పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
కాలక వృక్షీయ క్షేమదర్శి సంవాద ప్రకారము (సం. 12-83-1)
క. ఆయతికాఁడు వలయు నర | నాయకునకు వానికెల్ల నరులుం జేటుం
జేయఁ దలంతురు దా నవ | ధాయకు డై కావవలయు ధరణిపుఁ డతనిన్‌.
363
వ. ఈ యర్థంబున నితిహాసంబు గల దాకర్ణింపుము; కాలక వృక్షీయ నామధేయుం డగు నొక్కముని క్షేమదర్శి యనియెడు కోసల భూవిభుని భూమికిం బంజరస్థంబుఁ జేసికొని యొక్క కాకంబుఁ దెచ్చి యిప్పక్షి త్రైకాల్యవేది యని యెల్ల జనంబులకుం జెప్పుచుఁ దిరిగి క్రమంబున రాజుం గని యతని కక్కాకంబుఁ జూపి ‘నీయం దర్థార్జనాది నృప కార్యంబువలన నేమఱుట గలదు; దానం బుట్టిన సేగియెల్ల నిప్పులుఁగు సెప్పి నీకుం దప్పిన మ్రుచ్చులం బట్టింపఁ జాలు’ నను పలుకు వలికి యమ్మహీవరు నాదరంబు వడసి వీడుఁ బట్టున కరిగిన. 364
క. ఆ రాత్రి యవ్విభుని యధి | కారులు సంపి రొక భంగిఁ గాకము; మఱునాఁ
డా రాజున కవ్విప్రుఁడు | గోరి రహస్యంబుఁ జేసికొని యెఱిఁగించెన్‌.
365
వ. అట్లు నియోగుల కపటోపాయంబునం గాకి మృతం బగుట సాభిజ్ఞానంబుగా నెఱింగించి, తన పేరు సెప్పి, ‘యేను మీ తండ్రి సఖుండ; నతని పిమ్మట నిచ్చట నిలువ నొల్లక వనంబున కరిగి తపంబు సేయుచుండి, నీ మీఁది యధిక స్నేహంబునంజేసి, నీ దగు యోగక్షేమంబు లరయవేఁడి వచ్చి యీ రాష్ట్రంబునం బురంబునను వర్తించుచు భవదీయ రాజ్యలక్ష్మి మధుర భంగి యయ్యును నధము లగువాని యుక్తులవలనం జోరజన సంవృతంబైన కావేరియుంబోలె నుపయోగ్య గాకునికి యెఱింగి, నీకెఱింగించుటకై మిథ్యాభివర్ణితంబైన కాకంబు నెపంబిడి చొచ్చితి; దుర్మతులైన ద్రోహులు దానిం జంపుట కతంబున లోనం గీడు గలుగుట నీకుం గొంత గాననయ్యెఁ; గనుగలిగి యరసిన నింకనుం దేటపడియెడు నా యాప్తియును, గార్య వివేకంబు కలిమియు నమ్మి మదీయోపదేశంబు నాదరింపు; మిప్పుడు నన్నాదరింపక విడిచినవాఁడ వగుము; వంచకులైన యధికార పురుషులకు నేర్పుమైఁ గ్రమంబునఁ బరస్పర విరోధంబుఁ గలిగించి సంప్రీతి సెఱిచి నీవలసిన ట్లొక నొకనిం దండింపు’ మని వారలం బేరు గ్రుచ్చి యుపదేశించిన. 366
క. ఆ రాజు నట్ల చేసి మ | హారాజ్య స్థితికి నెల్ల నవ్విప్రు మహో
దారగుణు మంత్రిఁగాఁ గొని | సారధనప్రీతి సుఖ యశంబులు వడసెన్‌.’
367
వ. అనిన విని కౌంతేయాగ్రజుండు ‘మంత్రి యెట్టివాఁడు గావలయు నెఱింగింపు’ మనుటయు గాంగేయుం డతని కిట్లనియె. 368
సీ. ‘జ్ఞానపరుఁడుఁ బౌర జానపదాప్తుండుఁ | గార్యజ్ఞుఁడును ధైర్యశౌర్యఘనుఁడు
నక్రూరుఁడును విశుద్ధాత్ముండుఁ బతియెడ | భక్త్యను రాగ సంభ్రమము లెసఁగ
సమ సుఖదుఃఖుఁడై చెమరు నెత్తురు గాఁగఁ | దలఁచుచు నరయక తప్పు మీఁదఁ
బెట్టిన నలుకమైఁ దిట్టినఁ గలఁక దా | నొందక తేర్చుచోఁ బొందు సెడక
 
తే. మెలఁగు వాఁడును నిజరంధ్రములకు మాటు | సేయఁ బరరంధ్రములు గని చిక్కువఱుపఁ
జాలు నిపుణుండు నైన విశాలబుద్ధి | గావలయు మంత్రిముఖ్యుండు గౌరవేంద్ర!
369
వ. అని చెప్పి. 370
క. ‘మృదు మధుర వాక్యముల నిం | పొదవెడు చిఱునవ్వుతోడ నుర్వీశుఁడు స
మ్మదము సచివులకుఁ బ్రజలకు | నొదవింపఁగవలయు;నది మహోన్నతిఁ జేయున్‌.
371
తే. ఈగియును బ్రియ వచన సంయోగమునన | కాని జనులకు సంతోషకారి గాదు
పుచ్చి కొనునప్డు పల్కుల పొందుకలిమి | యెదిరి మదిఁ గందనీ దింత యెఱుఁగు మధిప!’
372
వ. అనుటయు ధర్మతనయుండు ‘జనంబుల వివాదం బుడుపు నపుడు పుడమిఱేఁడు దూఱునుం బాపంబును బొరయకుండు తెఱంగు దెలుపవే ‘యనిన దేవవ్రతుం డిట్లనియె. 373
సీ. ‘వ్యవహారశుద్ధి సర్వ ప్రజా ప్రియకారి; | యదియ భూపతికి ధర్మాతిశయముఁ
గీర్తియుఁ జేయు; నక్షీణసత్యులు ధర్మ | పరులును నైన భూసురులు నీవు
ద్రాసులుం బోని చిత్తంబుల తోడుత | బ్రజ వివాదము లెడఁ బక్ష ముడిగి
విని ధన వాంఛమై ధనికుల దెస వ్రాలి | తీర్పక ధర్మంబు తెరువు దప్ప
 
ఆ. కుండఁ బాడిఁ దీర్చి దండింపఁ దగునెడ | ననుగుణంపు దండ మాచరింపు
మొఱగఁ బలికితేని నుండదు ప్రజ డేగఁ | గనిన పులుఁగుపిండు కరణిఁ జెదరు.
374
వ. దండించుట దానును. 375
క. నఱకుట యర్థముఁ గొనుటయు | జెఱ నునుచుట కట్టి యడిచి చేడ్పాటొందం
బఱచుట మొదలుగఁ గల పలు | దెఱఁగులఁ దగవుమెయి నడచు ధీరవిచారా!
376
వ. అని చెప్పి భీష్ముండు వెండియు ని ట్లనియె. 377
క. ‘తన కడకు వచ్చి మొగమో | డని వాఁ డగు దూత వల్కుటకుఁ గోపింపం
జనదు జననాథునకు; దూ | తునిఁ జంపిన నరక మగుట ధ్రువ మని రార్యుల్‌.
378
తే. కులము, శీలంబు, హితవాక్యములును, నేర్పుఁ, | గార్యవాదిత్వ సద్వచో గౌరవంబుఁ,
దలఁపు గలుగుట, దక్షత, యలఘు గుణము | లండ్రు దూతకు నియ్యేడు నార్యజనులు.
379
క. మొనదీర్చు వెరవు, యంత్రము | లనేకము లొనర్చు నేర్పు, నాయుధముల వి
న్ననువును బోటుల కర్జం | బును సేనాపతికి నైజములు గావలయున్‌.
380
క. తనయులనైనను నమ్మిన | జనపతి సిరి గోలుపోవుఁ; జతురతమై న
మ్మినవాఁడ పోలె నమ్మక | యునికి సకల జనుల యెడల నురవై యుండున్‌.’
381
తే. అనిన విని పాండవాగ్రజుం ‘డనఘ! పురము | భంగి యె ట్లైన మేలు? సెప్పంగ వలయు’
ననుడు నమ్మహీవిభునకు ననిమిషాప | గా తనూభవుఁ డి ట్లనుఁ బ్రీతితోడ.
382
సీ. ‘పరపు లోఁతును గల పరిఖతోఁ’ బొడవును | ఘనమును నగుకోట గలిగి, తగిన
వాకిళ్ళు బలుపుఁ, గావలి నొప్ప రమ్య గృ | హవ్రాతములు గొమరారు వీథు
లందంబు లగు మేటి యంగళ్ళ నెల్ల వ | స్తువులును శోభిల్లు సుజన బహుళ
మై ధాన్యములును ఘృతాది రసద్రవ్య | ములును నానాయంత్రములును బహువి
 
ఆ. ధాయుధములు బిరుదు లగు యోధులును బండి | తులు విలాసినులును దూతముఖ్య
పరిజనము నెఱయఁ బరమోత్సవంబులు | మెఱయఁ బురము చెలువు మిగుల వలయు.
383
ఆ. అట్టి పురవరంబునందు రత్న స్వర్ణ | ముఖములగు పదార్థములకు బంధు
తతికిఁ బతి సురక్షిత స్థితి సేయువాఁ | డధిప! వినుము భూమి యరయు తెఱఁగు.’
384
వ. అని పలికి మఱియు. 385
క. ‘స్థలముఖ్యము లయ్యెడు పే | ర్కల యూళ్ళుల నెల్ల వెరవు గలిగిన విశ్వా
సులఁ బ్రభుత యిచ్చి భూపతి | నిలుప వలయు వర్ణరక్షణీయత వెలయన్‌.
386
క. చోరులచేఁ జెడకుండం, | గ్రూరులచేఁ జావకుండఁ గువలయ జనులన్‌
జారులచేఁ బడకుండ ధ | రారమణుఁడు నేర్పు గలిగి రక్షింపఁ దగున్‌.
387
క. అవు బేహారముఁ, గృషియు, | న్సవరణలును బసులసొంపునన యట్లగుటన్‌
భువిఁ బసులు గలుగు కాఁపుల | నవనీశుఁడు గన్న ప్రజల య ట్లరయఁ దగున్‌.
388
క. అరి మిగులఁ గొనుట, గ్రేపులఁ | బొరిమాలం బిదికినట్ల భూవర! కదుపున్‌
వెరవునఁ బెనిచిన యట్టగు | నరపతి ప్రజచేత నప్పనము దగఁ గొనినన్‌.
389
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )