పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మరాజు కృష్ణాదులతోడ భీష్ము పాలికింబోవుట (సం. 12-53-27)
క. అరదము వన్నిన నా భూ | వరుఁ డతఁడును దాను నెక్కి వడముడి వేఱొ
క్క రథమునఁ బిన్న తమ్ముల | నిరువురఁ గలపికొని యెలమి నేతేరంగన్‌.
130
క. వినుము! మహా భూతము లే | నును సమధిక రూపమున వినుతభంగిఁ దగం
జను తెఱఁగు దోఁప నెలమిం | జనియెను వసుదేవసుతుని సదనంబునకున్‌.
131
వ. రథగమన రవంబునం గృప యుయుత్సు సంజయులుం గూడుకొని; రంత. 132
క. దారుకుఁడు వన్ని తెచ్చిన | తేరను వెలువడియె వాసుదేవుండును; న
త్తేరులు నాలుగు నేమిక | లా రవ మెసఁగంగ బెరసి యరిగె నరేంద్రా!
133
క. జనమేజయ నృప! యంతకు | మును నారద ముఖ్యులైన మునివర్యులు శాం
తనవుని పాలికి వచ్చిరి | వనజభవుని కడకు సురలు వచ్చు విధమునన్‌.
134
వ. అట్లు సంయమి వర పరిషత్పరివృతుండై యున్న య ద్దేవ వ్రతుని కడ చేర నరిగి శౌరి ప్రముఖులు రథంబులు డిగ్గి. 135
ఆ. తత్సమీపమునకు ధర్మనందన పుర | స్సరత నరిగి తొలుత సకల మునులఁ
బ్రణతిఁ దెలచి కదిసి బలసి యుపాసించి | రన్నదీతనూజు నధికభక్తి.
136
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 137
మ. ‘శరతల్పంబునఁ బొల్చు భీష్ముకడకున్‌ సంప్రీతి న క్కౌరవే
శ్వరుఁడుం దమ్ములు గృష్ణుఁడుం జని మునివ్రాతంబుతోఁ గూడ న
ప్పరమోదాత్తుని చుట్టు నున్న యెడ నెబ్భంగిం బ్రవర్తించె వి
స్తర మాధుర్య మనోజ్ఞ సత్కథలు విస్పష్టంబుగాఁ జెప్పవే!’
138
వ. అని యడిగిన నమ్మహీవిభునకు వైశంపాయనుం డిట్లనియె; మున్ను ధర్మపుత్రుండు రావించిన ధృతరాష్ట్రుండును రాజులు నతనిపజ్జ నరిగి వారును గాంగేయు నుచిత ప్రకారంబునం గాంచి కొల్చి యుండి; రట్టియెడ నారదుండు ధర్మపుత్రాదుల న మ్మేదినీపతులం గలయం గనుంగొని. 139
క. ‘శంతను నందనుఁ డపరది | గంత ప్రాప్తరవి యట్టిఁడయ్యె నితఁడు లో
కాంతరగతుఁ డగుటకు ము | న్నంతఃకరణముల సంశయము వాయంగన్‌.
140
వ. సకల ధర్మ ప్రకారంబు నడిగి తెలిసికొం’డనినఁ బ్రశ్నపాటవంబు లేమి నందఱు నొండొరువుల మొగంబులు సూచుచుండఁ బాండవాగ్రజుండు పుండరీకాక్షున కిట్లనియె. 141
తే. ‘నీవు దక్కంగ మందాకినీ తనూజు | తోడి సల్లాపములకు నుక్తులు ముకుంద!
కలరె యెందును? ధర్మవేదులకు నెల్ల | గురుఁడ వీవ; సంభాషణపరుఁడ వగుము.’
142
వ. అనుటయు నచ్యుతుండు భీష్మున కత్యాసన్నుండై శారీర మానస కుశల ప్రశ్నంబుఁ జేసిన నతండు. 143
ఉ. ‘దేవ! భవత్ప్రసాదమునఁ దీఱె శరీరము నొప్పి డప్పి, మ
ద్భావము నింద్రియంబులును బాటవ సంపద నొందె, వేద వి
ద్యా విభవంబు నాకుఁ బరతత్త్వ పరిస్ఫుట బోధ యుక్తమై
భావితమయ్యెఁ నాత్మఁ బరిపక్వ దయాకరచిత్త మాధవా!
