పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
హనుమంతుఁడు రామునితో సీతం జూచిన వృత్తాంతంబు సెప్పుట (సం. 3-266-38)
తే. అవధరింపుము దేవ! మే మందఱము న | నేకముఖమునఁ దొలి తొలి యిందు నందు
నరయుచును బోయి యొక్కెడ నతివిశాల | మైన భూవివరముఁ గంటి మద్భుతముగ.
14
వ. కని దానిం బ్రవేశించి, నిరంతరతిమిరసంవృతంబును, బహుకీటసంకులంబును నైన మార్గంబున ననేకయోజనంబులు సనునెడ ముందట నర్కప్రకాశం బైన పురంబు గానంబడియె; నందొక్కతాపసాంగన యుండి మమ్ము నాదరించి, తనపేరు ప్రభావతి యనియును, నప్పురంబు మయునిపురం బనియునుం జెప్పి, మధురంబు లయిన భక్ష్యభోజ్యంబు లొసంగినం దృప్తులమై తదుపదిష్టమార్గంబున మహీవివరంబు నిర్గమించి సహ్యదర్దురశైలంబులు గడచి మలయశైలశిఖరం బెక్కి. 15
స్రగ్ధర లీలం గల్లోలమాలోల్లిఖితగగనమై, లీననానాకుళీర
వ్యాలోగ్రగాహమీనావళుల నెసఁగి, దుర్వారవారోఘగంభీ
రాలంఘ్యప్రౌఢవేగం బగుచు బహుతరాయామవిస్తారమై బి
ట్టాలోకింపంగ నుగ్రం బగు జలనిధి నంతంతటం గంటి మంతన్‌.
16
క. కని, యిది రత్నాకర; మి | వ్వననిధిసీమమునఁ గల్గు వసుమతిలోనన్‌
జనకసుత వెదకి కానమ; | చన దివ్వారాశి దాఁటి చన నెవ్వరికిన్‌.
17
ఉ. ‘భూమితనూజఁ గాన మని పోయి రఘూద్వహుతోడఁ జెప్పి, య
బ్భూమిపుచిత్త మాతురతఁ బొందఁగఁ జేయుటకంటెఁ, జూడఁగా
నీమెయిఁ జావు మేలు; మన కేల విచారము లింక?’నంచు నం
దేము గడంగి యందఱము నేకతమం బగు నిశ్చయంబుతోన్‌.
18
వ. అనశనవ్రతంబు సంకల్పించి నియతచిత్తుల మై యుండి ‘రాఘవుకార్యార్థంబై తెగిన జటాయువు గృతార్థుం డయ్యె; మనము నట్టి పుణ్యలోకంబు వడయుద’ మని పలుకుచున్నయెడ. 19
క. గిరిశృంగతుంగవిగ్రహుఁ | డురుతరసత్త్వుఁడు విహంగమోత్తముఁ డం దొ
క్కరుఁ డొయ్యన మా యున్నెడ | కరుదుగఁ జనుదెంచి విగళితాశ్రుం డగుచున్‌.
20
సీ. ‘అయ్యలార! జటాయు వని పల్కెదరు మీర | లెవ్వరు? సెప్పరే! యేను వాని
కగ్రజుండ; ననూరునాత్మజన్ముల మేము; | సంపాతి నాపేరు; సమ్మదమున
నేనును దమ్ముఁడు నినమండలమునకుఁ | జనువేడ్క నొకనాఁడు చదల నెగసి
చనఁ జనఁ దీవ్రాంశుసంతాపమునఁ జేసి | కమరె నా ఱెక్కలు; గమర వయ్యె
 
తే. ననుజుపక్షమ్ము; లే నిమ్మహాచలమున | నాఁటఁగోలె నెచ్చటికిఁ జనంగ నేర
కున్నవాఁడ; నాతమ్ముఁ డెట్లున్నవాఁడొ? | యెఱుఁగ నెఱిఁగింపరే నాకు నిష్ట మెసఁగ.’
21
వ. అనిన నే మతనికి భవదీయవృత్తాంతంబును, రావణుండు దేవిం గొనిపోవుటయుఁ, దదర్థంబై రావణునితో జటాయువు సమరంబు సేసి యీల్గుటయుఁ జెప్పిన విని దుఃఖితుండై సంపాతి యస్మదీయ ప్రవర్తనం బేర్పడ నడిగి మా కిట్లనియె. 22
ఉ. ‘రావణు నే నెఱుంగుదుఁ; బరాక్రమదుస్సహుఁ డన్నిశాచరుం;
డీవనరాశిమధ్యమున నిచ్చటికిన్‌ శతయోజనంబులన్‌
భూవిదితంబు లంక యను ప్రోలు తదీయనివాస; మచ్చటన్‌
భూవరుదేవిఁ గాన నగుఁ బొం; డరయుండు కృతప్రయత్నులై.’
23
క. అని యతఁడు సనిన నందఱ | మును సాగరతరణకార్యమునకు నుపాయం
బొనరఁ దలపోయునెడ నే | నని యుత్సాహంబు సేయఁ డయ్యె నొకండున్‌.
24
మ. జననాథోత్తమ! యేను బూని భవదాజ్ఞాలీల చెల్వంబు మ
జ్జనకుం డైన సమీరదేవుకృపయున్‌ సత్త్వోన్నతుం జేయఁగా
ఘనవాస్తుంగతరంగసంగతమహాగ్రాహోరగాత్యుగ్రద
ర్శనమై పేర్చు పయోధి దాఁటితి జనాశ్చర్యైకసంపాదినై.
25
ఉ. ఆ లవణాబ్ధిమధ్యమునయందుఁ ద్రికూటనగంబుమీఁద ను
త్తాలవిశాలహేమమణిధామసముజ్జ్వల మైన లంక యన్‌
ప్రో లొగిఁ గంటి; నెంతయు నపూర్వము దద్విభవంబు; దేవ! య
చ్చో లలితాంగి నారయుచుఁ జొచ్చి యనేకవిధంబులం దగన్‌.
26
వ. అరసి యొక్కెడ రావణాంతఃపురం బైన యశోకవనంబునందు. 27
సీ. కన్నీరు జడిగొని క్రమ్మఁ బ్రాఁ కెక్కిన | కమ్రకపోలభాగములు గలిగి
యవశమై యొఱఁగిన యంగవల్లిక పొంత | నున్న భూమీరుహం బూఁత గాఁగ
వెడలు నిట్టూర్పులవేఁడిమిఁ బగిలిన | యధరపల్లవము గారాకుఁ బోలఁ
దలఁపులసందడి దందడించిన తాల్మి | గదిరి శిరఃకంపగతుల బెరయ
 
ఆ. నున్న పుణ్యమూర్తి నుత్తమసౌందర్య | నవనతాస్య నార్త యైన దానిఁ
గని విదేహతనయఁ గా నెఱింగితి నేను | హా! రఘుప్రవీర! యనుచు నడల.
28
క. వినయమున దేవిఁ జేరం | జని యభివాదనము సేసి ‘జానకి రఘునం
దనుదూత నేను మారుత | తనయుఁడ వానరుఁడ నిన్నుఁ దడవ నిచటికిన్‌.
29
వ. అరుగుదెంచితి; రామలక్ష్మణు లత్యంతకుశలంబున నున్నవారు; వానరేశ్వరుం డయిన సుగ్రీవుండు వారితో సఖ్యంబు సేసి, తత్కార్యంబు దీర్పం బూనె; నింక మసలక నీహృదయేశ్వరుండు సనుదెంచు; నూఱడిల్లుము. 30
క. ‘రక్కసుఁడఁ గాను జుమ్మీ! | నిక్కము వానరుఁడ నేను; నీమదిలోనం
దక్కు మనుమాన’ మనవుఁడు | నొక్కింత దలంచికొని సముత్సుక యగుచున్‌.
31
వ. అద్దేవి నా కిట్లనియె; ‘నన్నా! ని న్నెఱింగితి; నది యెట్లనిన రామహితాన్వేషి యగువాఁ డవింధ్యుం డను వృద్ధరాక్షసుండు మున్న యింతయుం ద్రిజటచేత నా కెఱింగించె; నతని పలుకులు దప్పవు; రాఘవుండు సుగ్రీవసహాయుం డయి యునికి గలిగెం గావున నింకఁ దడయక యవ్వీరవరుం దోడ్కొని వచ్చి నాకుం బ్రియంబు సేయుము; నీకుఁ గార్యసిద్ధి యయ్యెడు; మరుగు’ మని తనశిరోభూషణం బయిన యీ రత్నంబు మీకు నభిజ్ఞానార్థంబుగా నాచేతి కిచ్చి, మఱియుఁ జిత్రకూటచరితం బైన కృతకవాయసకథయునుం జెప్పి వీడ్కొల్పిన, నేను లంకాపురదాహంబుసేసి, యిట దేవర కింతయు విన్నవింపవచ్చితి’ నని చెప్పి హనుమంతుండు జానకి హృదయంబు మూర్తిమంతం బైన పగిది నున్న యమ్మహామణి రాజచూడామణికి సమర్పించిన. 32
ఆ. అమ్మనోజ్ఞరత్న మక్కునఁ గదియించి | పులక లెగయఁ గొంతప్రొద్దు విభుఁడు
జానకీకుచాగ్రసంగమసుప్తుఁ డై | నట్ల యుండె ముకుళితాక్షుఁ డగుచు.
33
వ. ఇట్లు రాఘవుండు సీతావృత్తాంతంబు విని తత్సమాగమకుతూహలవ్యగ్రుండై, సుగ్రీవుం జూచి ‘దండయాత్ర కాయితంబు సేయు’ మనినఁ ‘బ్రసాదం’ బని యతండు నలుదిక్కులం గల వానరనాయకులం బిలువం బంచిన. 34
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )