి నైతి; నేఁడు తగ దమ్మహాత్ముని | యందు వైరబుద్ధి యధిప! నీకు.’
321
వ. అనినం గలుషించి లంకేశ్వరుండు వానిం జూచి ‘నా పనుపు సేయ వైతివేని నిన్నిప్పుడ కృతాంతగోచరుం జేయుదు’ ననిన, వాఁడును దనమనంబున ‘వీనిచేతం జచ్చుటకంటెను రాఘవకృతం బైన మరణంబు మే’ లని తలపోసి, ‘మహాత్మా! నీకు హితంబుఁగోరి చెప్పితి; నిది యిష్టంబు గాదేని భవదీయశాసనంబు గైకొని చేసెదం; బనుపు’ మనినఁ బౌలస్త్యుం డిట్లను; ‘నీవు రత్నమయతనూరుహం బగు కనకమృగంబ వై చని, జానకిం బ్రలోభింపవలయు; సీతాచోదితుండై రాముండు నిన్నుం బట్ట సమకట్టి నీ చేత నతిదూరంబు గొనిపోవంబడు; నప్పు డేను దద్భామిని నపహరించెదఁ; బ్రియావిరహదుర్మనస్కుండై యతండు చెడిపోవు’ ననిన ‘నట్ల కాక’ యని మారీచుండు. 322
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )