| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
వాయువుల నియతవృత్తి మ | నో యంత్రణ బొమలనడుమ నూల్కొల్పి విచే ష్టాయిత శరీరుఁడై మూ | ర్ధా యోజితములుగఁ జేసి యత్తలఁ జేర్చెన్. |
165 |
| వ. | అప్పుడు తదీయ బ్రహ్మరంధ్రోద్గతుండును మహాజ్యోతిర్జ్వాలాకృతియుం బ్రాదేశ మాత్రుండును నగు పురుషు నెదుర్కొని పరమేష్ఠి సమాధానంబున ‘వచ్చితే?’ యని పలికి వెండియు. | 166 |
| తే. |
జాపకులకు యోగులకును సమమ పుణ్య | గతివిశేషంబు ప్రత్యక్ష కలితమందు జాపకులు నిర్భరోత్థానశక్తి నధికు | లనుచు వక్త్రంబు విచ్చి రమ్మనియె నధిప! |
167 |
| వ. | అనుటయు. | 168 |
| తే. |
బ్రహ్మరంధ్ర నిర్గతుఁడైన బ్రాహ్మణుండు | బ్రహ్మవదనంబు సొచ్చె భూపతియు నట్ల వెడలి తద్వక్త్ర మెప్పటి వికసనంబుఁ | బొంద నందుఁ బ్రవేశించె భూపవర్య! |
169 |
| క. |
దేవత లచ్చెరువడి య | ద్దేవుని నయ్యిరువురను నుతించి రజుఁడు సం భావించె ధర్మమును నవ | నీవర! యప్పరమ విభుఁడు నిరుపమలీలన్. |
170 |
| వ. | తదనంతరంబ యంతర్హితుం డయ్యెఁ; దక్కినవారును నిజస్థానంబుల కరిగిరి; జాపక ప్రకారంబును దదీయ సుగతి విశేషంబులు నెఱింగించితి; నీ వింక నెయ్యది వినవల తనవుడు నాపగాసుతునితోడం గుంతీతనయాగ్రజుండు ‘నిరతిశయ జ్ఞానయోగంబు విధంబు వినువాంఛ నాకుం గలదు. సెప్పవే!’ యనిన నప్పురుషుం డప్పౌరవోత్తమున కిట్లనియె. ‘మను బృహస్పతి సంవాదం బను నితిహాసంబుగల దది నీయడిగిన యర్థంబునకు బోధకంబయి యుండు నాకర్ణింపుము. మను వాత్మీయగురుం డగు దేవగురునకుం బ్రణమిల్లి యిట్లనియె. | 171 |