| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| తే. |
‘ఎల్లకడలకు వెలువడు నింద్రియముల | బాలపుత్రులఁ దండ్రియుఁ బోలె నాఁగు మవియు మనమును నిశ్చలైకాగ్రభావ | మొందు టుత్తమ తప మది యుజ్జ్వలాత్మ! |
179 |
| క. |
అది ధర్మంబుల కెల్లం | దుది యగు ధర్మంబు; మనసుతో దానిఁ దగం గుదియించి మేధతోడం | గదియింపుము నియతిఁ బుత్ర! కడుగాఢముగన్. |
180 |
| తే. |
ఇంద్రియంబుల నాఱింటి నిట్లు విషయ | ములకు నొలయక యుండంగ నిలువరించి’ తలఁపు లుడిగి, తేనియఁ బ్రమదమున నాను | భంగిఁ దృప్తుఁడవై యుందు పరముఁ గాంతు.’ |
181 |
| వ. | అని వెండియు. | 182 |
| చ. |
‘తన కుసుమంబులన్ ఫలవితానము మూర్కొన నాన మ్రాను నే రని క్రియఁ గాన నేరదు పరం బగు తత్త్వము నైజభంగి వి న్ననువున నంతరాత్మ గను నైష్ఠికతం గను; మింతవట్టుఁ బా మెనసిన తోలు వాయుక్రియ నీవు దొఱంగుదు పాపపుంజమున్. |
183 |
| వ. | ఇవ్విధంబున శాంతి నొంది యవ్యక్త సంభవయు, సంకల్పకూలయుఁ, గ్రోధపంకయు, నింద్రియగ్రాహయుఁ, గామభుజంగయు, మోహ తృణచ్ఛన్నయు, సంసారసాగర గామినియు నై ఘోరప్రకార యగుచు నకృతాత్ములకుం గడవరాని యట్టి లోభవాహిని సత్యతీర్థంబున నుత్తరించి. | 184 |
| క. |
సుత! నీవు సుప్రసన్నా | త్మతఁ బొంది నగాగ్రగతుఁడు మహివారలఁ జూ చుతెఱంగున నీ భూత | ప్రతతిం గనుఁగొనుచునుండు పరితృప్తుఁడవై. |
185 |
| క. |
శాంతము ధర్మప్రచయం | బంతటికి విశిష్ట మిమ్మహావిద్య మదీ యాంతఃకరణము సాక్షిగ | నెంతయు సంప్రీతి నీకు నిచ్చితిఁ బుత్రా!’ |
186 |
| వ. | అని యి ట్లుపదేశించి పరమసంవిదేకాయనుండగు కృష్ణద్వైపాయనుండు కృతార్థీభూత చేతస్కుండగు నందను ప్రతిపత్తికి నభినందన విశేషంబుగా నధ్యాత్మవిద్యా విలాస విషయంబులగు వాక్యంబులు మఱియు ననుగ్రహించె; వానిం జెప్పెద. | 187 |
| క. |
‘వేదములుఁ దదంగములు స | మాదరమునఁ జదివినను సుయజమానత్వా పాదకుఁ డైనను బ్రాహ్మణ | తాదశ దక్కునె ప్రశాంతిఁ దక్కఁ గుమారా! |
188 |
| క. |
ఒరులకుఁ దా వెఱవక తన | కొరులు వెఱవకుండునట్టి యొప్పెడు సమతం దిరమైన నడవడిం గల | పరిణతచిత్తుండు సూవె బ్రాహ్మణుఁ డనఘా! |
189 |
| తే. |
బంధనంబులలో నెల్లఁ బరమబంధ | నంబు గామంబు; దద్వర్జనమున నాత్మ యభ్రపటలంబు వాసిన యమృతకిరణ | పూర్ణమండలమును బోలెఁ బొలుచు ననఘ! |
190 |
| క. |
పరతత్త్వోపాసన త | త్పరుఁడై సంక్షీణకామభావత నున్నం బురుషు సుఖ మొందు వృద్ధిం | బొరయుచు వపు వమృతకిరణుఁ బొందినమాడ్కిన్. |
191 |
| క. |
పొరిఁ బొరి భూతముల గుణో | త్కర మవిశేషాన్వితముగఁ గనుఁగొను సంవి త్పర దుఃఖంబు సుఖముచే | విరియుఁ దరణిచేతఁ దమము విరిసిన భంగిన్. |
192 |
| ఆ. |
తనది యనక యేమి ధనమునఁ బ్రియమందు, | నెద్ది గుడువకుండ నెసఁగుఁ దృప్తి, యిచ్చఁ బొందులేక యెయ్యది బలమిచ్చు, | దానిఁ గనుట శ్రుతుల తలఁపు గనుట. |
193 |
| క. |
పరిపాటిఁ గర్మ మెడలఁగ | వరుస గుణము లడఁగ విషయవర్గము పొందుం బొరయక యుండెడు బ్రాహ్మణు | జరయును మృత్యువును బొరయఁజాలవు వత్సా! |
194 |
| తే. |
అనఘ! దేహంబుకంటె వేఱయిన దేహి | సూక్ష్మ రూపము శాస్త్రోక్త సుకృతములఁ బ్ర శాంతజనములు గాంతురు సాధనముల | నాదరింపరు దర్శనానంతరమున. |
195 |
| క. |
ఇనురూపము జలములఁ దోఁ | చిన క్రియ బుద్ధిఁ బ్రతిబింబసిద్ధత వెలుఁగొం దిన యాత్మను బరమార్థతఁ | గను సత్త్వస్థులకు నిజము గానంగ నగున్. |
196 |
| క. |
అనఘ! దివసంబు రాత్రియు | ననునవి భానునకు లేని యట్టులు సతతం బును బరమయోగయుతుఁ డగు | మునికి వివేకావివేకములు లేకుండున్. |
197 |
| క. |
కరణంబులు దొడరిన ని | ష్కరణత నున్నను శమంబు గల యోగికి సు స్థిర మగు సమాధి యని ముని | వర శాండిల్యుండు శిష్యవరులకుఁ జెప్పెన్. |
198 |
| సీ. |
విను మోహబీజ సంజనితంబు గామద్రు | మంబు ప్రమాదజలంబు దనకుఁ బరిషేచనంబుగఁ బెరుఁగు నజ్ఞాన స్థి | రాధారకలితమై యందసూయ పత్త్ర సంపద యది చిత్ర తరంబు మా | నస్కంధ దృఢత నున్నతి వహించు శోక శాఖంబు ననేక చింతోప శా | ఖంబు బురాకృత కర్మ సార |
|
| తే. |
ఘనముఁ దృష్ణాలతా పరిగతము నగుచుఁ | బొలుచుఁ దత్ఫలములకు లుబ్ధులు గడంగి ప్రాఁకి పడుదురు విడుపు శస్త్రముగ నది వి | ఖండితము సేసి బుధుఁడు దుఃఖములఁ దొఱఁగు. |
199 |
| సీ. |
పురము శరీరంబు; బుద్ధి తత్స్వా మిని; | సర్వార్థచింతన సచివపదవి నడచుచు నుండు మనంబు శబ్దాద్యంబు | లై చెల్లు విషయంబులైదుఁ దగు పు రోహితవర్గంబు శ్రోత్రాదులగు నింద్రి | యంబులు పౌరజనంబు; లిట్లు పరఁగెడు రాజ్యంబు పరిభోగమునకు దూ | షకులైన దొరలు రజస్తమములు |
|
| తే. |
వారి కఱపులఁ బడు బుద్ధి నేరకుండి | మనసుతోడ వేర్పడినఁ దానును మనంబు నేకముఖతఁ గార్యము సూచునేని దుష్టు | లడఁగుదురు భోగ మవ్యయ మగుఁ గుమార!’ |
200 |
| వ. | అని చెప్పె ననిన విని పాండవాగ్రజుండు భీష్మునితోఁ ‘గార్యబలంబును, వీర్యబలంబును, మనోబలంబునుం గలుగు నుత్తమక్షితిపతు లనేకు లీకయ్యంబున మృతులైరి. నిజప్రాణంబునకు నొక్కరుండు నొడయండు లేక తక్కె ; మృత్యువనునది యెయ్యది? యేమిటం గలిగె? నెట్లు ప్రజల సంహరించు? నెఱింగింపవే!’ యనుటయు నతం డిట్లనియె. | 201 |