పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
ఇంద్ర నముచి సంవాద ప్రకారము (సం. 12-219-1,2)
సీ. ‘సిరిఁ బాసియును నొక్క చింతయు లేక వీ | చుల క్రం దడంగిన జలధివోలె
నముచి యేకాంతస్థలమున నుండఁగ నింద్రుఁ | డచటికి నేతెంచి యతనిఁ జూచి
‘పేదవడ్డాఁడవు ప్రియజనంబును బరి | వారంబు లే దియ్యవస్థ కెంత
వగచెదవో దానవశ్రేష్ఠ!’ నావుడు | నాతండు ‘వగపు నిరర్థకంబు
 
తే. వలయు వస్తువు వగచిన వచ్చునయ్య? | రామి యొక్కటియే శరీరంబు నెదయుఁ
దాపమునఁ బొందు వగపున ధర్మ మేదు; | నింత యెఱుఁగుదు వగవ నే నేమిటికిని.
412
తే. సకలభూతంబులకును శాసకుఁడు గలఁడు | గాదె! యొక్కరుఁ డాతని కల్పనమునఁ
బ్రాప్తమైనది నీళులు పల్లమునకు | వచ్చు క్రియఁ దాన వచ్చు గీర్వాణముఖ్య!
413
క. ఇది నా కయ్యెం; గాఁగల | యది యై యను గాఢనిశ్చయం బెవ్వని నె
మ్మదిఁ గలుగు నుబ్బు వగ సం | పద యాపద గలుగ వట్టి భవ్యున కింద్రా!
414
క. ధైర్యంబున వీర్యంబున | శౌర్యంబునఁ బ్రజ్ఞఁ బడయఁ జాలునె నరుఁ డె
క్కార్యము నప్రాప్యమయిన? | నార్యుం డది యెఱుఁగుఁ గాన యడలఁడు శక్రా!
415
తే. మేలుఁ గీడును నరుఁ బొందుఁ గాలముల న | వశ్యమును వానిఁ గోరిన వచ్చుటయును
వినుము త్రోచినఁ బోవుటయును సురేంద్ర! | కలదె వానికిఁ? గావున వలదు చింత.’
416
క. అని యిట్లు నముచి పలికిన | విని మెచ్చుచు దివికి నమరవిభుఁ డరిగెం; బా
వనచరిత! యింకనెయ్యది | వినవల తనవుడును భరితవినయుండగుచున్‌.
417
క. ఆ నరపతి శాంతనవుని | తో నిట్లను ‘నెద్దియేని దుర్దశ యైనన్‌
మానవుఁ డెట్టిఁ డగుట మే | లానతియీవే? దయామయా! తేటపడన్‌.’
418
వ. అని యడిగిన నయ్యుధిష్ఠిరునకు బుధశ్రేష్ఠుం డిట్లనియె. 419
క. ‘ఏ విధమున దుర్దశలకు | భూవర! ధైర్యంబ మందు; భూరిధృతిమెయిం
జేవ గలుగు దృఢనిశ్చయ | భావము నెవ్వగలఁ దొట్రువడ దెబ్భంగిన్‌.
420
క. ధృతి యారోగ్యము నొసఁగును; | ధృతి యుజ్జ్వలలక్ష్మి ఁ దెచ్చు; ధృతి గీర్తి సము
న్నతిఁ జేయుఁ; గాలగత్యవ | గతి గలిగినఁ గలుగు ధృతి వికారవిదూరా!
421
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )