పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము
జీవాత్మస్వరూప నిరూపణప్రకారము (సం. 14-25-3)
సీ. ‘కరణంబు కర్మంబు కర్త యన్నేతద్వి | రాజితకారకత్రయముచేత
నఖిలంబు సంవ్యాప్తమై యుండు ఘ్రాణాదు | లును మనంబును బుద్ధియును బ్రవరులు
కరణహేతువు లండ్రు గంధాది విషయ సం | తతియు మంతవ్యబోద్ధవ్యములును
గర్మహేతువు లగుఁ గంపుకొనఁగ నానఁ | గాన ముట్టఁగ వినఁగా దలంప
 
తే. నిశ్చయము దగఁ జేయంగ నేర్పు లేడు | గలవు జీవాత్మునకు నవి కర్తృహేతు
భూతములు వాన విషయానుభూతి నతఁడు | దొఱఁగు నిష్ఠలు మోక్షహేతువులు సుమ్ము.
051
వ. కరణకర్మకర్తృకారకాత్మకుండును జీవాత్ముండు భోక్త యగుట దక్కి వివిధవిషయమూర్తులగు హవిస్సుల నుదాసీనత్వస్రుగ్గతంబులు సేసి వేల్చు నిష్ఠ నాత్మస్వరూపం బగు ననలంబు ప్రజ్జ్వలితం బయి యవిద్యాధూమ రహితం బగుచుం బొలుచు; నది మోక్షప్రకారం బట్లు గాక భోక్త యగు’ నేని నట్టిద బంధ ప్రకారం బని నిర్దేశించి ‘ముక్తభావంబునకు మూలం బయిన యోగయజ్ఞంబునం దేను బ్రవృత్తుండనై యున్నవాఁడ; దానికి సర్వపరిత్యాగంబు దక్షిణ; దాన సకలాత్ముండగు నారాయణుండు ప్రీతుండై స్వీకరించు; నద్దశ పేరు మునులు ముక్తి యని చెప్పుదు’ రని చెప్పి యన్విప్రుండు వెండియు. 052
సీ. ‘శాస్త యొక్కండ తచ్ఛాసనంంబునన యేఁ | జరియింతు నొక్కండ గురుఁ డతండు
సెప్పిన యర్థంబు చిత్తంబులో నుంతు | శ్రోత యొక్కండ తద్‌జ్ఞాతబుద్ధి
నెగడుదు నొక్కండ వగవంగ విద్వేష్ట | వాని వ్రాల్చినదిక్క వ్రాలి యెడరుఁ
గడపుదు గడవంగఁ గారణమయ్యెడు | తెఱఁగు పెద్దలచేత నెఱిఁగినాఁడ
 
తే. వినుము దేవతలును మునులును బరమేష్ఠి | యొద్ద కరిగి ‘మాకు నెద్ది హితమొ’
యనిన నా విధాత యక్షరోపాసన | మనియెఁ గాన దుర్గ మబల! కడతు.
053
వ. ఇంక నెక్కడ గడచెద! మున్న కడచితిఁ గ్రోధతిమిరంబును లోభవ్యాళంబును గామదస్యుదూషితంబును నగు దుర్గంబు గడచి యొక వనంబు ప్రవేశించితి ‘ననిన విని ‘యవ్వనిత యవ్వనం బెట్టి?’ దని యడిగిన నమ్మహాద్విజుం డిట్లనియె. 054
ఉ. అంతకుఁ బిన్నలున్‌ వెదక నంతకుఁ బెద్దలు లేవు దుఃఖ మ
త్యంతముఁ జేయ సాఖ్య మెసలార నొనర్పఁగ నొం డొకంటి యం
దంతటి నేర్పు లేదు వెఱ పన్నది యేమియు నవ్వనంబు ని
శ్చింతతఁ జొచ్చియున్న నరుఁ జెందరు నిర్వృతి సెందు నుగ్మలీ!
055
తే. కొన్నిటికిఁ బంచవర్ణముల్‌ గుసుమఫలము; | లందుఁ గొన్నిటి కేకవర్ణాంచితంబు
లవనిజములు కొన్నిటికి నవ్యక్తవర్ణ | కములు సౌరభ్యమాధుర్యసమధికములు.
056
వ. అవ్విపినంబున. 057
క. వృక్షంబులకుం గలుగును | దీక్షాగుణములును నతిథితృప్తికృతియుఁ బ
ద్మాక్షీ! యతిథులు బ్రహ్మ స | దృక్షులు సౌఖ్యంబు నిట్టఁ దేలుదురు మునుల్‌.
058
ఆ. కెలఁకులకును మింటికిని మేర లివి యన | రాదు గాన యయ్యరణ్యభూమి
వెలుఁగు లొండ్లు సొరపు వినుము క్షేత్రజ్ఞుండు | రవి దదీయసేవ భవముఁ బాచు.
059
క. మృగనయన! బ్రహ్మసంభవ | మగు జలము వహించుచుండు నందుల నదులన్‌
నగములు విను దానఁ దప | స్విగుణం బవ్యయపదంబుఁ జెందం గాంచున్‌.
060
వ. అట్టి దవ్విపినంబు. 061
ఆ. మాననీయనియతి మహితతపోధన | వంతులైన యట్టివారు శాంతి
దాంతి నిస్పృహతలు దలకొన సుసమాహి | తాత్ములై వసింతు రందు సాధ్వి!’
062
వ. అని చెప్పి మఱియును. 063
సీ. ‘వినుము మూర్కొనఁ జవిగొన దర్శనస్పర్శ | నము లాచరింప వినంగ నెలయ
నేమి సంకల్పము నెడఁ జేర్ప నిష్టార్థ | ములను ననిష్టార్థములను గోరు
టయును నొల్లక త్రోచుటయును స్వభావవకృ | త్యము లవి గనుఁగొంచు నబల! వానఁ
బొరయ నెట్లన్న మేల్‌ దొరకొనుఁ గోరక | యును బోదు కీడు ద్రోచినను దీని
 
తే. నెఱిఁగి యేను స్వభావంబునెడఁ బయోజ | పత్రగతజలబిందువుభంగిఁ దాల్తు’
నని యెఱింగించి బ్రాహ్మణుఁ డతివతోడ | మఱియు నిట్టను శాత్రవమథనకల్య!
064
వ. ‘ఒక్కయెడ నధ్వర్యునకు యతికిం గలిగిన సంవాదంబు సెప్పెద నాకర్ణింపు; మధ్వర్యుండు పశువుం బ్రోక్షించుచుండ యతి నిరీక్షించి ‘యిది హింస గాదె?’ యనిన నతండు. 065
తే. ‘ఛాగ మిది యరయంగ నాశంబు బొంద | దూర్ధ్వలోకసుఖంబుల నొందుఁగాని
శ్రుతుల వాక్యముల్‌ నీ కెక్క సూనృతంబు | లగున యేని నీ విట్లంట యనుచితంబు.’
066
వ. అని వెండియు నప్పశువు నుద్దేశించి. 067
క. ‘భూతములు నింద్రియంబులు | నాతతగుణ! యాత్మ యోనులందుఁ గలయఁ బిం
డేతరుఁ డగు జీవుఁడు సౌ | ఖ్యాతిశయం బొందు నధ్వరాతిశయమునన్‌.’
068
క. అని పలుకుటయును యతి యి | ట్లను ‘ఛాగము పుణ్యగతికి నరిగెడుఁ బో యి
ప్పని నీ కెవ్విధము ప్రయో | జనంబు సిద్ధించుఁ? జెపుమ సమ్యక్ఫణితిన్‌.’
069
వ. అనుటయు నధ్వర్యుం డతని కిట్లనియె. 070
క. ‘అగమము పశువిధిం దగ | యాగ మొనర్చినఁ ద్రివిష్టపానేక మహా
భోగానుభూతి భవ్య స | మాగమ మగు ననుట బొంకె? యాగమవేదీ!
071
చ. అనవుడు ‘హింస పాప మని యాగమవాక్యములంద కాదె! యేఁ
గని యిటు లంటి’ నన్న యతిఁ గన్గొని ‘నీవు సమాధిఁ బ్రాణరో
ధనము మనోలయంబు సుకృతంబులుగా నొనరించి వెండి యో
గ నిరతిఁ బొందె; దత్తెఱఁగు గాదొకొ హింస? దలంచి చూడఁగన్‌.’
072
వ. అని పలికిన నయ్యధ్వర్యునకు నయ్యతిముఖ్యుం డిట్లనియె. 073
చ. ‘పరమతపంబు గాఢపరిపాకము నొందినఁ జిత్సుఖాత్మకా
క్షరమునఁ జిత్తభూతగుణజాలతనున్‌ క్షరమున్‌ వివేకితా
పరిణతిఁ; బాపి చూచి యనపాయసుఖస్థితి నూఁది పొల్లలం
బొరయక త్రోపు హింస యనుబుద్ధి విమూఢత గాక బోధమే?
074
చ. అనవుడు నాతఁ ‘డార్యవచనామృత మానినవాఁడు కీడుమేల్‌
గనుఁగొనఁజాలు; నేను బశుకార్యమునప్పుడు మీ రనుగ్రహిం
చిన క్రియఁ జూడనేర్తుఁ జిదచిద్ద్వయమున్‌ విభజించి దాన హిం
సనము నొకింతయుం బొరయ జన్నము సేయుదు మేలు నొందుదున్‌.’
075
క. అనుటయు నతనికి యతి యి | ట్లనుఁ ‘బశుయజ్ఞమున కంటె ననఘ! తపోయ
జ్ఞనిరూఢి మేలు గావున | వినిపింపఁ దలంచి యంటి వేయును నేలా?’
076
వ. అనవుడు నమ్మాటకు నయ్యధ్వర్యుం డొడంబడియె’ నని చెప్పి యాభూసురపర్యుం డా భామినితో ‘నీ యర్థంబున కొక్కయితిహాసంబు గల దాకర్ణింపుము. సహస్రబాహుండగు నర్జునుండు దుర్జయప్రతాపంబున నఖిల ద్వీపంబులు నేలి వ్రాలి తనకు నెదురు లేకున్న విజృంభించి పరశురాముం దొడరి యతనికి నత్యంతం బప్రియంబాచరించిన నతండు బహుశాఖోపశాఖాశోభితంబయిన పాదపంబు నుఱుముగా నఱకి పడవైచిన చందంబునం బరశుఖండితసర్వాంగునిం జేసె; నంత నిలువక తత్పక్షంబు రాజులు గూడికొని తదీయ తనయులుం దారు నా రాముని యసన్నిధి నతని జనకుం డగు జమదగ్నిం జంపినం బెంపారు కోపంబున నాటోపం బెసంగ నా జామదగ్న్యుండు రాజుల నెల్లం దరమిడి యిరువదియొక్కమాఱు పరశుధారపాలుచేసిన నతనికిఁ బితృదేవతలు సన్నిధి సేసి. 077
ఆ. పరశురామ! నీవు బ్రాహ్మణుండవు నరే | శ్వరులఁ జంపనేల? వలవ దుడుగు
మయ్య!’ యనుడు నాతఁ ‘డట్లనకుం డుఁ డీ | రేను రాజ పశు విధానమునను.’
078
క. సారనియతిఁ బాటించి మ | హారోషాగ్ని పరితృప్త మగునట్టులుగా
వీరాధ్వరంబు సేసెద | వారింపక యరుగుఁ’ డనిన వా రాతనితోన్‌.
079
క. ‘యజ్ఞంబులలోనఁ దపో | యజ్ఞం బుత్తమము; దాని నాదరణమునం
బ్రాజ్ఞోత్తమ! చేయుము స | ర్వజ్ఞుఁడు ప్రీతుఁ డగు శాంతరస మొప్పుఁ జుమీ!’
080
వ. అని చెప్పి మఱియు నిట్లనిరి; ‘తొల్లి యలర్కుం డను రాజు మనస్‌స్పృష్టంబు లగు నింద్రియంబులు గలిగి దివ్యాస్త్రంబులు ప్రయోగింపం జూచిన నవి నయ్యవనిపతితో నయ్యప్రియంబులం దారు సెడ మనియును రోషావేశంబునం బ్రయోగించిన నతండ చెడు ననియునుం బలికి ‘యోపుదేని నీ తపోమయంబు లైన యస్త్రంబులు సంధింపు’ మనిననతండు క్రోధంబుదక్కి యోగంబున శాంతి నొంది వానిం దద్రూపతపఃఫలాస్త్రసాధితంబులం జేసె; నీవునుం దపంబున నంతశ్శత్రుజయసౌఖ్యం బనుభవింపుము బాహ్యశత్రుజయంబు జయంబుగాఁ గొనకుము.’ 081
క. అని నిష్ఠించి పలుక న | వ్వినుతచరిత్రుండు శాంతివిభవంబున మా
నిన మనసుతోడ ముని మా | ననపాత్రం బైన తపమునన మే లొండెన్‌.’
082
సీ. అని చెప్పి బ్రాహ్మణుం డయ్యింతి కిట్లనుఁ | ‘దొమ్మిది గుణములు కొమ్మ! కలవు
స్తంభాభిమానహర్షంబులు సాత్త్విక | ములు; క్రోధసంరంభములును శోక
మును రాజసంబులు మోహతంద్రాస్వప్న | ములు తామసము లిట్లు గలుగు రిపులఁ
దునుమ నే యస్త్రంబు లనువగు వాన న | య్యంతర శత్రుచయంబు నెల్లఁ
 
తే. దునిమి యేనింద్రియంబుల మనము నోర్చి | శాంతి నొంది శ్రేయస్సిద్ధి సాధనం బొ
నర్చునది ముఖ్యవైరి నిర్ణయముఁ జేయు | నంబరీషగీతలు విను మంబుజాక్షి!
083
వ. అంబరీషుం డనురాజు రాజనీతిపరత్వంబునం బరమప్రభుత్వంబు నొంది యరాతుల నెల్ల విగతాసులం జేసి పూజ్యం బగు రాజ్యంబు పరిపాలించుచుండి యొక్కనాఁడు విద్వజ్జనంబులతో నిట్లనియె. 084
తే. ‘అరుల నెల్ల జయించియు నది జయంబు | గాఁ గొనక యున్నవాఁడ; నగ్గలపుఁ బగ జ
యింప కున్కిఁ దద్విజయవిహీనుఁ దృష్ణ| జనిజరామృత్యువశగ వర్తనునిఁ జేయు.
085
క. అంతటి లోభము గెలువక | శాంతి గలదె?’ యని తదీయశక్తి నడఁచి ని
శ్చింతత్వ మొంది యా భూ | కాంతుఁడు సామ్రాజ్యమున సుఖస్థితి వడసెన్‌.
086
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )