| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఆ. |
‘హరుఁడు దనదువీర్య మగ్నియం దిడిన వ | హింపఁజాల కజున కెఱుఁగఁ జెప్పి యతఁడు వనుప దాని నగ్ని గంగాగర్భ | భూతముగ నొనర్చె భూపవర్య! |
175 |
| వ. | తేజోమయం బైన యాగర్భంబు గంగ హిమవన్నగంబుమీఁద నముత్సృష్టంబు సేసినఁ గనకమయం బైనశరస్తంబంబున నగ్నిసన్నిభుం డగుకుమారుండై యొప్పె; నయ్యెడ మెలంగుకృత్తిక లక్కుమారుం గని పుత్రార్థినులై యందఱు నొక్కపెట్ట ‘వీఁడు మాకొడు’ కని పలుకుచుఁ గరతలంబుల నెత్త, నప్పు డయ్యార్వుఱ చన్నులుం జేఁపిన నద్దారకుండు చంద్రనిభంబు లైన యాననంబు లాఱు దాల్చి సప్తమాతృస్తన్యపానం బాచరించిన విస్మయప్రమోదభరిత లై వార లాశిశువు నెప్పటియెడన యునిచి; ర ట్లయ్యగ్నిభవుండు గాంగేయుండును శరజన్ముండును గార్తికేయుండును నయ్యె; నయ్యెడకు బృహస్పతి యేతెంచి జాతకర్మాద్యనుష్ఠానంబుల నిర్వర్తించి పోయెఁ; దత్ప్రదేశంబు దన మహానుభావంబున జాతరూప మయంబై యుండు. | 176 |
| క. |
విను మక్కుమారుఁ డుత్తమ | మనఁ దగియెడుతపము దనవిహారముగా వ ర్ధన మొందె ధాత్రి ధాత్రిగ | ధనురాగమమును శ్రుతులును దనుఁ గొలువంగన్. |
177 |
| వ. | ఒక్కనాఁ డక్కుమారుం జూచువేడుక శివుండు శైలకన్యకయుం దానుఁ బ్రకృష్టబలపరాక్రమంబులు నానాప్రకారవదనశరీరంబులు గలుగు ప్రమథ గణంబు గొలువ నయ్యెడకుఁ జనుదెంచె; నప్పుడు బ్రహ్మవిష్ణులును నింద్రాదిదిక్పాలురును రుద్రాదిత్యమరుద్వసుప్రభృతి సకలసురులును గరుడగంధర్వకిన్నరకింపురుష సిద్ధవిద్యాధరయక్షాది దివ్యులును మునులును మఱియుఁ బితృదేవతలును ననుచరసమేతులై యేతెంచిరి; మూర్తిమంతంబు లై యోషధిసరిత్సముద్రపర్వతంబులు నరుదెంచె; నిట్లు నిజదర్శనకౌతుకంబున వచ్చిన యమ్మహాసమూహంబున కభిముఖుండై యోగబలాన్వితుం డగు నబ్బాలుండు రా నన్నీలగ్రీవుండు నిరీక్షించి యంతర్గతంబున. | 178 |
| తే. |
‘ఉమయు నగ్నియు గంగయు నుండ నన్ను | గారవంబున నధికునిఁగాఁ దలంచి చక్క నాపాలి కేతెంచునొక్కొ! వీఁడు | సంభృతస్నేహ భక్తివిస్రంభుఁ డగుచు.’ |
179 |
| క. |
అనుచుండఁగ నమ్మువ్వురు | తనతన చిత్తమున నట్ల తలఁపఁగ నది యె ల్లను దివ్యబోధమునఁ గని | కొని య బ్బాలుండు యోగకుశలత వెలయన్. |
180 |
| వ. | మూర్తిచతుష్టయంబు దాల్చి యన్నలువుర యొద్దకు నేకకాలంబునం జనినం గని యెల్లవారు నద్భుతమగ్నమానసు లై; రక్కుమారుండు పదంపడి యొక్కరుం డై పొలిచి నిలిచె; నప్పుడు. | 181 |
| చ. |
హరుఁడును గంగయున్ శిఖియు నంబికయుం బ్రణిపాతపూర్వని ర్భర వినయంబుతోడఁ దగఁ బద్మజుఁ జేరి ‘మహాత్మ! యిక్కుమా రు రుచిరమూర్తికిన్ గుణగురుత్వవిభూతికి నీడు గాఁగ ని మ్మరసి యుదాత్త మైనపద’ మన్న నతండు ప్రియం బెలర్పఁగన్. |
182 |
| వ. | దేవహితపరుం డగుటం జేసి చిత్తంబునఁ దలపోసి ‘వీఁడు దేవసేనకుం బతి యగుంగాక!’ యని నిశ్చయించి వారల వీక్షించి యవ్విధ మెల్లవారును వినం దెలియఁ బలికి శక్రవరుణాదు లగుమేటి వేల్పుల నబ్బాలునకుం జూపి ‘వీరు నీకు రక్షణీయు’ లని యప్పగించె; నయ్యమరవరు లక్కుమారు నభిషేకంబు సేయుద మని వారిజాసనుం బురస్కరించుకొని యెల్లవారును దోడన యరుగుదేర సరస్వతీసమీపంబునకుం జని సకలరత్నమయం బైన దివ్యపీఠంబు హిమవంతుండు వెట్ట నం దా భూతపతిపుత్రు నునిచి బృహస్పతి హోమకార్యంబు నిర్వర్తింప నీశానవిష్ణు విధికౌశికులు లోనుగా నమర ముఖ్యు లభిషేకద్రవ్యంబులు సారస్వతజలపూర్ణ మణికనక కలశంబులు ధరియించి గంధర్వాప్సరోగణంబులు సంగీతమంగళం బాచరింప మహామునిప్రకర పుణ్యాహఘోషంబులు సెలంగ నుమా శ్రీసరస్వతీశచీప్రముఖ లైన పుణ్యాంగనలు దీవనలతో సేస లొలుక నభిషేకించి సమ్మోదంబున సేనాధిపత్యంబునకుం బట్టంబు గట్టిరి; తొల్లి తత్ప్రదేశంబున దేవతలు జలాధిపత్యంబునకు వరుణు నభిషిక్తుం జేసి; రవ్వరుణాభిషేకంబుకంటెఁ గుమారాభిషేకం బొప్పె; న ప్పావకసంభవునకుఁ గామదమన కమలభవశార్‌ఙఙఙ్గి శతమఖ ప్రముఖు లగు సకల ప్రభువులు దమతమయనుచరులయందు రూపగుణబలపరాక్రమాధికు లైన వారి నేఱి భీమఘంటాకర్ణ సంక్రమ దండధర సహితు లగు ననేకవీరుల నొసంగి వారల బెరసి వర్తించుటకుఁ దగిన సేనాంగసముదయంబు నమ్మహితాత్మునకు మూలబలంబుగా నొనర్చి; రబ్బలంబులఁ జిత్రాభరణ వర్మాయుధధరులును వివిధ ప్రకారాకారులు నగు గజకర్ణ నికుంభ కుముదాదు లైన సైనికులు మెఱసి యుల్లసిల్లి; రమ్మూఁకలతో శత్రుభయంకరంబు లగుచు మాతృకాగణంబులు ప్రభాసినీ విశాలాక్షీ పాలితాపురస్సరంబులై పొలిచె నట్టియెడ. | 183 |
| సీ. |
శంకరుఁ డుదిత భాస్కరనిభధ్వజమును, | వాసవుఁ డసురవిధ్వంసకరణ పరిణతశక్తియు, హరి బలవర్ధని | యగు వనమాలయు, నగజ యెపుడు మాయని వెలిపట్టుదోయిని, గంగ యు | జ్జ్వల సుధామయకమండలువు, గురుఁడు దీప్తదండము, వైనతేయుండు మహితమ | యూరంబు, వరుణుం డుదార రూప |
|
| తే. |
మైన తామ్రచూడంబును, నర్థవిభుఁడు | దర్పితచ్ఛాగమును, శతదళభవుండు లసితకృష్ణాజినంబును నసమసమర | జయము నొసఁగిరి ప్రీతి నా షణ్ముఖునకు. |
184 |
| వ. | ఇట్లు సిద్ధస్వరూపదీపితుం డైన యతని నాపోవక చూచుచు శంకరుండు ‘వీని కీ విభవంబునకు ననాయాసంబున నమరవిరోధి నాశంబు గావించుటకు వలయు’ నని తలంచి భూతమయం బగు మహాసైన్యంబు సమర్పించె; నప్పు డింద్రాదిబృందారకులు నిజబలసందోహంబులతో నాబర్హివాహనుఁ బరివేష్టించిరి; శంఖభేరీపణవగోముఖ ప్రముఖతూర్యంబులు దిక్కులు పిక్కటిల్లఁ జెలంగె; నట్లు మహతి యగు దేవసేనకుఁ బతియై యమ్మహాసేనుండు సురముఖ్యులఁ జూచి ‘మీ కెవ్వరి నేనియుం జంపను జెఱుపను వలసియున్నది యట్టిబల్లిదంపుఁ బగఱం బరిమార్చెద’ నని వరం బిచ్చిన వారలు బహుప్రమోదంబు నొందిరి; సేన యార్చినఁ ద్రిలోకంబులు నాదమయంబు లయ్యె; నవ్విధంబున విశాఖుని నుత్తమపదస్థునిఁ గావించి విరించి వైకుంఠ శ్రీకంఠులు నిజేచ్ఛఁ జనిరి; పదంపడి యగ్గుహుండు దేవతలు తారకాసురునివలన నలంగి యునికి యెఱింగి. | 185 |
| క. |
బలయుతముగ నడచిన న | బ్బలియుండు ననేకదైత్యబలములతో న గ్గలిక నెదురు నడచెను ద | ద్బలయుగమున కక్కజంపు భండన మయ్యెన్. |
186 |