| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | తోఁచిన నత్యంతభక్తిం బ్రపత్తిసేసి సూర్యప్రసాదలబ్ధయుఁ బంచ దశశాఖా సమన్వితయు నిఖిలోత్తర సంహితయు నగు నయ్యజుర్వచోమూర్తి ధరియించి శిష్యులం బరిగ్రహించి వారల నధ్యయనంబు సేయించుచు నివ్వాఙ్మయ బ్రహ్మంబునందు వేదితవ్యం బెయ్యదియో యని విచారింప విరోచనుమహానుభావంబునం జేసి యోగసాంఖ్య రూపోపాయ ప్రకారంబు దోఁచెఁ బదంపడి తదుపేయంబగు వేదవేద్యంబును నద్దేవుని కరుణావిశేషంబునం బ్రతిభాసించెఁ గొండొక కాలంబునకు విశ్వావసుం డను గంధర్వేశ్వరుండు నాకడకుం జనుదెంచి తన్నెఱింగించి యేనుజేయు నతిథిపూజనం బత్యాదరంబునఁ గైకొని ‘విశ్వావిశ్వంబులు మిత్రావరుణులు జ్ఞానజ్ఞేయంబులుఁ దపోఽతపంబులు సూర్యాతిసూర్యులు విద్యావిద్యలు వేద్యావేద్యంబులుం జలాచలంబులు ననునవి వేదోదితంబులు వానిం దేటపఱుపవే’ యని యడిగిన నవహితుండవై వినుమని పలికి - విశ్వంబు భూతభవ్యభవత్కరం బగు నవ్యక్తం బవ్యక్తనామ ప్రకృతి య; విశ్వంబు నిర్గుణుండగు పురుషుండు; మిత్రావరుణులు పురుష ప్రకృతులు, జ్ఞానజ్ఞేయంబులుఁ దపోఽతపంబులు సూర్యాతిసూర్యులును ప్రకృతిపురుషుల కానెఱుంగుము. విద్యావిద్యా వేద్యావేద్యా చలచలంబులను శబ్దంబులు వరుసం బురుషునకుం బ్రకృతికిని వాచకంబు లని చెప్పి వెండియు నిట్లనియె. | 140 |
| ఆ. |
అజము లవ్రణంబు లక్షయంబు లతీంద్రి | యములు ప్రకృతి పురుషు లనఁగఁ బరఁగు రెండు తత్త్వములు నఖండరూపతఁ బొంది | నపుడు ప్రకృతి పురుషునట్ల కాన. |
141 |
| వ. | అని తెలిపి మఱియును. | 142 |
| క. |
విను వేదవేద్యము నెఱుం | గని యాతని వేదపాఠకలనంబు సుధీ ధన! వేదభారవహనం | బనఁజను నింతియ నిరర్థకాయాసంబై. |
143 |
| ఆ. |
క్షరము నక్షరంబుఁ గానంగఁ బోలు వే | దార్థచింతనమున నమ్మిథునము నందుఁ బూర్వ మురివి యపరంబు సేపట్టి | నిలువవలయు నధికనిష్ఠ గలిగి. |
144 |
| తే. |
అక్షరం బగు పంచవింశాఖ్య తత్త్వ | తత్పరత నున్నఁ గేవలత్వము ఘటిల్లు వినుము కేవలత్వమున షడ్వింశదర్శ | నంబు పురుషున కొదవి తన్మయత గలుగు. |
145 |
| క. |
పురుషుని నవ్యక్తము రెం | డు రూపులుగఁ జూచు టొప్పెడు తెఱం గతఁడుం బురుషోత్తముండు నరయఁగ | నిరువురుగా రతఁడ యాతఁ డిది నిజము సుమీ. |
146 |
| క. |
పురుషోత్తమ షడ్వింశక | పరమేశ్వర నామకములు వరఁగును విను మా పరమునకు నదియ నిష్కళ | నిరంజనానంద బోధనిత్యం బనఘా!’ |
147 |
| వ. | అని చెప్పిన విని విశ్వావసుండు ‘పంచవింశకతత్త్వంబునకుం బరంబు గలుగుటయు నది రూపింప నేకంబగుటయు నారద జైగీషవ్య దేవల కపిలశుక సుమంత పైలాదులైన పరమమునుల గోష్ఠీ విశేషంబుల విందు. వినినను నిస్సంశయంబగు బోధం బుదితంబు గామి నిన్నాశ్రయించితి, నీవు సంయమిలోక సురలోక బ్రహ్మలోక ప్రఖ్యాత ప్రజ్ఞాన సంభావనీయుండవు. మదీయ సందేహాపనయంబు సేయవే’ యనుటయు నారదాయత్త చిత్తుండనై. | 148 |
| క. |
మునిగోష్ఠివలని కొఱఁతయె | విను భవదీయాంతరంగవృత్తి కలుషయై నిను సంశయాత్మునింగా | నొనరించుచు నున్నయది సముజ్జ్వలతేజా! |
149 |
| వ. | ప్రసన్నైకాగ్రచిత్తుండవై యాకర్ణింపు మని యిట్లంటి. | 150 |
| క. |
‘పురుషున కవ్యక్త పరి | స్ఫురణ శబలవృత్తి గలుగఁ బోయిన నతనిం బురుషోత్తముఁ డనరు జనన | మరణాది వికారయుక్తి మాటయి యజ్ఞుల్. |
151 |
| వ. | అని వెండియు. | 152 |
| తే. |
ప్రకృతి పురుషునిఁ గానదు, ప్రకృతిఁ గనుచు | నునికిఁ బురుషుండు పరమునిఁ గనుట లేక యుండుఁ, గనుఁ దద్ద్వయముఁ బరముండు, పరమ | వీక్షణము పురుషున కగు వెరవు వినుము. |
153 |
| క. |
స్నేహసహవాసములు స | మ్మోహముఁ దలకొలుపఁ గాలమున మునుఁగుచు గా ఢాహంకారమమత్వము | లీహఁ బెనుపఁ బ్రకృతిఁ బురుషుఁ డే ననుచుండున్. |
154 |
| క. |
అది లెస్సగ విడిచి ప్రకృతి | కుదకనిభాకలనమును ఝషోపమ తనకుం బదిలుఁడయి చూడనేర్చిన | విదితం బగు దానితోడి వేర్పా టనఘా! |
155 |
| ఆ. |
ప్రకృతి దొఱఁగి తన్నుఁ బన్నుగాఁ జూచు వి | వేక దృఢతఁ బంచవింశకుండు సంగరహితమైన షడ్వింశపదము ని | స్సంశయముగఁ గాంచు వంశవర్య! |
156 |
| క. |
జననజరామృత్యు భయం | బున యోగసమేతసాంఖ్యముం దిరముగ నూఁ దిన యతులు నిర్మమత్వం | బునఁ బడయుదు రప్పరంబు పొం దచలముగన్. |
157 |
| వ. | అపునరావృత్తిపదం బగు నప్పదంబు సూవె పరం’ బని చెప్పి వెండియు. | 158 |
| క. |
నెట్టన చూడమి నయ్యెడు | నట్టిది యొకచూపునం బరానందంబున్ గట్టిగఁ జేయఁగ వికృతులు | పుట్టక పురుషుండు తత్ప్రబోధాత్ముఁడగున్. |
159 |
| క. |
పురుషోత్తముండుఁ బురుషుఁడు | నిరువు రగుట గలదు గలిగెనేనియుఁ బురుషుం బురుషోత్తమునందుఁ గలపు | వెరవున నేకత్వమహిమ విజ్ఞాతమగున్. |
160 |
| క. |
ఇది విజ్ఞానము కృత్యము | తుది విజ్ఞానాత్ముఁడు నగు, దుర్లభము ప్రశాం తి దశాహీనాత్ముల క | ప్పదమది, మోక్షంబు మమత వాసినఁ గల్గున్.’ |
161 |
| వ. | అని యుపదేశించిన విని విశ్వావసుండు ప్రమోదంబు నొంది ‘పథ్యంబును హితంబును దథ్యంబును నగుతెఱం గనుగ్రహించితి భవదీయ ప్రసాదంబునం గలంకదేఱి నిర్మలుండ నయితి’ నని పలికి సభక్తికంబుగా బ్రదక్షిణంబును ప్రణామంబునుం జేసి నిజస్థానంబున కరిగె’ నని చెప్పి యాజ్ఞవల్క్య మునినాథుండు జనకజననాథుతో వెండియు నిట్లనియె. | 162 |
| క. |
‘మానవపతిసత్తమ! యీ | జ్ఞానము బ్రహ్మాది దివిజ సంయమిమత మె వ్వానికి మోక్షంబునకుం | దాన తెరువు - తెరువు లొండ్లు దలఁపం గలవే? |
163 |
| ఆ. |
జ్ఞానమునన కాని జన్మజరామృత్యు | వుల జయించునట్టి యలఘు మోక్ష పదము గల్గ నేర దది కారణముగ సు | జ్ఞాన మెల్లభంగి సాధ్యతమము. |
164 |
| క. |
గురుఁ డెవ్వఁడైననగు ని | వ్వెర వుపదేశించువాఁడ వేల్పుగ శ్రద్ధా పరమతి గావలయు జనన | మరణంబులు శ్రద్ధ లేని మనుజునిఁ బొదువున్. |
165 |
| క. |
విను మజ్ఞానంబునఁ గ | ర్మనిరూఢత గలుగు దాన మలఁగవు జననం బును మరణము సమ్యక్ జ్ఞా | న నిత్యుఁ డగువాఁడు మోక్షణముఁ జుల్కఁ గనున్. |
166 |
| క. |
ఈ వెర వూఁదుము నృప! నను | నీ వడిగిన యంతయును వినిశ్చయకృతి సం భావితముగాఁగఁ జెప్పితిఁ | బోవిడువుము శోకమోహమును, నిలుపు ధృతిన్.’ |
167 |
| క. |
అని చెప్పిన ముదితుండై | జనకుఁడు శోకాదిభావ సంగవిరహితం బును బ్రహ్మధ్యానపరం | బును నగు చిత్తంబుతోడ ముదితుం డగుచున్. |
168 |
| వ. | ఉండెం బాండవాగ్రజా! యీ యాజ్ఞవల్క్యమునివరు వాక్యరూపంబునన యే నిమ్మహనీయజ్ఞానంబు నీ కుపదేశించితి’ నని చెప్పి భీష్ముఁ డతనితో ‘నీ విందుల తాత్పర్యంబు గలిగి యార్యగర్హితంబులగు శోకమోహాదిప్రాకృతభావంబులం దొఱంగి సుఖి వగు’ మనిన విని య క్కౌంతేయాగ్రజుండు సంతుష్టాంతరంగుండై య గ్గాంగేయునకుం బ్రణమిల్లి ‘గృహస్థ ధర్మంబు పరిత్యజింపక మోక్షంబు వడయుట గలుగనోపునే?’ మదీయ చిత్తంబు సంశయాయత్తం బగుచుండు; నిక్కాలుష్యంబు వాపవే’ యని యభ్యర్థించిన నతండు ‘జనకసులభాసంవాదం బను నితిహాసంబు గలుగు దాన నేతత్సంశయంబు వాయు దానిం జెప్పెద విను’ మని పలికి యతని కిట్లనియె. | 169 |