పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
కుబేరునకు ముచుకుందునకుఁ గలిగిన సంవాదము (సం. 12-75-3)
వ. అని చెప్పి పురోహితుని విశేషంబు ముచుకుందుం డను రాజునకు వైశ్రవణునకుం గలిగిన సంవాదంబునఁ బ్రకటం బయ్యె; నత్తెఱం గెఱింగించెద. 318
మ. విను మారాజు సమస్త దిగ్విజయమున్‌ విస్ఫూర్తిమైఁ జేసి, తాఁ
దన లా వారయు బుద్ధి వైశ్రవణు మీఁదం బోవ నాతండు దై
త్యనికాయంబులఁ బంచినం దెరువునం దత్తైన్యముల్‌ రాజు మూఁ
క నతి క్షుభ్యము గాఁగఁ జేయుటయు స్రుక్కంబడ్డ చిత్తంబుతోన్‌.
319
క. నృపతి పురోహితు దూఱినఁ | దపముల మంత్రముల దేవతాపూజల వీ
ర్యపటుత్వ మతని సేనకు | నపరిమితము సేసె నమ్మహాత్ముం డధిపా!
320
ఆ. బ్రహ్మశక్తిఁ బేర్చి రాజు సైన్యము దైత్య | సేన బడలు వడఁగఁ జేయ నాతఁ
డతి రయమున ముట్టె నలకఁ గుబేరుండు | ననికి వెడలె నిజ బలాన్వితముగ.
321
వ. వెడలి సమరంబు సేయు సమయంబునం గిన్నరేశ్వరుం డన్నరేశ్వరు నాలోకించి. 322
శా. ‘దక్షుం డై తిటు బ్రహ్మశక్తిన భవద్బాహా విలాసం బమి
త్రక్షోభం బొనరించెనే?’ యనుడు నాతం డిట్లు ‘నీ వంటి బ్ర
హ్మ క్షత్రంబుల కేక యోని జననం బ వ్వేధ గల్పించె; యో
గ క్షేమాకలనంబు సంగతములై కావింపఁ బంపండొకో!
323
వ. అనుటయు ధనదుండు సాంత్వన స్వరంబున. 324
ఉ. ‘నాకును నీకు నేటికి రణం బొనరింపఁగ నేను బంప నీ
వేక ముఖంబుగా ధరణి యేలుము’ నావుడు నవ్వి యవ్విభుం
‘డీ కుపతిత్వ మొల్ల నొరు నీగి మహత్త్వకరంబె విద్విష
ద్భీకర మద్భుజార్జితమ పెంపొనరంగ భుజింతు దిక్పతీ!
325
వ. అనిన విని పౌలస్త్యుండు నీ వధికుండ వట్లు సేయు’మని గారవించిన ముచుకుందుండు ముదితుండై చని సకలోర్వియు నిర్వక్ర విక్రమంబున నేలె నని చెప్పిన విని యజాతశత్రుండు ‘రాజధర్మంబులయం దైశ్వర్య ప్రీతి పుణ్యలోకంబులు నిరతిశయంబుగాఁ జేయం జాలునది యెయ్యది?’ యని యడిగిన. 326
ఆ. అతని కిట్టు లనియె నమర తరంగిణీ | సూనుఁ ‘డధిక భీతులైన సజ్జ
నులకు నభయ మొసఁగి యలఘు సౌఖ్యాత్ములఁ | జేఁత యెంతయును విశిష్ట మధిప!’
327
వ. అని వెండియు. 328
క. ‘విను! పర్జన్యుఁడు భూతము | లను బండిన మ్రాను పక్షులను బ్రోచువిధం
బున నీవు బంధువుల, స | జ్జన యుతముగఁ బ్రోవు; మది ప్రశస్తం బనఘా!
329
వ. అనిన విని ధర్మనందనుండు ‘విప్రప్రభృతులకు నిజధర్మవర్తనంబుల జీవనంబుల నడవక తక్కిన నె?’ ట్లని యడిగినఁ బితామహుం డతనితో ‘నాపద దనికిన నితర జాతి వృత్తంబు గర్వితంబుగా దట్లయినను నాయుధోపజీవనాదిక్షత్ర ధర్మంబులంజేసి బ్రాహ్మణ్యంబు వట్రపడి బ్రాహ్మణులు క్షత్రసము లగుదురు. వాణిజ్య ప్రముఖ వైశ్యక్రియ లాచరించి వైశ్యసము లగుదురు. నిత్యానుష్ఠానంబులు లోనుగాఁ గలయవి డిగవిడిచి ధనలోభ తాత్పర్యంబున శూద్ర ప్రాయులై చరించి శూద్రసము లగుదురు; దక్కిన జాతులవారందరు దమదమ తారతమ్యంబులతో నిట్ల నిజజాతి విహీను లగుదు; రట్టివారు జాత్యుత్తమ కృత్యంబునకుఁ బాత్రంబులు గారు; భూకాంతుం డింతయు నెఱింగి యర్హ ప్రకారంబులం బ్రజ నడిపి రక్షించినం బ్రజాకృతం బగు ధర్మంబునందుఁ జతుర్థాంశంబునకు నుక్తుం డగుఁ బ్రజలఁ బాతకంబులం బొరయకుండ నరయం జాలక దండ్యదండన రహితుం డైన మహీవిభుని వారలచేసిన పాతకంబుల నాలవపాలు వొందుఁ; గొందఱు బుధు లంతయుం బొందు నని చెప్పుదు’రనుటయు నమ్మనుజనాథుండు. 330
ఆ. ‘వినుము! వివిధ సుఖము లనుభవింపఁగ రాజ్య | విభవ యుక్తిఁ దిరుగ వేడ్క లేదు
నాకు ధర్మరక్షణము మీఁది భరముఁ ద | ల్లోప భయము మనములోనఁ బెద్ద.
331
వ. కావున. 332
చ. అనఘ! యనేక దోష మగునట్టి మహీవహనంబు నొల్ల; దం
డన పరుషత్వ మేటికి? దృఢ ప్రశమంబున నేను గానకుం
జనియెద’ నన్న భీష్ముఁ ‘డిది జాడ్యము గాక నృపాలధర్మమే
మనుజ వరేణ్య! నీ మనము మార్దవ మగ్గల; మిట్టు నొప్పునే?
333
వ. ని న్నొత్తి చెప్పుటకుఁ బాండు విచిత్రవీర్య శంతను లున్నవారే? నా బుద్ధి వినుము. 334
ఆ. ఈఁగ కాలి యంత యేనియు వీసర | పోవకుండ ధర్మమునన నడచి
రయ్య! తొంటి రాజుల క్రోధ కామ ప్ర | యుక్త దండధరణ మొప్పుఁ గాక.
335
క. దానాధ్యయన యజనముల | తో నుర్వీజనులఁ గావఁ దొడఁగుట పతికిం
దా నజ కల్పిత ధర్మము; | దీని విడుపు నరకమునకుఁ దెరు వగు నధిపా!
336
క. కావున వర్ణాశ్రమముల | నేవిధమున నైన నడపు లెడలక యుండం
గావంగ నోపు నృపతికి | లే వలజ ళ్ళుభయలోక లీలలయందున్‌.
337
వ. ఇ ట్లగుటం దెలుపునది యొక్క యితిహాసంబు గల; దాకర్ణింపుము. 338
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )