పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
శ్రీకృష్ణుండు కరిపురంబుననుండి పాండవులయొద్దకు వచ్చుట (సం. 9-62-72)
వ. పొమ్ము, పునర్దర్శనమయ్యెడు’ మని వీడ్కొల్పిన వాసుదేవుండు వెడలెం; దదనంతరంబ వేదవ్యాసమునీశ్వరుండు వారలతో ‘మీకు శోకోపశమనంబుగ నిప్పుడు శౌరి సెప్పిన వచనంబు లాదరణీయంబులు సుండీ!’ యని యుపదేశించి వెండియు వలయు వాక్యంబుల వారికి నాశ్వాసంబు గావించి యంతర్ధానంబు సేసె; నిత్తెఱంగున గోవిందుండు కృతకృత్యుండై వెలువడి యరదం బెక్కియతి త్వరితగతి నోఘవతీతీరంబున కరిగి, పాండవులం గని, తాను ధృతరాష్ట్ర సన్నిధి గాంధారిం గనుటయు, వారలకు ‘దుర్యోధనుండు దెగియె’ నని నెట్టనం జెప్పక బెరసుంబల్కులుగా నయ్యాంబికేయుని యుపేక్షనుం గొడుకుల కీడునం దత్కులంబునకు సంక్షయంబు వాటిల్లుట యుగ్గడించుటయు, నాసందునఁ బాండవుల వలనఁ బాపంబు లేమి దెల్పుటయును, నారాజును దేవులును వారిం గోపింపకుండం బ్రార్థించుటయు నుపచారవచనంబుల చందంబున వార లా వృద్ధులకు నిస్తారకు లని పటుకుటయు, విశేషించి గాంధారికి నుచితభాషణంబుల నత్యంతోపశాంతి గలిగించుటయు, నప్పలుకు లన్నింటను దుది నయ్యిరువురు దయచేసినది సామాన్యంబున ననుష్ఠించిన యాపత్సమయ సమాగమంబుగాఁ గొనినమాత్రయ కాని యొండెఱుంగక యునికియు, నగ్గాంధారరాజనందన దనకు మగని నప్పగించుటయు నెఱింగించి, యంతక మున్న వచ్చి యావిచిత్రవీర్యుపుత్రుకడం బారాశర్యుం డున్న వాఁ డమ్మహాత్ముం డే నిట వచ్చిన పిదప నాదంపతులకు నాయొనర్చిన యుపదేశంబు దృఢం బగునట్టి మాట లాడనోపు ననియు, నతని యునికి యట్లుగాఁ దన పోయినపని సఫలం బగుటయుఁ, బాండునందనులకుఁ దెలియఁ జెప్పె నని వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 377
క. విను మోఘవతీతీరం | బున కమ్మెయిఁ బాండురాజపుత్రులు ప్రీతిం
జనిన తెఱఁగు సంజయుచే | విని ధృతరాష్ట్రుండు శోకవిహ్వలుఁ డగుచున్‌.
378
వ. అతని కిట్లనియె. 379
ఆ. ‘తొడలు విఱిగి నేలఁబడియుండఁ దలదన్ని | నట్టి భీమసేనుఁ డగ్రజుండు
ననుజచయముఁ దాను నరిగినపిమ్మట! నెట్టు లయ్యె నమ్మహీశ్వరుండు?’
380
వ. అని యడిగిన నమ్మానవపతికి నాసూతనూనుం డిట్లను ‘నేను బొదలో నుండి, యుధిష్ఠిరుండు యుద్ధ సమయంబు నిశ్చయించిన నీ కొడుకు పొలికలనికి నడచునప్పుడు వెడలి, పాండవపరిజనంబులం గలసి వారు నన్ను డాసినదృష్టిం గనుంగొన నక్కురపతికిం బొడసూపక చని, గదారణం బనుసంధించి యునికింజేసి యక్కౌంతేయు లరిగినయనంతరంబ యమ్మహీకాంతునికడకుం బొగులుచుఁ బోయితిఁ; బోయిన నతండు ధూళి పొదివిన వదనంబుపై నెఱసిన వెండ్రుకలు వాయంద్రోచికొని, నా మొగంబుఁ జూచి, ధర్మనందను నిందించుచు నవుడు గఱచి కన్నీరు గ్రమ్మ నిట్టూర్పు నిగిడించి. 381
తే. ‘నేల నాలుగు సెఱఁగులు నేలి భీష్మ | గురుకృపాదులపైఁ గార్యభరము నిల్పి
యున్న వానికి దుది నిట్టు లుండవలసెఁ | గాల సంప్రాప్త మేరికిఁ గడప వచ్చు?
382
క. ననుఁ బదునొకఁ డక్షౌహిణు | లనూనవిభవమునఁ గొల్వ నఖిల నృపులు పం
చిన పని సేసి మెలఁగి; ర | ట్లునికి గనిన నీవ యిట్టు లునికియుఁ గంటే?
383
ఆ. వాయునందనుఁడు గదాయుద్ధధర్మంబు | నుజ్జగించి నింద కోర్చి యిట్లు
సేసె నిత్తెఱంగు సెప్పుమీ! సంజయ! | మనకు నిపుడు గల్గుజనుల కెల్ల.
384
చ. అనిమిషవాహినీతనయు నస్త్రకళాగురు సౌమదత్తిఁ గ
ర్ణుని రణధర్మహీనతకు రోయక చంపినభంగులున్‌ మరు
త్తనయుఁడు నేఁడు సేసిన విధంబును లోకులు పాండురాజనం
దనతతిఁ బ్రువ్వఁ దిట్టరె? వృథావిజయం బిది యెంత యొప్పెడున్‌?
385
క. అనిలజుఁడు పోలెఁ గపటపు | టనువునఁ బగవారి నోర్చి హర్షంబునఁ దే
లునె? తూలపోనిమగఁటిమి | దనకుఁ గలుగునట్టి కీర్తి తత్పరుఁ డెందున్‌.
386
చ. మఱియు నొకండు వింటె? పవమాన తనూజుని చెయ్దిఁ బెన్దొడల్‌
విఱిగి ధరిత్రిఁ బడ్డయెడ వేగమె వచ్చి శిరంబుఁ దన్నె నే
డ్తెఱ గలయప్డు శత్రు నవధీరితుఁ జేయుట యొప్పుఁ గాక యే
పఱినఁ బరాభవించిన జనావళి నవ్వదె? నొవ్వదే మదిన్‌?
387
క. మనరాజును దేవులు భం | డనము తగవు నేర్పరించుటకు నేర్తురు; భీ
ముని చేసినయది సంజయ! | వినిపింపుము వారలకు సవిస్తారముగన్‌.
388
వ. మఱియును. 389
మ. చెలులం జుట్టలఁ బ్రోచి యర్థిజనులన్‌ శ్రీమంతులన్‌ జేసి, వి
ప్రుల భవ్యస్థితి మన్చి యాగములు పేరుం బెంపు శోభిల్ల ని
ట్టలపుం ద్యాగము దానమున్‌ నడపి నిష్ఠం బెక్కు సెల్లించి యు
జ్జ్వలతేజంబున నిద్ధభూతి భుజగర్వస్ఫూర్తిఁ బొల్పారితిన్‌.
390
క. పగవారి నాశ్రయింపక | మగఁటిమియును బ్రాభవంబు మానము నెందుం
బొగడొంద నుల్లసిల్లితిఁ | దెగునంతకు లక్ష్మితోఁ బ్రదీప్తుఁడ నైతిన్‌.
391
క. సమరము శమంతపంచక | సమీపమున ధర్మవృత్తిఁ జలుపఁగ నత్యు
త్తమ లోకము సమకూఱెను; | విమలాత్ముఁడ నైతి; నొండు వేయును నేలా?
392
క. ఎదిరి పెనగంగఁ జాలక నిదురవోవ | నొంచు తెఱఁగున, విషము వెట్టించు పగిది,
నింటఁ జిచ్చిడు చాడ్పున, నిట్లు సేసి | పడయుదురుగాక రాజ్య మప్పాండుసుతులు!’
393
వ. అని యంత నిలువక. 394
ఆ. ‘పాపకర్ము లయినపాండుతనూజులు | సమరధర్మ మెడలి జయము గొనుట
గురుసుతునకుఁ గృపునకుం గృతవర్మ కు | దేట పఱుపు నాదుమాట గాఁగ.
395
క. దేవవ్రతగురుకర్ణుల | దేవసములఁ బాడి దొఱఁగి తెగటార్చుటయున్‌
నీవు దలఁపించి వారల | తో వెండియు నిట్టు లనుము దుర్జనదూరా!
396
ఆ. కపటధర్మకంచుకంబున వెలసిరి | గాని సత్యపురుషకారపరులు
గారు పాండుసుతులు; వారల నమ్మంగఁ | గాదు సేత గుండెకాయ యిడిన.
397
వ. ఇది నామాట గాఁ జెప్పు’ మని పలికె నప్పు డచ్చేరువపల్లెలవారు దన్నుం జూడ వచ్చిన నజ్జనంబులఁ గలయం గనుంగొని గాంగేయుండును గుంభసంభవుండును మొదలైన బంధుమిత్రులను లక్ష్మణుండు లోనుఁగాఁ గల కుమారులను బేరుకొని వారు మున్ను సనుటం జెప్పి, వారు సనినలోకంబ తనకుఁ బాటిల్లుట యుగ్గడించి, తన దేవులును దుస్సలయు నాదిగాఁ గల యబలలు దాసు లేనిపిమ్మటఁ బొందుదురవస్థలు వాక్రుచ్చి పనవిన విని వారలు గన్నీరొలుక నుమ్మలికంబు గూరునుల్లంబులతోఁ జని; రందుఁ గొంద ఱశ్వత్థామ ప్రముఖరథికత్రయం బయ్యెడ మెలంగుట యెఱింగి వారలకు రాజరాజువార్త సెప్పిన వారలు సత్వరంబున నచ్చటి కరుదెంచి యరదంబు డిగ్గి. 398
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )