పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
బృహస్పతి వసుమనుండను రాజునకుం జెప్పిన రాజధర్మ ప్రకారము (సం. 12-68-1)
తే. లోకములు లోక ధర్మంబులును నృపాల! | రాజ మూలముల్‌; రాజ విరహిత మైన
పుడమి జనులకు నింకిన మడువులోని | జలచరంబులు పడుపాటు సంభవిల్లు.
265
క. తరణి శశాంకులతేజ | స్స్ఫురణము లేకున్న యట్లు భూజనములు ని
ర్భర దురితతఁ జేడ్పడుదురు | నరపాలక విహిత పాలనము లేకున్నన్‌.
266
క. తనధన మిదియని యూఱడి | మనఁ బరిణయ మాదియైన మహితోత్సవముల్‌
కొనియాడ నెవ్వరికి వ | చ్చునె? జనపాలుండు లేనిచో నిర్భయతన్‌.
267
తే. విభుఁడు లేకున్న జనములు సభయ హృదయు | లగుచు హాహా నినాదంబు లడరఁ దల్ల
డిల్లుదురు; రాజు లేమియ యెల్లవారు | లేమి; కల్మియ కల్మి దుర్లేపరహిత!
268
క. యాగములును, భోగములును, | ద్యాగములును, బహువిధముల ధర్మములు మహా
భాగా! నరపతి రక్షా | యోగంబునఁ జెల్లుఁ బ్రజకు నుల్లాసముగన్‌.
269
క. ఒకరునికి నలిగి యాతని | సకల హిరణ్యంబు రత్న సంచయమును బు
చ్చుకొనుం, దనవలచిన వా | నికి నిచ్చు ధనేశుఁ డండ్రు నృపు నట్టితఱిన్‌.
270
తే. చారచక్షుఁడై కను నెల్ల జగము; నపుడు | సూర్యుఁ డండ్రు నరేంద్రు నకార్యకరులఁ
దునుము నయ్యెడ జముఁడు నాఁజను; నతండు | దేవతాత్మకుఁ డగుట సందియమె యధిప!
271
క. విను నృప! సమ్రాట్టు విరా | ట్టనియెడు శబ్దములఁ బొగడు నాగమములు నె
ట్టన భూపాలకునన నా | తనిఁ దగ నర్చింపకుండఁ దగునె యొరులకున్‌?
272
క. నియతిమెయి నెవ్వఁ డింద్రియ | జయమును, భక్తియును, జిత్తసారము, దృఢ సం
శ్రయముఁ గలిగి కొలుచుం గృప | నయసంపన్నునిఁగఁ జేయు నధిపతి యతనిన్‌.
273
క. రాజునకుఁ బ్రజ శరీరము; | రాజు ప్రజకునాత్మ; కాన రాజుం బ్రజయున్‌
రాజోత్తమ! యన్యోన్య వి | రాజితు లై యుండవలయు రక్షార్చనలన్‌.’
274
వ. అని యిట్లు బృహస్పతి యుపదేశించినం గౌసల్యపతి యగు నవ్వసుమనుండు ప్రయత్నంబునం బ్రజాపాలనం బాచరించె నని చెప్పుటయు ధర్మనందనుండు ‘రాజు జనపద పరిపాలనంబును శత్రువధంబును మొదలైన కృత్యంబులు నడుపు తెఱం గెఱింగింపవే!’ యనుటయు భీష్ముం డి ట్లనియె. 275
క. ‘తనుఁ దాన తొలుత గెలువన్‌ | మనుజపతికి వలయుఁ; బిదప మార్తుర గెలువన్‌
మనమునఁ దలంచునది; మును | దను గెలువని పతికిఁ గెలువఁ దరమే పగఱన్‌.
276
ఆ. వినుము! తన్ను గెలుచు టన వేఱొకండె? పం | చేంద్రియములఁ దూలనీక కొలఁది
నాఁగుటయ జితేంద్రియత్వంబు గల రాజు | రిపులఁ జెఱుపఁజాలు నృపవరేణ్య!
277
క. ఆరామాదిక నిజ సం | చార స్థలములకు, దేశ సంధులకుఁ, బురీ
ద్వారములకు, నగరికిని ధ | రా రమణుఁ డొనర్ప వలయు రక్షలు నియతిన్‌.
278
తే. అరులకడ, నిజ భూమియం, దనుజ తనుజ | బాంధ వామాత్య మిత్రులపాల వేష
ధరుల వేగులఁగాఁ బెట్ట ధరణిపునకు | వలయు నొండొరు నెఱుఁగని వారిఁగాఁగ.
279
క. తను హీనుం డని యెఱుఁగక | మును ప్రబలునితోడ శీఘ్రమున సంధానం
బొనరింప వలయు నతనికి | ధనం బొసఁగియైనఁ బతికిఁ దగు నిలఁ గావన్‌.
280
క. మత్తుఁ బ్రమత్తుని విషయా | యత్తుని దుర్బలునిఁ జూచి యట్టి పగతుపై
నెత్తునది, శిఖి విషాదుల | నుత్తల పెట్టునది యతని యుర్విఁ గడంకన్‌.
281
ఆ. కయ్యమునకు వలదు కాల్‌ద్రవ్వనధిప! సా | మమున భేదమునను మార్తు మనము
మెత్తఁ జేసి చెఱిచి మెయివడిఁ దప్పించు | కొనుతెఱం గెఱింగికొనుట మేలు.
282
చ. జనకుఁడుఁబోలె నర్మిలిఁ బ్రజం బరికించుచు షష్ఠభాగముం
గొనునది; వారిచేత నరిఁ గోటి విధంబుల నాప్తదక్షులం
గని వన గోకులాకర నగ ప్రముఖార్థకరంబు లారయం
బనుచుచు నన్నిటన్‌ ధరణిపాలుఁడు కన్నిడియున్నఁ బెంపగున్‌.
283
సీ. కోట యేమఱ కెప్డుఁ బాటించి గడ్డియు | ఖాణంబుఁ గొల్చును గట్టియలును
నేయు నూనియయును నాయుధమ్ములు నౌష | ధములు నాభీల యంత్రములుఁ గూప
ములు లోనుగా నందు వలయువాని సమగ్ర | ములుగ సంపాదించి భూరి ధైర్య
శౌర్యాది గుణముల సడిసన్న యాప్త యో | ధులఁ బె ల్లమర్చుట యలఘునీతి;
 
ఆ. పగతుఁ డలిగి నడచు పథమునఁ దృణ కాష్ఠ | ములును ధాన్యతోయములును లేక
యుండఁ జేసి మిత్రమండలేశుల నెత్తి | యరుగుదేరఁ బనుచునది విభుండు.
284
వ. మఱియు రాజునకు రక్షింపవలయునది స్వామ్యమాత్య జనపద కోశ సైన్య మిత్ర దుర్గంబులను రాజ్యాంగ సప్తకంబు కన్నిడి యరయ వలయునది; సంధి విగ్రహ యానాసన ద్వైధీభావ సమాశ్రయంబులను షాడ్గుణ్యంబు నడపవలయునది; ధర్మార్థ కామంబు లను త్రితయంబు పాటింపవలయునది; మంత్ర ప్రభుత్వోత్సాహంబులను శక్తి త్రయంబు నిజవశవర్తిం జేయవలయునది; సత్త్వరజస్తమంబు లను గుణ త్రికంబు విశేషించి ధర్మసేవ సంతతంబు నాచరింపవలయునది; ప్రమాదంబున నర్థకామంబులు హీనంబు లైనను ధర్మనిష్ఠంజేసి ధరణీపరిపాలనంబు సుస్థిరంబై చెల్లు; నాంగిరస భార్గవాదులగు పెద్ద లిట్లని చెప్పిరి ‘త్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వా ఘ్రాణంబులను బుద్ధీంద్రియంబులును, వాక్పాణి పాద పాయూపస్థంబులను కర్మేంద్రియంబులును, మనంబునుం గూడ నేకాదశ సంఖ్యంబైన యింద్రియజాతంబు జయించి, కామజంబు లగు నక్ష మృగయా స్త్రీ పానార్థ దూషణంబులునుం, గ్రోధజంబు లగు వాక్పారుష్య దండపారుష్యంబులును నైన సప్తవ్యసనంబు లం దగులక, యజ్ఞాధ్యయన దానతత్పరుం డగుచు దుర్మంత్రుల కుటిల వాక్యంబులకు లోనుగాక, నయవిక్రమ క్రమజ్ఞులైన యమాత్యులతో దైవ మానుష చింతనంబు చేయుచు దేవ బ్రాహ్మణ ప్రణామ తర్పణ రక్షణంబులుం జేసి, యశుభ నిరాసనంబును, శుభాపాదనంబును నొనర్చుచుఁ బ్రజలం బాలించు భూపతి యుభయ లోక సిద్ధులం బొందు. 285
తే. అనిన విని ప్రీతి ధర్మనందనుఁడు రాజు | దండనీతియు ననఁగ నుదాత్తయుక్త
వస్తువులు రెండు నార్య ప్రశస్త కార్య | సిద్ధి గావించు తరములు సెప్పు మనఘ!’
286
వ. అని యడిగిన నప్పుడమిఱేనికి సరిత్సూనుం డిట్లనియె. 287
క. ‘భూరమణుఁడు కాలమునకుఁ | గారణ మెట్లన్న ధర్మగతి పూర్ణత నొ
ప్పారంగ దండనీతి స | మారంభము నడపుఁ గృతయుగాగతి నధిపా!
288
వ. అందు. 289
క. ధర్మంబు పెరుఁగు వైదిక | కర్మఫలము లెసఁగు ఋతునికాయము ప్రజకున్‌
శర్మం బొనర్చు నాయువు | పేర్మిఁ బొరయు దున్నకయును బృథివి ఫలించున్‌.
290
తే. రాజు మూఁడు భాగముల ధర్మంబు నడపుఁ | ద్రేత నమ్మెయి నది ప్రజాప్రీతి సలుపు
ద్వాపరంబున నర్ధంబ యోపి చెల్లఁ | జేయు నక్కాల మమ్మాత్రఁ జెందు మేలు.
291
క. నరపతి ధర్మోపేక్షా | పరుఁ డగుఁ గలియుగమునందుఁ బాయును ధర్మ
స్ఫురణ మధర్మం బెందును | బరఁగును వర్ణాశ్రమముల పథములు దప్పున్‌.
292
వ. కాల ప్రభావం బిట్టిది యైనను. 293
ఆ. విభుని సకలధర్మవృత్తి నత్తఱి కృత | యుగముఁ బోలు ధర్మయుక్తి మాత్ర
లరయ విభుల కెట్టులయ్యె నట్టి తెఱంగు | లవుల యుగములట్ల యగు నృపాల!
294
వ. అనుటయు నెట్టివాఁడైన విభుని శుభంబులు పొందు; ననుటయు ధర్మనందనునకు మందాకినీ నందనుం డిట్లనియె. 295
మ. అరయుం దప్పు కృతం బెఱుంగు మదలోభావేశముల్‌ లే వము
ష్కరుఁ డాత్మస్తుతి లేదు చేయునియతిం గార్యంబు లీగుల్‌ ఘన
స్థిరముల్‌ శూరుఁడు గర్విగాఁడశఠుఁ డస్త్రీలోలుఁ డక్రోధనుం
డరి నొవ్వం గొనఁ డ న్పొగడ్తఁ గను రా జత్యంత దీప్తుం డగున్‌.’
296
వ. అని చెప్పి వెండియు. 297
ఆ. ‘సాంగ వేదవేది యగు పురోహితుఁ డెప్డు | నగర మెలఁగ వలయుఁ దగవుఁ గృపయుఁ
జక్కటియును గలుగు సచివునప్పనముల | నరులు నరయఁ బనుచునది విభుండు.
298
క. పరుసఁదనముమెయి నరిగొనఁ | జొరఁదగ; దది పొదుఁగు గోయు చొప్పగు విను పా
ల్గురియించుకొనఁ దలంచిన | నరయవలదె గోవుఁ బ్రజయు నట్టిద యధిపా!
299
ఆ. కోరి తోఁటవాఁడు కుసుమ ఫలంబులు | కోయునట్లు రాజు కొనఁగవలయు
నప్పనములు; నఱికి యంగారములు చేయు | భంగి యైన భూమి పాడు గాదె?
300
క. దయఁ బ్రజ రక్షించుటకు, నె | నయె తపములు నధ్వరములు నరవర దానన్‌
జయమును లక్ష్మి యునుం గీ | ర్తియు సుగతియుఁ గలుగు వసుమతీనాథునకున్‌.
301
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )