| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
విబుధుల పండ్రెండు వేలేండ్లు సనునంత | నాలుగు యుగములు నోలి నడచుఁ గృతయుగమ్మున కందుఁ జతురంశకములుఁ, ద్రే | తకు మూఁడు పాళ్ళును, ద్వాపరంబు భాగద్వయంబునఁ బర్యవసిత మగుఁ; | గలియుగ మంశ మొక్కటన తీఱు; నిబ్భంగిపాళ్ళగు నిన్నియుగముల కం | బరయుగ్మ వసువార్ధి పరిమితములు |
|
| తే. |
ఖద్వయర్తుగుణంబులు గగన యుగళ | వేద నేత్రంబులును నభోద్వితయకరసు ధాంశులును వచ్చు మున్నూటయఱువదింటఁ | బెంప మానుషాబ్దంబులై పేర్చి యుండు. |
46 |
| వ. | ఇట్లు కృతయుగంబునకుఁ బదియేడు లక్షలు ఇఱువది యెనిమిది వేలును, ద్రేతాయుగంబునకుఁ బండ్రెండు లక్షలుఁ దొంబదియాఱువేలును, ద్వాపరంబునకు నెనిమిది లక్షలు నఱువది నాలుగువేలును, గలియుగంబునకు నాలుగు లక్షలు ముప్పది రెండు వేలును మనుష్య వత్సరంబు లయ్యె; నిందులోన సంధ్యలును, సంధ్యాంశంబులు ననుపేళ్లఁ గొంతేసి కాలంబు సెల్లు. | 47 |
| క. |
క్రమమున సంధ్యలు సంధ్యాం | శములు ననం బరఁగు బుత్ర! సకలయుగాద్యం తములును యుగయుగమునకుం | దమలో నవి సరియ కాలతత్త్వం బరయన్. |
48 |
| వ. | అది యెట్లంటేని దేవసంఖ్యం జెప్పెద. | 49 |
| క. |
నన్నూఱులు మున్నూఱులు | నిన్నూఱులు నూఱులును మహితవర్షము ల య్యన్ని యుగములకును గ్రమా | సన్నత సంధ్యలను వాని సంధ్యాంశములన్. |
50 |
| వ. | ఇట్లు కృతయుగంబునకు సంధ్య లక్షయునలువదినాలుగువేలు, దాని సంధ్యాంశంబు నంతియ; త్రేతకు సంధ్య లక్షయు నెనిమిది వేలు; దాని సంధ్యాంశంబు నంతియ; ద్వాపరంబునకు సంధ్య డెబ్బదిరెండువేలు; దాని సంధ్యాంశంబు నంతియ; కలియుగంబునకు సంధ్య ముప్పదియాఱువేలు; దాని సంధ్యాంశంబు నంతియ; యివి మానుష వత్సరంబులు. | 51 |
| క. |
వరుసఁ గృత త్రేతా ద్వా | పర కలియుగములఁ దపంబు భవ్యజ్ఞాన స్ఫురణము యజనము దోషా | దరమును మానవులకుం బ్రధానతఁ గలుగున్. |
52 |
| క. |
న్యాయంబులు, ధర్మంబులు, | నాయువులుఁ, దనూబలములు నంతంతకు వ త్సా! యెంతయుఁ దఱుఁగుం ద్రే | తాయుగముఁ దొడంగి మనుజతతి కరయంగన్. |
53 |
| తే. |
ఆ యుగంబులు నాల్గు మహాయుగంబు | నాఁగఁ జనుఁ దత్సహస్రంబు నలువ పగలు దాని కొలఁదియ రేయును దీని నెఱుఁగు | ప్రౌఢ జనములు సు మ్మహోరాత్ర విదులు. |
54 |
| తే. |
అతఁడు రాత్రి నిద్రించు; నిద్రావసరమ | ప్రళయ మగు లోకములకు; ప్రభాత మగుడు మేలుకను; దివమున భూతజాలసృష్టి | పరతఁ బొందుఁబర్యాయ మిప్పాటఁ జెల్లు.’ |
55 |
| వ. | అని వెండియు. | 56 |
| తే. |
‘అనఘ! బ్రహ్మంబు దేజోమయంబు శుక్ల | మగ్రభాసిత మెద్దాని యతుల సార రసము విశ్వంబు నది యహర్మహితకాల | బుద్ధమై చేయు బహువిధ భూతసృష్టి. |
57 |
| వ. | తత్ప్రకారం బెట్టి దనిన: నమ్మహనీయతత్త్వంబు వలన. | 58 |
| ఆ. |
విను! మహన్మనోగగన పవనానల | సలిల భూము లనఁగ సంభవించు మహిత విభవములు గ్రమంబున నేడు | రూపములు జన్యజనకభావ మొంది. |
59 |
| క. |
క్రమయుక్తిని శబ్దస్ప | ర్శములును రూపరసగంధ సద్భావములుం దమ గుణములుగా నాకా | శము మొదలగు భూతములు ప్రశస్తి వహించున్. |
60 |
| క. |
నరనుత! విను మీ సప్త | స్వరూపములు పురుషులండ్రు సంయమివరు; లీ పురుషులు గూడిన సృష్టికి | వెరవరు లది సంఘటిలదు వేర్పడిరేనిన్. |
61 |
| వ. | ఇట్టి మహిమ గలిగి . | 62 |
| క. |
తేజోరూపము బ్రహ్మము | ప్రాజాపత్యం బనఁగఁ బరగి పురుషుఁ డు ద్భ్రాజిష్ణు సత్యనిత్యా | వ్యాజమహిమ వెలుఁగుచుండు నకలంకమతిన్. |
63 |
| క. |
వ్యాపకుఁడు స్రష్ట బ్రహ్మ ప్ర | జాపతినాఁ బరఁగి నిత్యసత్యాత్మ త్వో ద్దీపితుఁడై పురుషుఁడు ని | ర్లేపుఁ డనిర్దేశముం గలిగి వెలుఁగొందున్. |
64 |
| క. |
సురసంయమి గరుడోరగ | నరకిన్నర గిరి సరిద్వన పయోధులఁ ద త్కరణీయములం జేయుం | బురుషుఁడు దివ్యాంతరంగమునఁ దలఁచి సుతా! |
65 |
| వ. | ఇట్లు గలిగి వర్తిలుచున్న లోకంబులందు. | 66 |
| ఆ. |
పౌరుషంబు సూవె ఫలదమందురు కొంద | ఱనఘ! దైవ మిచ్చు నండ్రు కార్య ఫలము కొంద ఱెల్ల ఫలము భూతస్వభా | వంబ యండ్రు గొంద ఱమితతేజ! |
67 |
| వ. | ఇవి కర్మస్థుల తెఱంగులు; సత్త్వస్థులు సమదర్శను లయి యుండుదురు; విశేషంబు వినుము. | 68 |
| క. |
శివకరము దపము మేధా | ధవ! సకల జనంబులకును దానికి మూలం బవిరళ శమదమ సంపద | లవుట నివి మనంబుతోడ నలవడ వలయున్. |
69 |
| వ. | స్వాధ్యాయంబు దపంబునకు బలం బిచ్చి తత్ఫలంబు గావించు. | 70 |
| క. |
అరయంగా శబ్దంబును | పరంబునన రెండు సూవె బ్రహ్మములు గుణో త్తర శబ్ద బ్రహ్మ భజన | పరుఁడు పరబ్రహ్మ మహితపదముం బొందున్. |
71 |
| క. |
పరమబ్రహ్మమ భూతో | త్కరముం గలిగించు మ్రింగు; దా నిష్క్రియతా స్ఫురితం బయ్యును బ్రకృతి | స్ఫురణను శబలత్వ మొంది పురుషవరేణ్యా! |
72 |
| వ. | సృష్టి తెఱంగు ము న్నెఱింగించితి; సంహారప్రకారంబు సెప్పెద నాకర్ణింపుము. | 73 |
| తే. |
స్థావరములు జంగమములుఁ దన్నుఁ గలయ | విలయ మొందిన ఘటపృష్ఠ విధము దాల్చు; భూమి నంబువుల్ మ్రింగు; వంబువుల నగ్ని, | యగ్ని ననిలుం, డనిలుఁ ద్రావు నాకసంబు. |
74 |
| ఆ. |
ఆకసమును మనసు హరియించు, గంధాది | యగు గుణాళితోడ నఖిల భూత ములును నిట్లు లయముఁ బొందిన గ్రసియించు | మనసు నాత్మగుణము నెనసి విధుఁడు. |
75 |
| క. |
అతనిఁ బొదువు సంకల్పం | బతుల జ్ఞానంబు దాని నడఁచును విజ్ఞా నితఁ దద్బలముఁ బురుషదే | హితనుం గాలంబు వరుస నెడలం జేయున్. |
76 |
| క. |
కాలం బెడలిన విద్యో | న్మీలిత మగు బోధ మన్యమిశ్రత్వంబుం దూలించి వెలుఁగుచుండు వి | శాలమతీ! బ్రహ్మ మది ప్రశస్తము శ్రుతులన్. |
77 |
| క. |
వినుమీ సంహరణంబును | దన వస మాతత్త్వ మవ్విధంబున దివసం బును రాత్రియు భూతములకు | జననము విలయమును జేయు సంక్రీడమెయిన్. |
78 |
| వ. | అని చెప్పి పారాశర్యుం డార్యవర్యుం డగు శుకునితో వెండియు నిట్లనియె. | 79 |
| సీ. |
‘జనియించి విప్రుండు జాతకర్మంబును | జౌలంబు నుపనీతి సంస్కృ తియును బడసి యాచార్యునిపాల నధ్యయనంబు | సేసి, తా నాతనిచే ననుజ్ఞ గాంచి తక్కటివి మూఁ డంచితాశ్రమముల | యందు నొక్కటి పూననగు గృహస్థ ధర్మ మాశ్రయ మండ్రు తక్కిన మూఁటికిఁ | గావున నది పూని దైవపైతృ |
|
| తే. |
కంబులైన ఋణంబులఁ గ్రాఁచు; వడుగు | నాఁటి నడవడి ఋషుల ఋణమ్ము దీర్చి వచ్చి కాన కాషాయపక్వతఁ బ్రశుద్ధిఁ | బొంది మఱి యుత్తమాశ్రమ మొందు టొప్పు. |
80 |
| తే. |
క్రతువుసేఁత సేయించుట, శ్రుతులు గాఢ | నియతిఁ జదువుట, చదివించుటయును, ధనము లీగికొనుట షట్కర్మంబు; లింతవట్టు | నర్హకృత్యంబు లండ్రు ధరామరులకు. |
81 |