| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
చలనంబు లేక జాజలి తపోనిష్ఠ నా | సీనుఁడై యుండఁ బిచ్చికలు గూఁడు గావించెఁ దన్మస్తకంబున; నమ్మిథు | నము గారణముగ నండములు గలిగి పిల్లలై వర్తించి యెల్లెడ కెరగొన | నరుగుచు మరలుచు నవియు నవియు నగ్గూఁట వసియింప, నతఁడు దయాళుఁ డై | వానిఁ జోపక యుండి వత్స! తనదు |
|
| తే. |
నియతి కెద మెచ్చి యీధర్మనిష్ఠ యెందుఁ | గలదె? యనుటయు మ్రోసె నాకాశవాణి; ధర్మపరుఁ డైన యత్తులాధారుఁ డింత | యాడఁ డిట్లాడ నే లని యద్భుతముగ. |
224 |
| వ. | అట్లు మ్రోసిన విని వెఱఁగుపడి యత్తులాధారుం గాన వలయు నని తలంచినం ‘దులాధారుండు వారాణసీపురంబున నున్నవాఁ’ డను వాక్యంబును నంబరంబున వీతెంచె; నమ్మునియును మత్సరభరితుఁ డగుచు నప్పురంబునకుం బోయి జనసంపూజ్య వాణిజ్యంబునం బ్రవర్తిల్లు నతనిం గాంచిన నతండు సముచితసత్కారం బాచరించి యిట్లనియె. | 225 |
| తే. |
‘పిచ్చికలు గూఁడు శిరమునఁ బెట్టి తారుఁ | బిల్లలును సుఖలీల వర్తిల్లుచుండఁ జిత్తవికృతి లే కెట్టులు సేయుదయ్య | తపము? సంభావనీయవర్తనుఁడ వీవు.’ |
226 |
| వ. | అనినఁ దదీయబోధంబునకు విస్మయంబందుచు విప్రోత్తముండు ‘నీవు వణిగ్వర్తనంబున నుండ నెవ్విధం బగు ధర్మంబున నివ్విశేషంబు గలిగె?’ ననవుడు నతం డతని కిట్లనియె. | 227 |
| సీ. |
‘విలుచుట నమ్ముట నొలయదు వంచన | యర్హలాభంబున యనుభవింతు; సరి సిద్ధ్యసిద్ధులు; సమలోష్టకాంచన | మై యుండు మనసు; నిందాభినుతులు హింసయు నాత్మ ప్రశంసయు లేవు; భూ | తంబులయం దెల్ల దయ ఘటిల్లు; నభయదక్షిణ మగు నంచిత సత్య యా | గము సెల్లుఁ; గోర భోగమును యశము; |
|
| తే. |
నెవ్వరికి మేలు సేసిన నింత సేసి | నాఁడ ననుబుద్ధి మమత యెన్నండు నాకుఁ గలుగ దేమిట నేనియు వలపునొల్ల | మియును బుట్టదు; నిక్క మింతయు మహాత్మ! |
228 |
| క. |
లోకం బెల్లను నేఁ జి | త్రాకారము గాఁగఁ జూతు; నట్లగుట మనం బేకార్యములం దగులదు | కోకనద దళాంబుబిందుగుణ మొనరంగన్. |
229 |
| వ. | అనిన విని జాజలి తులాధారున కిట్లనియె. | 230 |
| తే. |
‘తపములును యజ్ఞములు నీవు ధర్మములుగఁ | బలుకవైతివి యార్యసంభావనీయ పదములగు కర్మములలోనఁ బరిగణింపఁ | బడవొకో వేదశాస్త్రతత్పరులచేత.’ |
231 |
| చ. |
అనవుడు నాతఁ డిట్లను ‘నహంకృతి యుక్తముఁ గామసంశ్రితం బును నగునేని నట్టి తపమున్, ఫలకాంక్ష యొనర్చు యజ్ఞమున్, ఘనతరలోభవృత్తి యను కాన్పున మెచ్చదు దేవకోటి; వా న నగు గతాగతంపు భ్రమణంబులు గీళ్ళులు గాక మేలులే? |
232 |
| ఆ. |
నిత్యతృప్తుఁ డైన సత్యయజ్ఞుని యెడ | దేవతలును నధిక తృప్తు లగుదు; రమరతృప్తివలన నవ్యయానందంబు | సంఘటిల్లుఁ జూవె సంయమీంద్ర! |
233 |
| తే. |
అనిన జాజలి ‘యట్లేని ననఘ! నీవు | కర్మ ముడుగమి కెయ్యది కారణంబు? మాకు నెఱిఁగింపు’ మనుటయు మహితబోధుఁ | డగు తులాధారుఁ డిట్లను నతనితోడ. |
234 |
| క. |
‘ధర్మారాముఁడు సంతత | ధర్మసఖుఁడునై యసంగతా నిష్ఠ మతిన్ నిర్మలుఁడగు వానికి ని | ష్కర్మత్వానందసిద్ధి గలుగు మునీంద్రా! |
235 |
| ఆ. |
నగములెల్లఁ బుణ్యనగములు, నదులెల్లఁ | బుణ్యనదులు వినుము భూసురాగ్ర గణ్య! యకలుషం బకర్దమం బనఁజాలు | నాత్మ తీర్థమెఱుఁగు నకలుషునకు. |
236 |
| క. |
కారణములవలనఁ గృత | ప్రారంభంబైన కర్మ మంచితగతికిం గారణమే కర్తవ్య | త్వారబ్ధ క్రియలయట్టు లనఘచరిత్రా!’ |
237 |
| వ. | అని చెప్పి యంత నిలువక. | 238 |
| క. |
‘విను మంచివారిచే నై | నను నితరుల చేతనేని నా యెఱిఁగిన యీ యను వొప్పదొ మేలో యను | ననుమానము వాపుదమె మహాధర్మనిధీ! |
239 |
| వ. | అప్పని మనచేత నయ్యెడి; నీవు దండ్రివోలెం బెనిచిన మరగి నీతో నరుగుదెంచి నీశిరంబు చక్కటిచదలం జేరువం బొలయు నిప్పులుఁ గులం బిలిచి కరంబుల ధరియించి యుపలాలింపుమా!’ యనుటయు జాజలి వానిం బిలిచిన నవి దివిన నిలిచి యతనితో నిట్లనియె. | 240 |
| చ. |
‘మునివర! ధర్మదేవత మమున్ బనుపన్ నిను నారయంగ వ చ్చిన భటసంఘ మేము; విను చెప్పెద మీసు గలంక పోరితం బను నివి మత్సరంబు గల యట్టిమనంబునఁ బుట్టు; హింస వీ నన జనియించు; సంయమిజనంబు విమత్సరమైన మేలగున్. |
241 |
| తే. |
స్పర్ధ సద్ధర్మమునకు నాశని సుధర్మ | నాశమునఁ జేసి నరుఁడు వినష్టభావ మొందుఁ గావున సంస్పర్ధ యుడుగవలయు | నిర్మలశ్రద్ధ గైకొని నిపుణుఁ డనఘ! |
242 |
| క. |
శ్రద్ధ ఋషితనయ! సాత్త్వికి | బోద్ధ వ్యావాప్తి శుభముఁ బొనరించు మన శ్శుద్ధిస్వరూప దానిఁ బ్ర | బుద్ధుఁడు వాటించుఁజూవె పురుషాత్మికఁగన్. |
243 |
| క. |
అమరులు విమలశ్రద్ధా | సమేతములు గాని తాపసత్వముఁ గ్రతుమ త్త్వము గైకొన రా సువిశే | షముగలిగిన మెత్తు రది ప్రశస్తం బనఘా! |
244 |
| క. |
విను మునివర! వాగ్వృ త్తియు | మనః ప్రవర్తనముఁ గాచు మహితశ్రద్ధా ధనసంపద; శ్రద్ధ యనం | జనునది జీవాత్మ సుప్రసన్నత సుమ్మీ!’ |
245 |