పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
కుంభకర్ణుండు యుద్ధము సేయుట (సం. 3-271-1)
లయగ్రాహి దారుణదవానల శిఖారుణ శిరోరుహు, గ | భీరఘనకర్బురశరీరుఁ, బటురోష
క్రూరనయనాంతగళితోరుతరవహ్నికణ | ఘోరముఖు, దంతవలయారభసదంశో
ద్గారి రుధిరాధరు, నుదారభుజసారణ వి | దూరితదిగంతుఁ, బదభారవినమద్భూ
భారుఁ, ద్రిజగద్విజయభూరిబలు, నద్దనుజ | వీరుఁ గని రచ్చెరువు గూరఁ గపివీరుల్‌.
97
క. రక్కసుఁడును దనమదిలో | నక్కపివీరులను జీరికైనఁ గొనక పే
రుక్కున రఘుకులవీరుల | దిక్కునకుం గవియుదెంచెఁ దీవ్రస్ఫురణన్‌.
98
మ. వడి నడ్డం బరికట్టె నెట్టన హరివ్రాతంబు పెన్‌మ్రాఁకులం
బిడుగుల్వోని మహోద్ధతాశ్మముల నాభీలంబుగా దైత్యు బి
ట్టడువన్‌ వైవఁగఁజొచ్చెఁ గొందఱు బలంబారంగ వే డాసి దం
దడి తత్కాయము సించి రుగ్రనఖదంతన్యాససంక్రీడలన్‌.
99
ఉ. కన్నుల నిద్ర దేఱఁగ నకంపితుఁ డై యతఁ డెంత సేసినం
దన్ను నెఱుంగ కొక్కమొగిఁ దత్కపిసైన్యచయంబుఁ బోర బే
రన్నున మ్రింగఁ జొచ్చె విలయాగమసంభృతదర్పరోషవే
గోన్నతలీలఁ గాలుఁడు జనోత్కరమున్‌ గ్రసియించుచాడ్పునన్‌.
100
వ. ఇట్లు బల చండబల వజ్రబాహులు లోనుగాఁ బెక్కండ్ర యూథపతులను బహుసహస్రసంఖ్యల వానరయూథంబును మ్రింగియు గొదగొని వచ్చుచున్న యన్నిశాచరుని మార్కొన నోడి తారప్రముఖు లైన బలీముఖులు నలువంకలం జెదరి పఱచిన. 101
మ. కని సుగ్రీవుఁడు బిట్టదల్చుచును వేగంబార దైత్యేంద్రు మా
ర్కొని సాలంబున వాని యౌఁదలఁ గడున్‌ ఘోరంబుగాఁ బూన్చి వ్రే
సిన నా వ్రేటున నిద్రదేఱి కడఁకం జేదోయి సారించి య
మ్మనుజాశుండు గపీంద్రుఁ బట్టె రభసోన్మాదంబుమై నార్చుచున్‌.
102
క. పట్టువడిన సుగ్రీవునిఁ | గట్టెదురం గాంచి యధికకలుషిత మతియై
దట్టుఁడు లక్ష్మణుఁ డసురన్‌ | బిట్టేసెన్‌ బిడుగుఁ బోని పృథుబాణమునన్‌.
103
సీ. ఉరమాడి యాశరం బుచ్చిపోవుటయును, | గడు నొచ్చి యా కుంభకర్ణుఁ డలిగి,
వెస వాలితమ్ముని విడిచి తోరపుశిలఁ | గొనుచు నుక్కున రాముకూర్మితమ్ము
దెసఁ బాఱుతెంచిన, ధీరుండు సౌమిత్రి | భల్లయుగ్మమునఁ దద్బాహు యుగము
నఱక, మాయాబలోన్నతుఁడు దైత్యుఁడు చతు | ర్బాహుఁడై తోఁచిన, భానుకులుఁడు
 
ఆ. చేతు లెల్లఁ దునిమె శితభల్లముల; వాఁడు | మఱియనేకహస్తమస్తకాంఘ్రి
భాగుఁ డైనఁ గినిసి బ్రహ్మాస్త్ర మేసినఁ | గూలె నసుర కొండ గూలినట్లు.
104
వ. ఇట్లు కుంభకర్ణుండు దెగటారినం జూచి దూషణానుజులు వజ్రవేగుండును, బ్రమాథియు రాఘవానుజుం దలపడి నిబిడబాణౌఘనిర్మగ్నుం జేయుటయు, నతండును వారి నతిబహుళశరజాలంబులం బొదివినఁ గయ్యం బొక్క ముహూర్తంబు చూపఱకు రోమహర్షణంబై చెల్లెఁ; దదనంతరంబ. 105
చ. అనిలసుతుండు నీలుఁడు రయం బెసఁగం బఱతెంచి యమ్మహా
దనుజులమీఁద నేపున నుదగ్రనగాగ్రయుగంబుఁ బూన్చి వై
చినఁ గడు రూపఱం జదిసి చెప్పఁగఁ జూపఁగ లేక పోయి ర
ద్దనుజులు వానరోత్కరముఁ దద్దయు నుబ్బున నార్చె నత్తరిన్‌.
106
క. ఆకులపడి నలుదెసలం | గాకులక్రియఁ జెదరి కడు వెగడుపడి రక్షో
నీకములు లంక యెనిమిది | వాకిళ్లను దూఱెఁ బౌరవర్గము దలఁకన్‌.
107
క. అంతఁ దనకూర్మితమ్ముం | డంతకుఁ గూడుటయు, దూషణానుజమృతి వృ
త్తాంతంబును విని యెంతయు | వంతఁ దలరి యఱచెఁ బంక్తివదనుఁ డవశుఁడై.
108
వ. అయ్యవసరంబున నాముక్తకవచుండును, నాబద్ధతూణీరుండును, బ్రచండకోదండుండును, గృపాణబాణాసనాది వివిధ సాధనోపేత సన్నిహిత స్యందనుండును, బురందర హృదయ సాగర మందరుండును నైన మేఘనాదుండు తండ్రిం జేరం జనుదెంచి, వినయంబున నిట్లనియె. 109
చ. ‘వగవఁగ నేల దైత్యకులవల్లభ! యేఁ గలుగంగ నెమ్మెయిన్‌
జగముల నీదుశత్రులకు శౌర్యము సెల్లునె? వృత్రవైరిలో
నగు సురకోటి యే పడఁచి యప్రతిమోన్నతి నున్న నీకుఁ గ్రోఁ
తి గముల నోర్చు టెంతపని దేవ! ననున్‌ గృపఁ బంపు మాజికిన్‌.
110
ఉ. కూడిన కొండమ్రుచ్చులను గ్రోఁతుల నుగ్రత ముట్టి కిన్కఁ జెం
డాడెద; నుజ్జ్వలోగ్రవివిధాంబకచుంబితదిఙ్ముఖుండ నై
యాడెద వీరనృత్యము; రయంబునఁ బార్థివసూమ లిద్దఱం
గ్రీడయపోలెఁ గిట్టి పెడకేలుగఁ గట్టెదఁ, బట్టి తెచ్చెదన్‌.’
111
వ. అనినఁ దెలివొంది మందోదరీసుందరుండు ప్రియనందనున కి ట్లనియె. 112
సీ. ‘నీ పరాక్రమలీల నిక్కమే నెఱుఁగనే | పుత్త్ర! నీ భుజబలస్ఫురణమునన
కాదె నా కిట్టి విఖ్యాతియు సిరియును | గలిగె; గీర్వాణసంఘంబుతోడఁ
గూడ నయ్యింద్రునిఁ గొనివచ్చి నా బంటుఁ | గా నొనరింపవే గర్వ మెసఁగ;
మాయావిదుండవు మహితదివ్యాస్త్రవి | శారదుండవు నీవు; సంగరమునఁ
 
ఆ. బగతు రెల్ల వెఱఁగుపడఁగ దృశ్యాదృశ్య | దుర్నిరూపభంగిఁ దొడరి చిక్కు
వఱుచు నీ మహోగ్రబాణ పాతంబులు | దశరథాత్మజులకుఁ దరమె యోర్వ?
113
ఆ. నిఖిలశత్రుచయము నిశ్శేషముగఁ జంపి | యనఘ! సమరనిహతు లైన యస్మ
దీయ జనులఋణము దీర్పుము; మసలక | పోయి రమ్ము; పోరఁ బొడిచి గెలుము’.
114
వ. అని కౌఁగిలించుకొని వీడుకొల్పిన నింద్రజిత్తు సత్వరుండై యరదం బెక్కి లంకాపురంబు వెలువడినం గని వనచరానీకంబు లార్చుచు నెదురు నడచుటయు, నతండు వారి నించుకయు సరకుగొనక కరతలం బెత్తి లక్ష్మణునిం బిలిచిన. 115
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )