| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
చంచరీకావళి ఝంకృతుల్ గల్పించు | కర్ణఝళంఝళాకలనములును ధరణీపరాగసంతానంబుఁ గబళించు | కరశీకరచ్ఛటాస్ఫురణములును ఘంటికాటంకృతికాంతి సంభావించు | నిర్భరబృంహితనిస్వనములు నంబరభాగంబు నల్పంబు గావించు | నున్నతగాత్రసముద్ధతులును |
|
| తే. |
జారు భీషణరేఖలు భూరిమద భ | రాభిరామ యానంబులు నాహవోచి తోగ్ర కల్పనాభంగులు నుల్లసిల్లఁ | గరులు ధాత్రీతలంబు గ్రక్కదల నడచె. |
102 |
| చ. |
గతిబహుతాలసత్ఖురవిఘట్టితమేదిని జీవితేశ క ల్పిత నఖరేఖలం జెలువు పెంపు వహించు పురంధ్రిఁ బోల ను ద్ధతముఖబంధురాంగలలితంబులు నూర్జితకింకిణీఝణ త్కృతి పటుహేషలుం దగ నుదీర్ణములై నడచెం దురంగముల్. |
103 |
| సీ. |
మీఱిన యుబ్బున మీఁదికిఁ గాళులు | సాఁచు రథ్యంబుల చటులతయును లలిఁ బెండ్లికినిఁ బోవు చెలువున విలసిల్లు | సూతజనంబు విస్ఫూర్జితంబు జతనంబు మేలిమిఁ జారుఘోరములగు | నవయవంబుల విభవాతిశయము బిరుదుల నుద్భటస్ఫురణంబులై క్రాలు | కేతనంబుల సముద్ద్యోతితంబు |
|
| తే. |
సొంపు మిగులంగ జోదుల యంపపొదుల | దీప్తులును లేఁత నవ్వుల దీధితులును హారిరశ్ములుఁ గీడ్పెర నగుచు వెలుఁగఁ | దేరు లరిగె నుద్దామతఁ గౌరవేంద్ర! |
104 |
| చ. |
కడఁకయు లావునుం గరఁగి గట్టిగఁ గూర్చి యొనర్చినట్టి పే రొడళులఁ దాల్మియుం గడిమియుం గలయం బరికించి యందు నే ర్పిడుకొని గాఢభంగి రచియించిన చందము నెమ్మనంబులం గడుఁ జెలువొంద నుబ్బి వడిఁ గాల్బలమేఁగెఁ గరం బుదగ్రతన్. |
105 |
| వ. | ఇట్లు కురుబలంబు సమరతలంబు చేరం బోవునంతం బాండవబలంబును జనుదెంచె ననిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె. | 106 |
| తే. |
‘సురనదీ సుతుచావును గురుని చావుఁ | గర్ణుచావును వినిన నా కర్ణములకు శల్యుచావు, దుర్యోధనుచావుఁ జెప్పి, | యధికతరముగ సంతోష మావహింపు. |
107 |
| క. |
అమ్మద్రవిభుని ధర్మజుఁ | డెమ్మెయిఁ బరిమార్చెఁ గౌరవేంద్రుని భీముం డెమ్మెయి గీటడఁచె రణం | బెమ్మెయిఁ బరిపాటిఁ జెల్లె? నేర్పడఁ జెపుమా!’ |
108 |
| వ. | అనుటయు సంజయుం డమ్మనుజపతి కిట్లను ‘వగచుకొలంది కడచనియె; ధీరుండవై వార్త లవధరింపుము. | 109 |
| క. |
గంగాసుతగురుకర్ణుల | సంగరమునఁ బాండుసుతులు సంపుట గన్నా రం గనియు నీ తనయు లా | సం గూరిరి వారిఁ జంపు శల్యుం డనుచున్. |
110 |
| వ. | దుర్యోధనుండు దిక్కుమాలి యుండియు నడియాసం జేసి తన్ను సంపన్నునిం గాఁ దలంచుచు. | 111 |
| చ. |
అనుజులుఁ దాను శల్యునిఁ బ్రియాతిశయంబునఁ జేరఁ బోవ నా యన మును కర్ణుఁ డర్జున శరాహతిఁ గూలిన నుబ్బి భీముఁ డా ర్చిన నడలొంది తల్లడిలు చిత్తము లూఱట నొంద వారలం గనుఁగొని పల్కులన్ శ్రుతిసుఖం బొనరించె నుదగ్రమూర్తియై. |
112 |
| వ. | ఇట్లు సమరోత్సాహ సమగ్రుండయిన మద్రపతి సర్వతోభద్ర వ్యూహంబు వన్నించె నందు ముఖంబున మద్రపతి గర్ణపుత్ర ప్రముఖ పరివృతుండై తాను నిలిచె. వలపట శకయవనసమేతుండై కృపాచార్యుండును దాఁపటఁ ద్రిగర్తసహితుండై కృతవర్మయు వెనుకఁ గాంభోజసహాయుండై యశ్వత్థామయు నడుమఁ గురువీర పరిరక్షితుండయి కౌరవేశ్వరుండును నతని ముందటఁ గరిఘటాగ్ర భాగవర్తియై బహుల చతురంగంబులతోడ శకునియు నిలుచునట్లుగా నొనర్చి పేర్చి యురవణించె. నంతక మున్ను పాండవులు మూఁడు మొగంబులుగా మోహరించిరి. ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకు లగ్రేసరులుగా భీమార్జును లగ్రజునగ్ర భాగంబున శోభిల్లి సీతారూప విద్యోతితంబైన శల్యుకేతనంబు సూచి త్రోచి నడచి’ రనిన విని ధృతరాష్ట్రుం డప్పటికి మనకుఁ బాండవులకుం గల సేనాంగంబుల కొలంది యెఱింగింపు’ మనవుడు సంజయుం డా జనపతికిట్లను మనకుఁ బదునొకండు వేలు రథంబులును బదివేలు నేడు నూఱు గజంబులును రెండు లక్షలు హయంబులును మూఁడు కోట్లు పదాతులును వారికి నాఱువేలు రథంబులును మూఁడువే లేనుంగులును లక్ష గుఱ్ఱంబులును కోటి కాల్బలంబులును గలిగియుండె నయ్యొడ్డనంబు లొండొంటి గెలుచు నగ్గలిక డగ్గరియె నట్టియెడ. | 113 |
| ఉ. |
ఒండొరులన్ జయించుమతి నుద్భటలీలలఁ జాల నొప్పి య ప్పాండవ కౌరవుల్ పెనఁగు భంగిఁ గనుంగొను వేడ్క నొక్కొ? యీ తండు మహాద్రి నెక్కె ననఁ దద్దయుఁ జెన్నగు బింబకాంతి న ర్కుం డభిరాముఁడై పొడుపు గొండపయిన్ వెలుఁగొందెఁ జూడఁగన్. |
114 |
| చ. |
అరసి యనాగతం బెఱుఁగునట్టి మనంబులు గల్గు పాండుభూ వరసుతబంధుమిత్రకురువర్గ సుహృజ్జనకోటు లత్తఱిం బొరసె నతిప్రమోదమును భూరివిషాదమునాఁగ నంబుజో త్కరము వికాసమయ్యెఁ గుముదంబులు మీలన మొందె నెంతయున్. |
115 |
| సీ. |
కుంజరనికురుంబకుంభస్థలీసంగ | సిందూరరుచులతోఁ జెలిమి చేసి కేతనవ్రాతసంకీలితమాణిక్య | రశ్ముల గెడ విహారంబు సలిపి సైనికనికరవక్షఃస్థలపరిలిప్త | కాశ్మీర దీప్తులఁ గౌఁగిలించి దండనాథోత్కరచండభావోద్వృత్త | చక్షుఃప్రభలుఁ దారు సరసమాడి |
|
| తే. |
యంశుజాలంబు లుభయసైన్యంబులందుఁ | బరఁగి బహువిధశస్త్రాస్త్రకిరణతతుల బెరసి పరభాగలక్ష్మి దీపించి మెఱయ | బాల్యరమణీయుఁడగు చిత్రభానుఁ డొప్పె. |
116 |