| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | ఇట్లు శక్తి బెడిదంపుటు రవడి నుచ్చిపోయిన. | 284 |
| చ. |
క్షతమున ముక్కునం జెవులఁ గన్నుల నొల్కెడు రక్త మంగ మా ప్లుతముగఁ జేయఁగా నతఁడు బోరగిలంబడియెన్ ధరం గర ద్వితయము సాఁచి ధర్మజునిదిక్కు శిరంబుగ వజ్రదారుణా హతిఁ బడు భూరిభూధరమహత్తరశృంగముభంగి భూవరా! |
285 |
| ఆ. |
భూమిమీఁద నిట్లు బోరగిలంబడి | మద్రనాథుఁ డొప్పె మానవేంద్ర! లేమయురమునందు లీలమై వ్రాలిన | ప్రాణనాథుఁ బోల్పఁ బట్టు గాఁగ. |
286 |
| ఆ. |
ధర్మసంగరమున ధర్మజుచేఁ జచ్చి | పొలిచెఁ జూడ మద్రభూవిభుండు విధియుతంబు గాఁగ వేలిచి విడిచిన | నాఱి యున్నయగ్ని ననుకరించి. |
287 |
| మ. |
కని శల్యానుజుఁ డేచి ధర్మసుతు నుగ్రస్ఫూర్తి శోభిల్లఁ దాఁ కిన నా భూపతి చిత్రచాపధరుఁడై కేళీసమప్రక్రియన్ ధనువుం గేతువుఁ ద్రుంచి తోడన సముద్యద్దీప్తభల్లాహతిం దునిమెం గుండలకాంతమైన శిరమున్ దుర్దాంతదర్పంబునన్. |
288 |
| వ. | ఇట్లు శల్యుండు సోదర సహితంబుగాఁ బడినఁ బాండవసైన్యంబు జనంబులు వృత్రవధం బొనరించు పాకశాసనుఁ బ్రశంసించు బృందారకుల చందంబున నగ్గించి రమ్మొగ్గరంబునం దూర్యనినదంబులు సింహనాదంబులుఁ జెలంగఁ గలంగి కురుసేన విఱిగి పఱచినం బోనీక పొడువుం డనుచు సాత్యకి వెనుకొనుటయుఁ గనుంగొని కృతవర్ముండు మార్కొనియె. నయ్యాదవసింహులరణంబు దారుణంబయ్యె నందు. | 289 |
| సీ. |
కృతవర్మ సాత్యకి నతిశితశరదశ | కమున నొంచి తురంగముల యుబ్బు నుడిపి విల్దునుముటయును నొండువింట న | బ్బలియుఁ డాతని మేనఁ బదిమెఱుంగు టమ్ములు వఱపి రథ్యమ్ముల నరదంబు | సూతుని నఱికినఁ జూచి కృపుఁడు దనతేరిపైఁ బెట్టుకొని తొలఁగించె న | వ్వీరుపోరికి మూఁక వెఱచి పఱచెఁ |
|
| తే. |
గడఁగి వెనుకొన్న పాండవోత్కరము నొకఁడ | నిలువరించె నుద్దండుఁడై నీతనూజుఁ డంత వేఱొక్కతే రెక్కి యరుగుదెంచి | తాఁకె హార్దిక్యుఁ డరిసేన తల్లడిల్ల. |
290 |
| వ. | ఇ ట్లెదిర్చి పేర్చినయలుకఁ బాండవాగ్రజుండు గృతవర్ముని ఘోటకంబులను గీటడఁగించినఁ గురునందనుం డా హృదికనందనుని నిజస్యందనంబున నిడుకొని యవ్వలికిం గొనిపోయె నప్పుడు కృపాచార్యుండు గదిసిన నయ్యుధిష్ఠిరుం డాఱమ్ము లెమ్ములం గీలింప నతండు పదాఱుతూపుల నాభూపాలునిఁ దదీయ తురంగంబుల నేసె నా సమయంబున. | 291 |
| తే. |
భద్రకరి నెక్కి చామర ప్రకరవీజ | నములు ధవళాతపత్రవిభ్రమసమృద్ధి యతిశయిల్ల సైన్యోత్సాహ మావహిల్లఁ | బొలిచె నెంతయు భవదీయపుత్రుఁ డధిప! |
292 |