144
వ. దేవర దివ్య చిత్తంబున నన్నుం దలంచిన దానంజేసి బృంహితుండ నయ్యును గొండుక ప్రాయంబు వాఁడునుం బోలె నయితిఁ; జెప్ప వలయు వాని నెల్లం జెప్పెదఁ; బాండవ శుభకరంబైన వాని నీ వేల చెప్పవు? నీ తలం పేమి? సెప్పవే!’ యనినఁ గృష్ణుండు గాంగేయున కిట్లనియె. 145
తే. ‘అనఘ! శ్రేయస్సునకు యశంబునకు నేను | మూలకందంబ; విను! చంద్రముండు శీత
కిరణుఁడను మాట విస్మయకరమె? చెపుమ; | యశ ముపార్జింపఁ గ్రొత్తపెం పగునె నాకు?
146
క. పరమ మగు యశము నీకును | ధరణిం గలిగింపఁ బూని తాత్పర్యమునం
బురుషవర! నాదు బుద్ధి | స్ఫురణము నీ మనమునందుఁ జొనిపితి నెనయన్‌.
147
తే. ధరణి యెందాఁక నుండు సుస్థిరత నీదు | కీర్తి యందాఁక నక్షయస్ఫూర్తిఁ దాల్చి
నడవఁ గలయది నీవు సెప్పెడి సువాక్య | ములును వేదతుల్యంబులై వెలయుచుండు.
148
క. ధర్మజునకు నీ చెప్పెడు | ధర్మస్థితి వాక్య సమితి తాత్పర్యముతో
నిర్మలు లై కొనియాడెడు | ధార్మికులకు నుభయజగదుదాత్తత కలుగున్‌.
149
వ. కావున నిట్లు సేసితి; భవదీయ ధర్మవేదిత్వంబును సవిశేష ప్రకారంబుగా నీ మనుమలు ధర్మజ భీమార్జున నకుల సహదేవులు భద్ర భాజనంబులుగా నీ యున్న మహీపతులు విని కృతార్థజన్ములుగా నఖిల ధర్మ ప్రకారబోధకంబు లగు వాక్యంబులు సెప్పు’ మనుటయు శాంతనవుం ‘డట్ల చేసెద’ నని పలికి యాదరభరితుం డయి యిట్లనియె. 150
సీ. ‘ఎవ్వఁడు పుట్టిన నెల్ల మునీంద్రులు | నత్యంత సంప్రమోదాత్ము లైరి,
పరమ ధార్మికులైన భరతుల యందును | నెవ్వరు నెవ్వని నెనయ లేరు,
సత్యంబు దాంతియు శౌచంబు శాంతియు | నలవడి యెవ్వనియందు వెలయుఁ,
బాత్రదానాధ్వర బంధు రక్షాది ధ | ర్మంబు లెవ్వనికిఁ బ్రియంబు లెపుడుఁ,
 
తే. గామమున నైన విపులార్థ కారణమున | నైన భయమున నైనను నపథ వర్త
నంబునకుఁ జొరఁ డెవ్వాఁడు నన్ను నేమి | యడుగఁ దలఁచె నా ధర్మజుం డడుగుఁ గాక!’
151
వ. అనుటయు నతనితో నచ్యుతుండు. 152
చ. ‘గురులను బంధుమిత్రులను గ్రూరశరంబులఁ గూల్చె నుగ్రతన్‌,
నరుల ననేకకోటుల రణంబునఁ దాఁ దెగటార్చెఁ గాన యి
క్కురుపతి నీ సమక్షమునకుం గదియం బుయిలోడెడుం గృపా
విరహిత కార్య కర్మఠుఁడు వీఁ డని యాడుదొ యన్‌ తలంపునన్‌.’
153
వ. అనిన విని వాసుదేవునకు దేవవ్రతుం డి ట్లనియె. 154
సీ. ‘విప్రుల కధ్యయన ప్రదానాధ్వరా | ద్యము లగు కర్మము లట్ల రాజు
లకు సంగరము తండ్రులను బుత్ర పౌత్రుల | గురుల నైనను బాపపరులఁ బోరఁ
జంపుట ధర్మంబు; సమయంబు విడిచి లో | భంబున నన్యాయ పథము నందు
వర్తించువారి నెవ్వరి నాహవంబునఁ | బొరివుచ్చఁగలిగినఁ బుణ్య కృతియ
 
ఆ. యట్లు గాక శోణితాంబుపూరముఁ గేశ | శైవలంబుఁ గాఁగ సమర భూమి
నక్కజపు నదీచయం బొనర్చిన రాజు | ధర్మవిదుఁ డనంగఁదగు ముకుంద!’
155
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )