పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
శ్లేష్మాది రోగవికారంబుల నిరూపించుట (సం. 14-17-14)
ఆ. ‘అర్హకర్మలోప మపచయ మొనరించు | ననఘ! దేహమున కనర్హవేగ
ధారణములు రోగతతి జనింపఁగఁ జేయుఁ | గామరోషములను గాయ మెడలు.
170
క. అత్యంతప్రబలంబులు | పైత్యవికారములు రేఁగి ప్రాణములకు శీ
ఘ్రాత్యయముం జేయు మహౌ | ద్ధత్యంబున నెలవు వెడల దఱిమి సుచరితా!
171
తే. అవ్వికారంబు లెక్కుడై యడరి యెచ్చ | టెచటు భిన్నంబు సేయు నయ్యెడలు మర్మ
నామకంబులు మర్మభిన్నత్వ మెట్లు | సేయకుండుఁ బరిచ్యుతి జీవమునకు?
172
క. వినుము తెలియంగ శ్లేష్మం | బను దోషం బారఁ బరగి యవయవములు జా
డ్యనిరూఢంబులుగాఁ జే | యును లోపలి బయలు నెల్ల నొయ్యన కప్పున్‌.
173
వ. పదంపడి. 174
క. కుత్తుకకు నడ్డుపడు, నూ | ర్పొత్తిలి పోనీక యాఁగు, నూర్ధ్వశ్వాసం
బెత్తఁగఁ జేయును; జీవుం | డత్తనువున నుండనేర కంతట వెడలున్‌.
175
క. స్రోతోమార్గంబులఁ జూ | వే తమ కర్హంబు లైన విషయంబులఁ బ్ర
స్ఫీతమతిం జాతుర్యో | పేతములై యింద్రియంబు లేనును బట్టున్‌.
176
క. స్రోతోమార్గములు గఫము | చేత నిరుద్ధంబు లైనఁ జెడు నింద్రియజా
తాతతశక్తులు దానను | వీతములగుఁ జేష్టితములు విను మనుజులకున్‌.
177
తే. వాయు వంగంబులందు దుర్వ్యాప్తిఁ గదిరి | నొవ్వుఁ దెవులును బుట్టించుఁ, గ్రొవ్వు సెఱుచు,
సందు లెడలించుఁ గ్రమమున నెందుఁ బరఁగి | తనువు మ్రానుగఁ జేసి జీవుని వెలార్చు.
178
క. నాలుక యాడుట కేలుం | గాలు ముడుఁపఁ జాఁప నగుట కాయంబున యం
దీ లీలలు వాయుగతుల్‌ | మేలే నివి గలుగుఁ దక్కు మే లమలాత్మా!
179
క. ఎక్కటి యిట్టివి దోషము | లొక్కొకమఱి రెండు మూఁడు నొదవి బెరయుఁ దా
నక్కీడు సన్నిపాతం | బక్కజముగఁ దనువుఁ బాపునది జీవాత్మున్‌.
180
క. ఈ విధమున వెడలి చనిన | జీవుఁడు నిజకర్మజాలసిద్ధగతులకుం
బోవుం; దద్భవసుఖ దుః | ఖావేశముఁ బొందుచుండు నయ్యై యెడలన్‌.
181
క. కృతకర్మఫలము దెగఁ గుడి | చి తనకుఁ దగినట్టి పుట్టు సెందు మగుడ ని
ట్టి తెఱంగున జీవాత్ముఁడు | గతాగతము లనుభవించుఁ గల్మషరహితా!
182
క. పాపాత్ములు నరకముఁ బు | ణ్యోపేతులు దివము విధి నియుక్తి నవశతం
బ్రాపింతురు గావున ని | ర్లేపంబగు మోక్ష మొందలే రట్టి జనుల్‌.
183
తే. ఊర్ధ్వగతి కేఁగు మానవు లుండునట్టి | నెలవు లార్యులు శాస్త్రసునిశ్చయమునఁ
గని యెఱింగింతు రవి నీవు వినుము నీకుఁ | దెలియునట్లుగఁ జెప్పెద ధీసమగ్ర!
184
తే. సోముఁ డనఁ దారకము లన సూర్యుఁ డనఁగ | గలుగు తేజస్విమూర్తుల నెలవు లందు
ధర్మపరు లుండుదురు తారతమ్యములకు | మనసు లెరియునట్టివి గడుమంచి వగునె?
185
క. అదియును గాక ఫలంబులు | దుదిముట్టఁగఁ గుడిచి వెడల ద్రోవఁబడుదు ర
ట్టిది సౌఖ్య మగునె? శాశ్వత | పదంబు మోక్షంబ కాక భవ్యవిచారా!’
186
వ. అని చెప్పి ‘గర్భావాప్తి ప్రకారం బెఱింగించెద విను’ మని పలికి సిద్ధుం డా భూసురున కిట్లనియె. 187
తే. ‘అశుభములును శుభమ్ములు నైన కర్మ | ముల ఫలంబులు గుడువక పోవఁ గాదు
మన్యువశగత మైన యాత్మకు నుదాత్త | చరిత! యది కారణము సువ్వె! జన్మమునకు.
188
క. ఎనయఁగ శుక్లము శోణిత | మును బెరసి వెలంది గర్భమున నెలకొను న
ప్పని బ్రహ్మశక్తి బీజ | త్వ నిరూఢిం బొనరు నవి వొదలుఁ బిండంబై.
189
క. విను మా బీజము పిండము | తనువునఁ జైతన్యరూపతం బరఁగి శిరం
బును గేలుఁ గాలు నుదరం | బు నురము వెన్ను నను నంగముల నేర్పఱుచున్‌.
190
వ. అని చెప్పి. 191
క. జననార్హవేళ వెలువడి | తన తొల్లిటి కర్మములకుఁ దగిన వివిధవ
ర్తనములఁ బొందు; నవి దెగినఁ | జని మఱియుం బుట్టుఁ గర్మసంతతికిఁ దగన్‌.
192
క. నరుఁ డెంత కాల మేనిం | బరమం బగు ముక్తిపదముఁ బడయక యుండుం
బురుషవర! యంతకాలముఁ | బొరిఁ బొరి నిబ్భంగిఁ జావుఁ బుట్టువు నొందున్‌.
193
సీ. కావున ముక్తికిఁ గారణంబగు దాని | నేర్పడఁ జెప్పద నెఱిఁగికొనుము;
దానంబు శమమును దమమును బ్రహ్మ | చర్యంబును వ్రతపరిరక్షణంబు
దయయును బరధనదారవర్జనమును | నియమయమేంద్రియనిగ్రహములు
జననీజనకగురు జనపూజలును దేవ | తాతిథిపితృదేవతార్చనములు
 
తే. సత్యమును శౌచమును శుభసంవిధాన | నిరతియును ధైర్యమును గ్రౌర్యనిరసనమ్ముఁ
గలిమి పుణ్యవృత్తం బిది గలుగు నరుఁడు | మొనయు దీని నూఁతఁగ గొని మోక్షమునకు.
194
క. పదపడి ధర్మాచరణము | వొదలుం దత్పూక్ష్మవిధము బుధజనుల కడం
గదలక నిలిచి యెఱిఁగికొన | విదితంబగు వారి శీలవృత్తములఁ గడున్‌.
195
క. వారలు చెప్పెడి శాంతో | దారవచనసమితి వినఁగఁ దద్గత బహుగం
భీరార్థము లంతఃకర | ణారూఢము లైనఁ బొరయ వాపద లెందున్‌.
196
సీ. వ్రతపరినిష్ఠమై వర్తించుచుండి యిం | ద్రియవిజయమును శాంతియును గలిగి
బ్రహ్మైకభజనతత్పరుఁ డగుచుండెడు | నతనికి బ్రహ్మంబు హుతవహుండు
సంస్తరంబును యోగ్యసమిధలు జలమును | మంత్రంబు గురుఁడు బ్రహ్మంబ యిట్టి
సచ్చరణంబు సూక్ష్మబ్రహ్మచర్యంబు | దీనియం దుత్తమ స్థిరత గలుగు
 
తే. వాఁడు హర్షశోకోద్దామ వాయుహతుఁడు | గాఁడు మేదుర మోహాంధకారమున వె
డంగుపడఁడు సంసారనిస్సంగసిద్ధిఁ | బొందుఁ గాలక్రమమున నప్పురుషవరుఁడు.
197
వ. అని చెప్పె మఱియును. 198
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )