| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
సంవర్తుఁ బిలిచి యాసన పాద్యముఖ్యోప | చరణముల్ నడిపించి పరిసరమున నున్న నయ్యనలుఁ డయ్యుర్వీశ్వరునితోడ | ‘బలవైరి పనుప నీ పాలి కనఘ! యరుగుదెంచితి దూతనై’ యన్న నవ్విభుం | డవ్వాసవుండు సౌఖ్యమున వెలుఁగు చున్నాఁడె? యమరసముత్కరం బతనికిఁ | బ్రియ మాచరించి వర్తించుచున్నె? |
|
| ఆ. |
యాదరంబు గలదె నాదెస? నా సహ | స్రాక్షు నెమ్మనంబునందు హవ్య వాహ!’ యనుడు నతఁడు వసుమతీపతికి ని | ట్లనియెఁ గౌరవాస్వయాగ్రగణ్య! |
071 |
| క. |
‘సురనాథుఁడు దద్దయు సుఖి | సుర లాతనికిం బ్రియంబు సొలయక యెనరిం తురు నా దెస నాదర మ | ప్పురుషవరున కగ్గలంబు భూపవరేణ్యా! |
072 |
| వ. | నా వచ్చిన పని సెప్పెద నాకర్ణింపుము. | 073 |
| క. |
నీ జన్నమునకు ధిషణుఁడు | యాజకుఁడై మర్త్యు నిన్ను నమరత్వదశా భ్రాజిష్ణుఁ జేయు నమ్మెయి | రాజితముగ నాచరింపు క్రతుకార్యంబున్. |
074 |
| వ. | ఇది యింద్రుండు నీతోడం జెప్పుమన్న కార్యం’ బనుటయు నమ్మనుజనాథుం డమ్మహాత్ముతోడ. | 075 |
| ఆ. |
‘అనఘ! యేడు మ్రొక్కు లా బృహస్పతికి మ్రొ | క్కెద; నతండు నన్ను నదయవృత్తి నపహసించి తాను యాజకత్వమునకు | నెట్లుఁ జొరకయున్న నేను బోయి. |
076 |
| క. |
అనుజుం డతనికి నను పెను | పొనరిన సంవర్తు భక్తి నొడఁబఱిచి తగం గొనివచ్చితి మత్క్రతు యా | జన మీ యోగీశ్వరుండ చాలుం జేయన్.’ |
077 |
| ఆ. |
అనిన నగ్నిదేవుఁ ‘డమరగురుం డుప | ద్రష్టయైన వజ్రధరుఁడు నీకు నలఘుపుణ్యలోకములు సులభ్యములుగ | లీలఁ జేయు నట్లు మేలు గాదె!’ |
078 |
| క. |
అనవుడు సంవర్తుఁడు గడుఁ | గనలి యనలుతోడ ‘నిట్టిగతి నీ విం కా డిన మద్దారుణ దృష్టిని | నినుఁ గాల్తున్ మగుడు మిప్పనికిఁ దిరుగకుమీ. |
079 |
| చ. |
అనుటయు భీతి నగ్ని యమరాధిపు పాలికిఁ బోయి ‘యే మరు త్తునిఁ గని నెమ్మి నీ దగు క్రతుక్రియకున్ గురు యాజకుండుగాఁ గొనుమని చెప్పితిన్; విని యకుంఠితనిశ్చయుఁడైన యవ్విభుం డనిమిషమంత్రికిన్ వెఱతు నాతని తమ్మునిఁ గోరి తెచ్చితిన్. |
080 |
| వ. | ఈ యోగీశ్వరుండు మదీయాధ్వరంబునకు యాజకుండను పలుకుపలికి సంవర్తుం జూపె; నేనంత నిలువక పురుహూతునకుం బ్రియం బొనరించిన నీకుం బుణ్యలోకంబులు సిద్ధించునట్లు చేసిన మేలని తఱిమి చెప్పినను నప్పుడమిఱేఁ దొడంబడండ.’ | 081 |
| చ. |
అన విని యింద్రుఁ డిట్లనియె నగ్నికి ‘నిమ్మడివోయి చెప్పు మ జ్జనపతితోడ నా పలుకు సమ్మతిఁ జేయక తక్కె నేని నేఁ బనిచెద వజ్రమున్ జమునిపాలికి నన్నరనాథు వేగమే; యనుచుట కంత యెల్లిదమె యాతనికిన్ మన యాజ్ఞ యారయన్?’ |
082 |
| వ. | అని పలుకుటయుఁ బావకుండు పాకశాసను నాలోకించి. | 083 |
| సీ. |
‘ఇంక వచ్చిన దారుణేక్షణదగ్ధుఁ గా | వింతుఁ జుమ్మీ! యని విపులకోప మూర్తియై పలికె సంవర్తుండు గావున | వెఱతు నే నట వోవ; వేఱొకండు పోవుఁ గా’ కనవుడు దేవేంద్రుఁ ‘డన్యుల | నీవు దహింతు గా కే విధమున నొరులు నిన్ను దహింతురో! పేదమాట యి | ట్లాడుదే?’ యనుటయు నగ్ని పలుకు |
|
| ఆ. |
మూఁడులోకములును వాఁడి మగంటిమి | నేలుచున్నవాని నెట్లు వృత్రుఁ డాక్రమించె నిన్ను? నదియును గాక ప | ర్జన్య! మఱియు వినుము బ్రహ్మబలము. |
084 |
| సీ. |
సయ్యాతి క్రతువున నయ్యాశ్వినుల సోమ | పానంబు నీ కొడఁబాటు గాక పాయంగఁ బెట్టిన భార్గవచ్యవనుండు | వారికిఁగా సురవర్గసహిత ముగ నిన్ను బాధితుండుగఁ జేసె నిజమంత్ర | బలమున; దాని కీ వలిగి వజ్ర మేడ్తెఱఁ గొని యమ్మునీశ్వరు సాధింపఁ | గడఁగిన నగుచు బెట్టడఁచెఁ గాదె! |
|
| తే. |
యతఁడు పుడిసెఁడు నీరన యప్పు డతనిఁ | దెలచి సోమ మాశ్వినులకుఁ గలుగఁ జేసి తరయ నెందును బ్రహ్మ బలాతిశయముఁ | గడచినట్టి బలంబులుఁ గలవె? యనఘ! |
085 |
| క. |
అనవుడు ‘బ్రహ్మబలము గడు | ఘనమగు టెఱుఁగుదు; మరుత్తుఁ గాఱియఁ బెట్టం జనదే నా?’ కని శక్రుఁడు | పనిచెను గంధర్వలోకపతి ధృతరాష్ట్రున్. |
086 |
| వ. | పనుచునప్పు డతని కిట్లనియె. | 087 |
| తే. |
‘నీవు వోయి మరుత్తుని నెమ్మిఁ గాంచి | గురుని నీకు యాజకుఁడుగఁ గొనఁగవలయు; నట్లు చేయక యున్న వృత్రారి క్రోధ | దీప్తుఁడై కులిశంబుఁ బుత్తెంచు ననుము. |
088 |
| వ. | ఈ మాట సంవర్తుని సన్నిధిన యాడు ‘మని పలికిన నా ధృతరాష్ట్రుం డియ్యకొని సంవర్త సహితుండై యున్న మరుత్తునిం గని తాను గంధర్వుండనియును ననిమిషపతి పంపున వచ్చితి ననియుం జెప్పి, యప్పుడమిఱేనితో మఱియు నిట్లనియె. | 089 |
| చ. |
‘వినుము మదీయ బుద్ధి పృథివీవర! యాజకుఁ గాఁగ నీ మఖం బునకు బృహస్పతిం గొనుము; పూర్వదిశాపతి కవ్విధంబు ప్రీ తి నొసఁగు నట్లు సేయ కవధీరణచేసిత యేని వజ్రముం బనుచు నతండు నీపయి; సభాసదులున్ వినఁ జాటి చెప్పితిన్.’ |
090 |
| సీ. |
అనిన మరుత్తుఁ ‘డయ్యమరగురుండ నా | యాగంబు నడపుట కాత్మ రోసి రాకున్న సంవర్తుఁ బ్రార్థించి తెచ్చితి; | నింక నట్టులు సేయ కెట్లు వచ్చు ననఘ! మిత్రద్రోహ మధిక పాపముగాదె? | యిది నీ వెఱుంగు దయ్యింద్రుఁ డెఱుఁగు సిద్ధసాధ్యాది ప్రసిద్ధులు నెఱుఁగుదు | రిమ్మాట గురునకు నియ్యకోల’ |
|
| తే. |
యనుడు గంధర్వుఁ ‘డదె విన నయ్యె వజ్రఘోరనాదంబు నీ కోర్వఁ గలది యగునొ కాదొ నీవ యెఱుంగుదు మేదినీశ! | యనుటయును నృపుఁ డాలించి విని భయమున. |
091 |
| వ. | సంవర్తు నాలోకించి. | 092 |
| క. |
‘కులిశము వచ్చుచు నున్నది | యలు కొందెడు నా మనంబు ననఘచరిత! స భ్యులు సంత్రాసము నొందిరి | తలకొని రక్షింపవలయు దయ మమ్మెల్లన్.’ |
093 |
| వ. | అనిన విని యమ్మహాయోగీశ్వరుండు. | 094 |
| సీ. |
‘ఇంద్రునిదెస భయం బించుకేనియు వల; | దతఁడు నన్నెఱుఁగఁడే యధిప! వినుము సంస్తంభవిద్యా ప్రశస్తవైభవమున | వజ్రంబు నడఁతు నవ్వాసవాది దైవతంబుల యాయుధంబులు నాచేతఁ | బ్రతిహతం బొందు; దుష్పవనచండ వృష్టిప్రముఖమహా వికృతుల బాధింతు’ | ననుడు ‘మ్రోయుచు నిదె యరుగుదెంచె |
|
| ఆ. |
భిదుర మెవ్విధమున భీతి దొఱంగుదు?’ | ననియె నృపతి; యాతఁ డల్ల నగుచు దాని సరుకుగొనకు ‘తగు వర; మడుగు నా | తపము పేర్మి నిత్తు ధరణినాథ!’ |
095 |
| చ. |
అనిన మరుత్తుఁ డిట్లనియె నాతనితో ‘భయమెల్లఁ బాసి నే నిను వరమర్థి వేఁడెద మనీష విరోధము దక్కి యధ్వరం బున కిట వచ్చి దైవతవిభుండు నిజోచిత హవ్యభాగముం గొనియెడు నట్లు గాఁగ మునికుంజర! చిత్తమునం దలంపవే. |
096 |
| క. |
తమ భాగంబులు దక్కిన | యమరులునుం బ్రీతిఁ గొనఁగ యాగంబు ప్రయో గము సుప్రణీతమయి లో | కమనోజ్ఞము గాఁగవలయుఁ గారుణ్యనిధీ!’ |
097 |
| క. |
అనుటయును ‘మదాహ్వానం | బున నింద్రుఁడు సోమపానమున కేతెంచుం జనుదెంతు రతనితోఁ ద | క్కిన యమరులుఁ దొడఁగు యజ్ఞకృతికి నరేంద్రా!’ |
098 |