| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| క. |
‘పురుషుం డేమిటఁ బాపా | చరణమునకుఁ జొచ్చు? ధర్మచర్యకు మూలం బరయఁగ నెయ్యది? రెంటిం | బొరయం డెద్దాన? నెట్లు వొందును ముక్తిన్?’ |
363 |
| వ. | అని యడిగిన నతనికి భీష్ముం డిట్లనియె. | 364 |
| సీ. |
‘గంధరసాదుల కాంక్ష లోభము మోహ | మును దెచ్చు; నద్దోషమునకు మనసు లోనైన ధర్మవిలోపంబు వాటిల్లు; | దానఁ బాపము సేయు తలఁపు లొదవు; బ్రజ్ఞ నక్కీడులు భావించి సద్గోష్ఠిఁ | బరఁగంగ విషయతత్పరత మాను; నది ధర్మబుద్ధికి నాలవాలం బగు; | ధర్మాచరణములఁ దనివి సనక |
|
| తే. |
హృద్గత ద్వంద్వముల నెల్ల నెడల విడుచు | ననఘ! యనపాయ మగు నుపాయమున ముక్తి వడయుఁ బదపడి; యేను నీయడిగినంత | వట్టుఁ దెలిపితి ధర్మనిర్వాహి వగుము.’ |
365 |
| తే. |
అనుడు ననపాయ మగు నుపాయం బనంగఁ | జెప్పి తొక్కటి; మోక్షంబుఁ జెందుతెఱఁగు దానిఁ దెలియంగ నెఱిఁగింపవే నరేంద్ర | ముఖ్య!’ యనియె నక్కురువంశముఖ్యుఁ డధిప! |
366 |
| వ. | అనుటయు నమ్మహీకాంతునకు శాంతనవుం డిట్లనియె. | 367 |
| క. |
‘వినుము ఘటము సేయుట సా | ధనములు లేకున్న నగునె ధరణిప! పూర్వాం బునిధికిఁ జను మార్గ మపర | వనరాశికిఁ జనునె? వెరవు వలయుం దెలియన్. |
368 |
| వ. | అడిగి మేలు సేసి తాకర్ణింపుము. | 369 |
| సీ. |
క్షమఁ గ్రోధ, మకృత సంకల్పతఁ గామంబు, | చిరనిద్ర సత్త్వసంసేవనమున గాఢధైర్యమున రాగద్వేషములు, భయ | మప్రమాదమున, మోహంబు భ్రమము వినివర్తనాభ్యాసమున రోగములు నుప | ద్రవములు హితము మితంబు గాల యోజితంబును నగు భోజనంబున జీవ | సందర్శనమున నిశ్శ్వాస మఖిల |
|
| తే. |
విషయములు నంతవిరసతా వేక్షణమున | నిత్యసంతోషమున లోభనిరతి కృప న ధర్మ ముచిత కృతావేక్ష ధర్మ మవులఁ | ద్రోవనేర్చుట ముక్తికిఁ ద్రోవ యధిప! |
370 |
| తే. |
తాను గ్రోధాదు లెడలించుఁగాని ముక్తిఁ | దెచ్చి యీ; దొకభంగి ముక్తికిఁ బథంబు నగుట ననపాయ మగు నుపాయం బనంగ | వలసె నీ నేర్పు పే రిందువంశవర్య! |
371 |
| చ. |
అనుడు నజాతశత్రుఁ ‘డిటు లన్నలు దమ్ములు లోనుగాఁగఁ దృ ష్ణ నఖిలబంధుకోటులనుఁ జంపెడు తెం పొలసెన్ మహాత్మ! యే యనువునఁ దృష్ణ త్రోపువడునట్టి సమంచితచిత్త ధర్మముం బనుపఱుపంగ జాలు కలభాషణ పంక్తి ననుగ్రహింపవే!’ |
372 |
| క. |
అనుటయు దేవవ్రతుఁ డ | మ్మనుజపతికి నిట్టు లనియె ‘మాండవ్యునితో జనకుఁడు సెప్పిన మాటలు | విను; మవి తృష్ణ నడఁగించు వెరవు నొనర్చున్. |
373 |